25/10/2022
చిరకాలం నుంచీ మీరంతా నా కుటుంబ సభ్యులు”;
“రాక్షసత్వం అంతమైనందుకు నిర్వహించుకునే పండుగే దీపావళి”;
“మనం గౌరవించే భారతదేశం కేవలం భౌగోళిక ప్రాంతం ఒక్కటే
కాదు… ఇదొక జీవాత్మ… సుస్థిర చైతన్యం… అమరత్వ భావన”;
“అంతర్గత శత్రువులపై కఠిన చర్యలు చేపడుతుండగా
సరిహద్దులో మీరు రక్షణ కవచంగా ఉన్నారు”;
“రక్షణ పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోవాలని…
400కుపైగా పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయరాదని
నిర్ణయించుకున్న మన సాయుధ బలగాలను అభినందిస్తున్నాను”;
“కొత్త సవాళ్లు.. కొత్త పద్ధతులు.. మారుతున్న రక్షణ అవసరాలకు
అనుగుణంగా దేశ సైనిక బలగాలను మేం సిద్ధం చేస్తున్నాం”
దీపావళి రోజున సాయుధ బలగాలతో గడిపే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధానమంత్రి ఈ ఏడాది కూడా కార్గిల్‌లోని వీర జవాన్లతో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ- కార్గిల్ గడ్డపైగల గౌరవం తనను సదా సాయుధ బలగాల సాహస పుత్రులు, పుత్రికలవైపు ఆకర్షిస్తుందన్నారు. “చిరకాలం నుంచీ మీరంతా నా కుటుంబంలో భాగమయ్యారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జవాన్ల సమక్షంలో దీపావళి మాధుర్యం మరింత ఇనుమడిస్తుందని, వారిలో ఉట్టిపడే దీపావళి ప్రకాశం తన స్ఫూర్తిని ఉత్తేజితం చేస్తుందని నొక్కిచెప్పారు. “ఒకవైపు దేశ సార్వభౌమ సరిహద్దులు.. మరోవైపు నిబద్ధతగల సైనికులు.. అటు మాతృభూమిపై ప్రేమ, ఇటు వీర జవాన్లు.. ఇంతకన్నా గొప్ప దీపావళి వేడుకను మరెక్కడా నేను ఊహించలేను” అన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతులలో భాగమైన ఈ పరాక్రమం, ధైర్య సాహస గాథలను భారతదేశం ఉల్లాస-ఉత్సాహాలతో వేడుక చేసుకుంటుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “ఇవాళ కార్గిల్‌లోని విజయభూమి నుంచి భారతదేశంసహా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌పై యుద్ధాలన్నిటిలోనూ కార్గిల్ విజేతగా నిలిచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని మించినదేదీ లేదని ప్రధాని నొక్కి చెప్పారు. నేటి ప్రపంచంలో భారతదేశం ఆకాంక్ష గురించి ప్రస్తావిస్తూ- ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శాంతి-శ్రేయో పథాన్ని ఈ వెలుగుల పండుగ ప్రకాశింపజేయాలని ప్రధాని ఆకాంక్షించారు. దీపావళి ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. “ఇది రాక్షసత్వానికి అంతం పలికినందుకు నిర్వహించుకునే పండుగ” అని ప్రధాని అభివర్ణించారు. కార్గిల్ విజయానికి దీపావళితో సారూప్యాన్ని వివరిస్తూ… ఆ విజయోత్సవాల జ్ఞాపకాలు నేటికీ సజీవంగా ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
కార్గిల్ పోరాటానికి తానొక సాక్షినని, ఈ యుద్ధాన్ని సమీపం నుంచి పరిశీలించానని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. యుద్ధ సమయంలో శత్రుదాడిని దీటుగా తిప్పికొడుతున్న సమయంలో జవాన్లతో గడపడానికి వచ్చిన 23 ఏళ్ల కిందటి తన ఛాయాచిత్రాలను భద్రపరిచి, ఇప్పుడు చూపించడంపై అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “ఓ సామాన్య పౌరుడిగా నా కర్తవ్యం నన్ను యుద్ధక్షేత్రంలోకి నడిపించింది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశప్రజలు సేకరించిన సామగ్రిని సైనికులకు చేర్చడానికి తాను వచ్చానని గుర్తుచేస్తూ, అది తనకు ఆరాధనీయ క్షణమని ప్రధాని పేర్కొన్నారు. ఆనాటి వాతావరణం గురించి ప్రస్తావిస్తూ- ప్రతి వ్యక్తి మనస్సు, శరీరం, ఆత్మ ఈ లక్ష్యానికి కట్టుబడి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. ఆ విజయంతో మన చుట్టూగల వాతావరణం మొత్తం ఉప్పొంగిన ఆనందోత్సాహాలతో నిండిపోయిందని ప్రధాని అన్నారు.
