02/12/2021
*💥అరుదైన దృశ్యం.అరుదైన గొప్ప ఫోటో* ☘️
🎊💦🌹🦚🌈🌻🍁
*నిజంగా ఇదొక అరుదైన గొప్ప ఫోటో. ఈ ఫోటో తీసింది అలనాటి మదరాసు* *నగరంలో 1947 ఆగస్టు 15 వ తేదీన. భారత ప్రథమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ' చివరకు మిగిలేది' రచయిత, ప్రముఖ తెలుగు నవలాకారుడు* *బుచ్చిబాబు గారు నిర్వహించిన వేడుకలకు విచ్చేసిన పలువురు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీరంగ ప్రముఖులను మనం* *ఈ గ్రూప్ ఫొటోలో చూడవచ్చు. బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) అప్పట్లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఉద్యోగం చేస్తూ మద్రాసులోనే ఉండేవారట. అప్పటికి ఇంకా తెలుగు, తమిళ, కన్నడ,* *మలయాళ చలనచిత్రాల నిర్మాణానికి మదరాసు నగరమే ఉమ్మడి కేంద్రంగా ఉండేది.*
*ఈ ఫొటోలో కింద నేలమీద కూర్చున్నవారు ( ఎడమ నుంచి కుడికి వరుసగా*
*1. సుందరీబాయి - ఈమె పూర్తి పేరు యం. యస్. సుందరీబాయి. ( 1923- 2008). ఈమె సుప్రసిద్ధ తమిళ సినీ నటి, గాయని, నర్తకి. 1940 దశకం నుంచి 1970 దశకం వరకు ఆమె తమిళ చిత్రసీమను ఏలారు. కణ్ణమ్మ, అవ్వయ్యార్ పాత్రల పోషణకు ఆమెకు గొప్ప కీర్తిప్రతిష్ఠలు వచ్చాయి. మదనకామరాజన్, నందనార్,* *మిస్ మాలిని వంటి ఎన్నో చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఆమె సుప్రసిద్ధ తమిళ రచయిత, నటుడు, దర్శకుడు పద్మశ్రీ కొత్తమంగళం సుబ్బు సతీమణి. తమిళ చిత్రాలు ఆసక్తిగా చూసేవారికి* *సుందరీబాయి ' వంజిక్కోట్టై వాలీబన్' ( తెలుగులో 'విజయకోట వీరుడు') చిత్రంలో ధరించిన విప్లవ వనిత రంగమ్మ పాత్ర, ' చంద్రలేఖ' చిత్రంలో సర్కస్ కళాకారిణి పాత్ర కలకాలం గుర్తుండిపోతాయి.*
*2. తులసి ( తమిళ, మలయాళ గాయని - వివరాలు తెలియవు).*
*3. రావు బాలసరస్వతీ దేవి సుప్రసిద్ధ తెలుగు, తమిళ నటి,* *గాయని. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఈమె 1936 లోనే తెలుగు నటిగా ' సతీ అనసూయ', ' భక్త ధృవ' చిత్రాలతో ప్రారంభించి, ఆ* తరువాత నటిగా, గాయనిగా పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలకు పనిచేసి *కీర్తిప్రతిష్ఠలు గడించారు. తెలుగులో శాంతినివాసం (1960), శభాష్ రాజా*
*( 1961) ఈమె పనిచేసిన చివరి చిత్రాలు. ' పలుకరాదటే చిలుకా' (షావుకారు), '* *అందం చూడవయా ..* *ఆనందించవయా'*
*( దేవదాసు), 'తానే మారెనా' ( దేవదాసు), '* *మదిలోని మధురభావం .. పలికేను మోహనరాగం'*
*(జయసింహ), ' మనసైన చెలీ* *పిలుపూ .. విసరావేల ఓ చందమామా ' ( జయసింహ), '* *ధరణికి గిరి భారమా .. గిరికి తరువు భారమా .. తరువుకు కాయ భారమా .. కనిపెంచే తల్లికి పిల్ల* *భారమా' ( మంచిమనసుకు మంచి రోజులు) వంటి అద్భుతమైన పాటలు విన్నవారు ఎవరైనా రావు బాల సరస్వతి గాత్రాన్ని ఎలా మరచిపోతారు ? తెలుగు* *చలన చిత్రసీమలో 1943 లో మొట్టమొదటిగా నేపథ్యగానం చేసింది ఆమే. ఆమె సేవలకు గుర్తింపుగా ఆమెకు రామినేని ఫౌండేషన్ వారి అవార్డు (2003 ) లభించింది.*
