
01/08/2025
రాధా రిషి - ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 20 నిమిషాల సంగీత దృశ్య లఘు చిత్రం.
ఎ ఆర్ రహమాన్ పాట లాగ మొదటి సారి వింటే కొంచెం స్లో గా ఎక్కినా, ఇంకో రెండు సార్లు వింటే మాత్రం మిమ్మల్ని “అడగవా అడగవా.. నిజం ఏమైందో” అంటూ రోజంతా వెంటాడుతూ మీతోనే ప్రయాణిస్తుంది ఈ పాట. తప్పకుండా మన జ్ఞాపకాల దొంతరలని తడుముతుంది. ఎలాగైతే అన్ని దినుసులు సరి పాళ్లల్లో కలిపి వండితే కమ్మటి భోజనం తయారవుతుందో, ఈ పాట కూడా అమెరికాలో ఐటీ రంగంలో పని చేస్తూ సినిమాటోగ్రఫి , యాక్టింగ్ రంగాల్లో అభిరుచి కలిగిన ఫణి శివరాజు మదిలో పుట్టిన ఒక ఆలోచనకు ఇంకొక ఐటీ కుర్రోడు శ్రీ అన్నప్రగడ లిరిక్స్ రాస్తే , దానికి భరద్వాజ్ అద్భుతమైన సంగీత స్వరకల్పన చేస్తే, బాక్సులు బద్దలు కొడుతూ సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న తమన్ ఈ పాటని ప్రశంసించి లాంచ్ చేయడం ఆశామాషి వ్యవహారం కాదు. సినీరంగంలో యువత హృదయాలను కొల్లగొడుతూ తన గాత్రంతో తనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరుచుకున్న ప్రముఖ గాయకుడు కార్తీక్, ఇంకొక ప్రముఖ గాయని లక్ష్మీ మేఘనల గాత్రం ఈ పాటకు మరింత సొగసులు అద్దింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ పాటకి తమ నటనతో, చక్కటి హావా భావాలతో మన హృదయాల్ని బరువెక్కించే పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు ఫణి శివరాజు, కుషిత కల్లపు, లక్ష్మి తేజ. వీరందరినీ సమన్వయం చేస్తూ , తన చక్కటి నటనతో దర్శకత్వ భాద్యతలు చేపట్టిన ఫణి శివరాజు తెర ముందు నటిస్తూనే, తెర వెనుక ఎన్నో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడం అనేది మనకు ఈ రోజు ప్రతి ఒక్కరినుండి లభిస్తున్న ఆదరణ అని చెప్పకనే చెప్పవచ్చు. ఇక చివరగా ఇంత చక్కటి పాటకు, సరయన రీతిలో దృశ్యరూపం ఇచ్చిన సినిమాటోగ్రఫర్ రాజ్ తిగుటి ప్రతిభని అభినందించాల్సిందే!
అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తూనే, తమ ప్రతిభతో మేమేమీ తక్కువ కాదు అని నిరూపించిన చక్కటి సంగీత, దృశ్య, లఘు చిత్రం రాధారిషి. మ్యాంగో మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో విడుదల అయ్యి అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ మ్యూజికల్ ఆల్బమ్ మీకు కూడా తప్పకుండా నచ్చుతున్నందని నమ్ముతున్నాను.
సినిమాటోగ్రాఫర్ గా నాకు పరిచయం అయిన ఫణి, ఎన్నోసార్లు తన కెమరాతో నాకు సాయం అందించినా , ఇటీవల విడుదల అయిన నెస్ట్ మూవీతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసినా, ఇప్పుడు రిషి పాత్రతో నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగాడనడం అతిశయోక్తి కాదు. అలాగే నెక్స్ట్ మూవీకి చక్కటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అబ్బురపరచి, నేను రూపొందించిన బతుకమ్మ పాటకు అద్భుత సంగీతాన్నందించిన భరద్వాజ్ ఇద్దరూ నాకు నర్జీనియాలో చిరకాల మిత్రులు. ఇంత చక్కటి మ్యూజిక్ ఆల్బమ్ అందించిన ఈ ఇద్దరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ వీడియోలో పెళ్లి సందర్భంలో తళుక్కున మెరిసే అవకాశం కల్పించిన ఫణీకి ధన్యవాదాలు. -వేణు నక్షత్రం
Radha Rishi Video Song on . Radha Rishi Latest Musical video ft. Phani Sivaraju,Kush*tha Kallapu and Lakshmi Theja SG. Directed by - Phani Sivar...