“మనం గౌరవించే భారతదేశం కేవలం భౌగోళిక ప్రాంతం ఒక్కటే కాదు; ఇదొక జీవాత్మ… సుస్థిర చైతన్యం… అమరత్వ భావన” అని ఉద్వేగంతో వ్యాఖ్యానించారు. “మనం భారతదేశం గురించి మాట్లాడుతున్నపుడు- భారత సజీవ సంస్కృతి కళ్లకు కడుతుంది.. మన వారసత్వ చైతన్యం హృదయం లోతుల నుంచి పెల్లుబుకుతుంది.. భారత ఔన్నత్యం ఇనుమడించడం మొదలవుతుంది” అని ప్రధాని అభివర్ణించారు. ఒకవైపున ఆకాశాన్నంటే హిమాలయాలతో మొదలై మరోవైపు హిందూ మహాసముద్రాన్నిట చుట్టుముట్టే ఇటువంటి ఆయుధ స్రవంతికి భారతదేశం నిలయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో మునుపు వికసించిన అనేక నాగరికతలు ఇసుక రేణువుల స్థాయిలో రూపుమాసిపోయాయని, ఒక్క భారతదేశ సాంస్కృతిక స్రవంతి మనుగడ మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ గడ్డపై జన్మించిన వీర కుమారులు, కుమార్తెలు తమ శక్తియుక్తులు, వనరులపై పూర్తి విశ్వాసం ప్రదర్శిస్తేనే దేశం అమరత్వం పొందుతుందని ఆయన స్పష్టం చేశారు.
కార్గిల్ యుద్ధ క్షేత్రం భారత సైన్యం ధైర్యసాహసాలకు ప్రతీక. “భారత సాయుధ దళాల శౌర్యపరాక్రమాల ముందు పర్వత శిఖరంపై ఉన్నప్పటికీ శత్రువు మరుగుజ్జుగా మారిపోతాడని చెప్పడానికి ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ రుజువులు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత సరిహద్దుల పరిరక్షకులు దేశ భద్రతకు మూలస్తంభాలని ఆయన అన్నారు. సరిహద్దులు భద్రంగా.. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా.. సమాజంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నపుడే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. మన దేశం శక్తిసామర్థ్యాలకు సంబంధించిన సమాచారం విన్నప్పుడు యావద్దేశానికీ మనోధైర్యం ఇనుమడిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
దేశప్రజలలో సంఘటిత భావనను ప్రస్తావిస్తూ- స్వచ్ఛభారత్ మిషన్, విద్యుత్తు-నీటి సదుపాయాలతో సకాలంలో పక్కాఇళ్ల నిర్మాణం వగైరాలను ప్రధానమంత్రి ఉదాహరించారు. దీనిపై ప్రతి సైనికుడూ గర్విస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సేవలు తమ ఇళ్లకు చేరడం ఎంతో దూరంలోగల జవాన్లకు నిజంగానే ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన అన్నారు. ఇక అనుసంధానంలో వేగం విషయానికొస్తే జవాన్లు తమ ఇళ్లకు కాల్ చేయడం సులువైందని, సెలవుల్లో ఇంటికి చేరడంలోనూ సౌలభ్యం కలిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 7-8 ఏళ్ల కిందట 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఇటీవల 5వ స్థానంలోకి దూసుకెళ్లడాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే 80,000కుపైగా అంకుర సంస్థలతో దేశం ఆవిష్కరణల కర్మాగారంలా నిత్యం వర్ధిల్లుతుండటం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ దిశగా రెండు రోజుల కిందటే ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించి ‘ఇస్రో’ సరికొత్త రికార్డు సృష్టించిందని గుర్తుచేశారు. ఇక ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో త్రివర్ణ పతాకం భారతీయులను రక్షణ కవచంలా ఆదుకున్న తీరును కూడా ప్రధాని ప్రస్తావించారు.