*4. తులసి చెల్లెలు ( పేరు, వివరాలు తెలియలేదు)*
*బల్లలపై కూర్చున్నవారు ( ఎడమనుంచి కుడికి వరుసగా ) --*
*1. పెంటపాడు పుష్పవల్లి - తెలుగు తమిళ నటి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈమె మొదటి భర్త రంగాచారి. సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత సుప్రసిద్ధ తమిళ నటుడు జెమినీ గణేశన్ తో ఈమె సహజీవనం చేశారు. సుప్రసిద్ధ హిందీ నటి రేఖ ( భానురేఖ) ఈమెకు, జెమినీ గణేశన్ కు కలిగిన ఇరువురు కుమార్తెలలో పెద్దది. మరొక కుమార్తె రాధ. పుష్పవల్లి బాలనటిగా నటించిన '* *సంపూర్ణ రామాయణం' విడుదలనాటికి ఆమెకు కేవలం తొమ్మిదేళ్లే. తమిళంలో ' మిస్ మాలిని', తెలుగులో ' సత్యభామ' చిత్రాలు నటిగా ఈమెకు మంచి పేరు తెచ్చాయి. మిస్ మాలిని ( 1947) జెమినీ గణేశన్* *మొదటి చిత్రం. అప్పటికింకా విడాకుల చట్టం రాని కారణంగా ఈమెకు రంగాచారితో విడాకులు సాధ్యపడక, జెమినీ గణేశన్ తో రహస్య సంబంధం కొనసాగించింది. 1955 లో సావిత్రిని జెమినీ గణేశన్ వివాహం చేసుకున్నాక అతడికి పుష్పవల్లి దూరమైంది.* *మోహినీ భస్మాసుర చిత్రంలో మోహినిగా, వరవిక్రయంలో కమలగా, తారాశశాంకంలో తారగా, బాలనాగమ్మ (1942) లో సంగుగా, వింధ్యరాణి లో వింధ్యరాణిగా, చెంచులక్ష్మిలో లీలావతిగా, బందిపోటులో యన్ టి ఆర్ తల్లిగా, అమరశిల్పి జక్కణ్ణలో రాణి శాంతలా దేవిగా, భూలోకంలో యమలోకం, ప్రతిజ్ఞాపాలన వంటి జానపద చిత్రాలలో* *రాణిగా ఈమె గుర్తుంచుకోదగిన పాత్రలలో నటించింది. 1991 లో ఈమె మరణించారు.*
*2. కృష్ణవేణి - ఈమె సుప్రసిద్ధ తెలుగు, తమిళ, కన్నడ చిత్ర కథానాయిక, గాయని, నిర్మాత. 1936 లో బాలనటిగా ప్రవేశించి, 15 తెలుగు చిత్రాలు, కొన్ని తమిళ, కన్నడ చిత్రాలలో నాయిక పాత్రలు పోషించిన ఈమె స్వస్థలం రాజమండ్రి. నాటకరంగం నుంచి ఈమె సినీరంగంలో ప్రవేశించింది. మీర్జాపురం జమీందారును వివాహం చేసుకున్న తరువాత నిర్మాతగా మారి మనదేశం (1949),* *లక్ష్మమ్మ, దాంపత్యం, భక్త ప్రహ్లాద వంటి చిత్రాలు నిర్మించారు. మనదేశం చిత్రం ద్వారా ఎన్ టి ఆర్ ను చలన చిత్ర నటునిగా పరిచయం చేసింది ఆమే. యస్ వి రంగారావునూ ఆమే పరిచయం చేశారు. అలాగే గాయకునిగావున్న ఘంటసాలకూ, రమేష్ నాయుడుకూ సంగీత దర్శకులుగా తమ చిత్రాలలో తొలి అవకాశం ఇచ్చారామె. కీలుగుఱ్ఱం(1949), బాలమిత్రుల కథ (1972) చిత్రాలలో ఆమె పాడిన* *పాటలు ఆమెకు గాయనిగానూ పేరు తెచ్చాయి. 2004 వ సంవత్సరానికి చలన చిత్ర రంగానికి జీవితకాలపు సేవలు అందించినందుకు ఆమెకు ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.*
