08/08/2023
** రమణ లీల*
*శక్తి లీలా ఖండము*
*షష్ట ప్రకరణము**
*సన్నిధి*
దినదినమును తిరిగి, తిరిగి, దిక్కులేక శరణు జొచ్చి । తనువు, ధనము నీదె అంటి త్యాగరాజనుత బ్రోవ „
వేకువజాము. చీకటి క్రమంగా తగ్గుతున్నది. రైలు ఎక్కింది మొదలు "అరుణాచలం ఏది? ఎక్కడ?" అని సంభ్రమంతో ఎదురుచూస్తున్నాడు. అది దగ్గరవుతున్న కొద్దీ ఉత్కంఠ ఎక్కువైంది.
మొదట లీలగా, ఆ తర్వాత కొంచెం స్పష్టంగా, దగ్గరవుతున్న కొద్దీ స్పష్టత పెరుగుతూ అరుణగిరి శిఖరం, మధ్యభాగం, పాదం, పాదాలనంటి దేవాలయ గోపుర శిఖరాలు కనిపించాయి. వేంకటరామన్ హృదయం ఆనందంతో నిండిపోయింది. శరీరం కంపించింది. నేత్రాలనుండి కారుతున్న నీరు, తనకు ఇష్టమైన అరుణగిరి శిఖరాన్ని చూడటానికి అడ్డు వస్తోంది. ఇది ఆరు వారాలపాటు రేయింబగళ్ళు ప్రార్ధన చేసిన పిమ్మట ఫలించిన పితృసన్నిధి. ప్రాప్తి. ఎవరికీ చెప్పకుండా తన హృదయంలోనే రహస్యంగా పెంచిన ప్రియలతా కుసుమ వికాసం అది. మూడు జన్మల క్రితం పోయిన పెన్నిధి మరల ఇప్పుడు దొరికింది కదా! వేంకటరామన్ ఆనందానికి అవధి లేదు. క్రొత్తగా ఒక వస్తువు లభించినదానికంటే పోయిన వస్తువు దొరకటం ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందదాయకం కదా!
రైలు స్టేషను చేరగానే, వేంకటరామన్ లేడివంటి పరుగుతో దేవాలయంలోకి పరిగెత్తాడు. ఉషఃకాలంలో ఎవరి అనుమతి కోరకుండా, ఎదురు చూడకుండా భగవంతుని సేవించుకొనే వాయుదేవుడు (గాలి) తప్ప ఇంక ఇతరులెవ్వరూ లేరు. ఆ వాయుదేవుని గుసగుసలు కూడా ఆగిపోయాయి. వేంకటరామనక్కు ఇంకేమీ వినబడలేదు. అపుడు దేవాలయంలో జీర్ణోద్ధరణ జరుగుతోంది. ఎనిమిది గంటలదాకా ఎవరూ తలుపులు తీయరు, ఎవరూ ఉండరు. కానీ, ఆ రోజు చిత్రంగా తలుపులు బారులుగా తీసి వున్నాయి. జనకుడు రహస్యంగా తనయునికి చేస్తున్న ఉపదేశమేమో? పవిత్ర భావోన్మాదుడైన ఈ తనయునితో ఏకాంతంగా కలుసుకోవాలని వున్నదేమో? "ఈ ప్రపంచంలో కాదు, ఈ గర్భగృహంలో ఎలా నన్ను వెతికావో, అలాగే నీ హృదయకుహర మధ్యలో వెతికితే నన్ను కనుగొంటావు" అని ఉపదేశించడానికోఏమో
వేంకటరామన్ నేరుగా గర్భగృహంలోకి ప్రవేశించి, "అప్పా! నీ ఆజ్ఞ మేరకు వచ్చి నన్ను అర్పించుకొన్నాను" అని విన్నవించుకున్నాడు.
హృదయంలో వున్న భావోద్వేగం మాయమైంది. భావ సంఘర్షణ. తగ్గింది. శాంతి వర్షించింది. ఆ అనుభవం సుఖదుఃఖాలకు అతీతం. అయినా సుఖమనే చెప్పాలి. కన్నీటి వర్షం ఆగింది. రసమయం ఆనందమయంలో లీనమైంది. శరీరమంతటా వున్న ఆ యాతన, మంట ఆ లింగమును దర్శించగానే మాయమైంది. త్రివిధ (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక) తాపములు అదృశ్యమైనవి. అనిర్వచనీయమైన ఆనందం ప్రసరించి ముంచి వేసింది.
ఇంతవరకు ఈ ప్రపంచంలో వివిధ వేషములతో నాట్యమాడుచున్న కుమారుడు, ఇక పితృ సన్నిధిని వీడడు. ప్రపంచానికి, తనకు గల సంబంధం తెగిపోయింది. లోకానికి జనకుడే శుభాన్నిచ్చు గాక! తనకు అరుణాచలుడే ఆశ్రయం. అతని సన్నిధిని తాను వీడడు.
"యం లబ్వాచాపరం లాభం మన్యతే నాధికం తతః"
ఈ ప్రపంచ కల్లోలమునకు వీడ్కోలు, పరమశాంతికి స్వాగతం. ఇట్లు "కాయేన వాచా మనసేంద్రి యైర్వా, బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్" తనను. ఆయనకు అర్పించినందున, ఇక ఏమి జరిగినా సర్వమూ జనకుని భారం. ఇలా తన సర్వస్వాన్ని సమర్పించడం, ఆత్మార్పణం చేసింది ఎవరికి? తన జనకుడైన ఈశ్వరునికే కదా! ఆ ఈశ్వరుడు ఎవరు? ఎదురుగా చూస్తున్న ఆ లింగమా? అరుణాచలం అనే ఆ గిరియా? ఆ లింగమూ కాదు, ఆ గిరీ కాదు. “నీవు గిరి అనగానే శిరస్సు వాలిపోయినది" అని కదా భగవాన్ అన్నారు.
తాను శరీరంకన్నా భిన్నమైన సద్వస్తువు. దేహం తనను కప్పిన ఆవరణం మరియు కోశం. ఈ లింగం, కొండ రెండూ తన జనకుని కప్పివేయు ఆవరణం మరియు కోశం. లేకపోతే సాటిలేని, సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు ఈ చిన్న వస్తువులో మాత్రమే పరిమితుడై వుంటాడా? ఇవన్నీ 'పరిమితి లేని, ఈ ప్రపంచానికి మూలాధారమైన, ఈ ప్రపంచానికి భిన్నమైన, లో-వెలుపల వ్యాపించిన, ఈ ప్రపంచానికి అతీతమైన, సకల కార్యములకు మూలకారణమైన, సమస్తమునకు నియామకమైన, స్వతహాగా బంధరహితమైన తత్త్వానికి చిహ్నాలు.
ఆ తత్వానికి తన బరువునంతా అప్పగించాడు. ఈ జనకుని తత్త్వమేమిటి? తన అహానికి; ఈ జగత్తును సృష్టించి, పరిపాలించి, చివరకు లయం చేసుకునే ఆ పరతత్వానికి గల సంబంధాన్ని ఎలా కనుగొనాలి? ఆ సద్వస్తువును ఎవరైనా తమకు తామే కనుగొనాలి.
వరుణుడు “తపసా విజిజ్ఞాసస్వ" (తపస్సు చేసి కనుగొనుము) అని భృగువుకు చెప్పాడు కదా!( సమాప్తం )