భారతదేశం ఇంటాబయటా శత్రువులను విజయవంతంగా నిలువరిస్తుండటమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి వివరించారు. “మేము అక్కడ అంతర్గత శత్రువులపై కఠిన చర్యలు చేపడుతుండగా మీరిక్కడ సరిహద్దులో రక్షణ కవచంగా నిలుస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదాల నిర్మూలనకు దేశం విజయవంతంగా కృషి చేస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఒకనాడు దేశంలో అధికశాతాన్ని కమ్ముకున్న నక్సలిజం గురించి మాట్లాడుతూ- దాని పరిధి నిరంతరం తగ్గిపోతున్నదని ప్రధాని గుర్తుచేశారు. అలాగే అవినీతి నిరోధం గురించి ప్రస్తావిస్తూ.. భారతదేశం ఈ మహమ్మారిపై నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు “అవినీతిపరుడు ఎంత శక్తిమంతుడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు” అన్నారు. దుష్పరిపాలన మన అభివృద్ధికి అడ్డంకులు సృష్టించి దేశ సామర్థ్యాన్ని పరిమితం చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్’ మంత్రంతో ఆనాటి లోపాలన్నింటినీ వేగంగా అధిగమిస్తున్నాం” అని ఆయన చెప్పారు.
ఆధునిక యుద్ధాల్లో సాంకేతిక పరిజ్ఞానాల పురోగతిపై దృష్టి సారిస్తూ- భవిష్యత్ యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోనుందని, ఈ కొత్త యుగంలో కొత్త సవాళ్లు, కొత్త పద్ధతులు, జాతీయ భద్రతలో మారుతున్న అవసరాలకు తగినట్లు దేశ సైనిక బలగాన్ని సిద్ధం చేస్తున్నామని ప్రధాని వివరించారు. సైన్యంలో భారీ సంస్కరణలు ఎంతో అవసరమన్న భావన దశాబ్దాలుగా ఉన్నదని గుర్తుచేస్తూ- ఎలాంటి సవాలునైనా తక్షణం తిప్పికొట్టగలిగేలా మన దళాల మధ్య మెరుగైన సమన్వయం కోసం అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నామని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. “ఈ దిశగా ‘సీడీఎస్’ వ్యవస్థను సృష్టించాం. సరిహద్దులలో అత్యాధునిక మౌలిక వసతుల నెట్‌వర్క్ ఏర్పాటు ద్వారా జవాన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ విధులు నిర్వహించేలా చేశాం” అని ఆయన చెప్పారు. దేశంలో అనేక సైనిక పాఠశాలలు కూడా ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు.