*3. మాలతి - ఈమెను మాలతి అనేకంటే 'పాతాళభైరవి రాకుమారి' అంటేనే ప్రేక్షలు బాగా గుర్తుపడతారు. ఏలూరుకు చెందిన ఈమె భర్త వీరాచారి ప్రొత్సాహంతో నటిగా సినీ రంగప్రవేశం చేశారు. వాహినీ వారి 'సుమంగళి' లో 'వస్తాడే నా బావ' పాటతో ఈమెకు మంచి గుర్తింపు* *వచ్చింది. భక్తపోతన, గుణసుందరి కథ చిత్రాలలో మంచి పాత్రలు ధరించిన తరువాత విజయా వారి పాతాళభైరవి చిత్రంలో ఈమెకు రాజకుమారి ఇందుమతి పాత్ర ఒక వరంగా లభించింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినా ఆమెకు ఆ తరవాత గొప్ప అవకాశాలేవీ రాలేదు. ఆమె హిందీ* *చదువుకున్నది కనుక పాతాళభైరవి హిందీ వెర్షన్ లో ఆమె తన సంభాషణలు స్వయంగా చెప్పుకున్నారు. 'కాళహస్తి మాహాత్మ్యం' లో కన్నప్ప భార్యగా గుర్తుంచుకోదగ్గ పాత్ర ధరించింది. ఎన్ టి ఆర్ నిర్మించిన ' శ్రీ తిరుపతి* *వెంకటేశ్వర కళ్యాణం' (1979) ఆమె చివరి చిత్రం. 1984 లో హైదరాబాద్ లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ బాత్ రూమ్ లో ఉండగా ప్రమాదవశాత్తూ కూలిన గోడ కింద పడి దుర్మరణం పాలయ్యారు.*
*4. ప్రసిద్ధ మలయాళ నటి ప్రేమ. ఆమె 50 చిత్రాలకు పైగానే నటించినా దాదాపు* *అన్నీ తల్లి పాత్రలు, సహాయ పాత్రలే. సుప్రసిద్ధ మలయాళ రచయిత ఎస్. కె. పొట్టెక్కాట్ మేనకోడలైన ప్రేమ కె. పి. మీనన్ ని పెళ్లాడింది. సుప్రసిద్ధ తమిళ, మలయాళ సినీ నటి శోభ వీరి కుమార్తె. శోభ తన* *17 వ ఏటనే జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందడం అరుదైన విశేషం. ఆమె తమిళ, కన్నడ, మళయాళ చలనచిత్ర సీమలలో ఎన్నో సార్లు ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటి అవార్డులు అందుకుని, బాలు మహేంద్రను పెళ్ళాడి, తన 17 వ ఏటనే 1980 లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. 1984 లో ప్రేమ కూడా తన కుమార్తె లాగే ఆత్మహత్య చేసుకుని మరణించడం విశేషం, విచారకరం.*
*5. టి. ఆర్. రాజకుమారి. తమిళ తెరమీద మొట్టమొదటి డ్రీమ్ గర్ల్ గా పేరొందిన రాజకుమారి ప్రఖ్యాత నటి, నర్తకి. ఆమె సుప్రసిద్ధ దర్శకుడు టి. ఆర్. రామన్న సోదరి. చంద్రలేఖ, మనోహర, గులేబకావళి వంటి తమిళ చిత్రాలు చూసినవారికి ఆమె అందం, నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.*
*6. శాంతకుమారి. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఈమె అసలుపేరు వెల్లాల సుబ్బమ్మ. సుప్రసిద్ధ తెలుగు నటి, గాయని. సుప్రసిద్ధ తెలుగు సినీ దర్శకులు పురందాసు పుల్లయ్య భార్య. స్వంత చిత్ర నిర్మాణ సంస్థ పద్మశ్రీ ద్వారా ' వెంకటేశ్వర మహత్యం', '* *సిరిసంపదలు', ' ప్రేమించి చూడు ' వంటి చక్కని చిత్రాలు నిర్మించారు. కరుణరసాత్మకమైన పాత్రలతో* *పాటు విలనీ ని చూపిన కఠిన స్వభావంగల పాత్రలు కూడా ఆమె అవలీలగా పోషించి మెప్పించారు. 