స్వయం సమృద్ధ భారతం అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- భారత సైన్యం ఆధునిక, స్వదేశీ ఆయుధాలు కలిగి ఉండటమే దేశ భద్రతలో అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ మేరకు దేశ రక్షణలోగల త్రివిధ దళాలు విదేశీ ఆయుధాలు, వ్యవస్థలపై మన పరాధీనతను తగ్గించుకోవాలని నిర్ణయించడంతోపాటు స్వావలంబనకు ప్రతినబూనాయని ప్రధానమంత్రి తెలిపారు. “రక్షణ పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోవాలని… 400కు పైగా పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయరాదని నిర్ణయించుకున్న మన సాయుధ బలగాలను అభినందిస్తున్నాను” అన్నారు. స్వదేశీ ఆయుధాల వినియోగంతో కలిగే ప్రయోజనాలను ప్రస్తావిస్తూ- భారత జవాన్లు దేశీయ ఆయుధాలతో విరుచుకుపడితే వారి ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటడమేగాక ఆ దాడులు శత్రువులను చకితుల్ని చేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలిస్తూ- ‘ప్రచండ్’ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, ‘తేజస్’ యుద్ధ విమానాలు, భారీ విమాన వాహకనౌక ‘విక్రాంత్’లను ఆయన ప్రస్తావించారు. అలాగే ‘అరిహంత్, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, పినాక, అర్జున్’ వంటి భారత క్షిపణి బలాన్ని కూడా ప్రముఖంగా వివరించారు. ఇవాళ భారతదేశం తన క్షిపణి రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతోపాటు రక్షణ పరికరాల ఎగుమతిదారుగా అవతరించిందని పేర్కొన్నారు. డ్రోన్ల వంటి ఆధునిక, సమర్థ సాంకేతికత పరిజ్ఞానంపైనా వేగంగా ముందుకు వెళ్తున్నదని ఆయన అన్నారు.
“యుద్ధాన్ని చిట్టచివరి మార్గంగా ఎంచుకునే మన సంప్రదాయాన్ని మనం అనుసరిస్తాం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికి భారత్ సదా అండగా ఉంటుందన్నారు. అయితే, “యుద్ధానికి మేం వ్యతిరేకమే.. కానీ, యుద్ధం చేయగల శక్తి లేకపోతే శాంతి సాధన అసాధ్యం” అని శ్రీ మోదీ ఉద్వేగంగా అన్నారు. మన సైనిక బలగాల సత్తా, వ్యూహనైపుణ్యం సాటిలేనివని, శత్రువులెవరైనా మనవైపు కన్నెత్తి చూసినా మనదైన రీతిలో ఎలా తిప్పికొట్టాలో సైన్యానికి తెలుసునని ఆయన అన్నారు. బానిస మనస్తత్వ నిర్మూలనకు చేపట్టిన కృషిపై ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఇటీవల ప్రారంభించిన ‘కర్తవ్య పథం’ గురించి ఉదాహరించారు. ఇది నవ భారతంలో సరికొత్త విశ్వాసాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. “అది జాతీయ యుద్ధ స్మారకమైనా లేక జాతీయ పోలీసు స్మారకమైనా నవ భారతావనికి కొత్త గుర్తింపునిస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నావికాదళ పతాక చిహ్నం మార్పును కూడా ప్రధాని గుర్తుచేస్తూ- “శివాజీ పరాక్రమ స్ఫూర్తి ఇవాళ నావికాదళం జెండాకు జోడించబడింది” అన్నారు.
భారత్‌పైనా దేశానికిగల వృద్ధి సామర్థ్యంమీద ప్రపంచమంతా నేడు దృష్టి సారించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశానికిగల ఈ శక్తికి స్వాతంత్ర్య అమృత కాలం ప్రత్యక్ష సాక్షి కాబోతున్నదని శ్రీ మోదీ అన్నారు. “ఈ విజయపథంలో మీరు పోషించాల్సిన పాత్ర ఎంతో కీలకమైనది… ఎందుకంటే- భారతదేశానికి గర్వకారకులు మీరే” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చివరగా భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తూ ఓ కవితను చదివి వినిపించి ఆయన తన ప్రసంగం ముగించారు.