'ఇలవేలుపు' లో అక్కినేని సవతి తల్లిగా, ' జయభేరి' లో అక్కినేని* *వదినగా, 'తల్లా ? - పెళ్ళామా ?' లో హరికృష్ణ నానమ్మగా, 'వెంకటేశ్వర మహత్యం' లో వకుళాదేవిగా, ' కలిసొచ్చిన అదృష్టం' లో ఎన్ టి ఆర్ తల్లిగా, 'ప్రేమనగర్' లో* *అక్కినేని తల్లిగా నటించి, పాత్రపోషణలో ఆమె చూపిన వైవిధ్యం మరువలేనిది. ' మమతలెరిగిన నా తండ్రీ !* మనసు తెలిసిన ఓ నాన్నా ! *' ( తల్లా ? పెళ్ళామా ?), ' ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా ? '* *( శ్రీ వెంకటేశ్వర మహత్యం) అంటూ ఆమె కరుణ రసాత్మకంగా పాడిన పాటలను ఎవరైనా ఎలా మరుస్తారు ? 2006 లో ఆమె తన 86 వ ఏట మరణించారు.*
*7. తెలుగు, తమిళ నటి, గాయని, నర్తకి, నిర్మాత - దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి*
*పద్మశ్రీ పి. భానుమతి*
8 *. సినీ నటి, గాయని, నర్తకి టంగుటూరి సూర్యకుమారి. ఈమె సుప్రసిద్ధ నేత టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడి కుమార్తె. సినిమాలలోకి రాక ముందు ఈమె మద్రాసులో జరిగిన తొలి అందాల పోటీలలో పాల్గొని తొట్టతొలి మిస్ మద్రాస్ గా ఎన్నికైంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో పలు పాత్రలలో నటించి మెప్పించినా ఈమె బాగా పొడవు అయిన కారణంగా పొట్టివారైన హీరోల పక్కన ఈమెకు కథానాయికగా అవకాశాలు దక్కలేదు. సినిమా పాటలే కాక పలు లలిత సంగీత కచేరీలు చేసి మెప్పించారామె. శంకరంబాడి సుందరాచారి రాసిన ' మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాటను మొదటిసారిగా పాడింది ఆవిడే.* *విప్రనారాయణ (1937), రైతుబిడ్డ (1939), భక్త పోతన (1942), అదృష్టదీపుడు ( 1950) ఆమె నటించిన చిత్రాలలో చెప్పుకోదగినవి. హెరాల్డ్ ఎల్విన్ ని వివాహం చేసుకుని లండన్ లో స్థిరపడిన సూర్యకుమారి అక్కడే 2005 ఏప్రిల్ 25 న మృతిచెందారు.*
*9. సుప్రసిద్ధ కన్నడ నటి బి. జయమ్మ. 1915 లో* *బెంగళూరులో జన్మించిన ఈమె పద్మశ్రీ గుబ్బి వీరణ్ణ మూడవ భార్య. ముందు జయమ్మ వీరణ్ణ నిర్వహించిన డ్రామా కంపెనీలో ' సదారమే',* *'గులేబకావళి', ' ప్రహ్లాద చరిత్రే', 'కురుక్షేత్ర', ' సుభద్రా కళ్యాణ' వంటి నాటకాలలో నటించి పేరు తెచ్చుకుంది. 1931 లో ఆమె గుబ్బి వీరణ్ణ ను వివాహం చేసుకుంది. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు అయిన గుబ్బి వీరణ్ణ తరువాత కాలంలో చిత్ర నిర్మాణం కూడా చేపట్టారు. 1935 లో వీరణ్ణ నిర్మించిన 'సదారమే' చిత్రంలో బి. జయమ్మ నటించారు.* *హేమారెడ్డి మల్లమ్మ ( 1944) ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్ర. కొన్ని తమిళ, తెలుగు చిత్రాలలో కూడా ఆమె* *నటించారు. 1947 లో గాంధీజీ ని కలిసిన జయమ్మ బాపూజీ ఆశయాలు నచ్చి సంఘసేవకే తన జీవితాన్ని అంకితం చేయాలనే నిర్ణయం* *తీసుకుంది. కర్ణాటక రాష్ట్రస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన జయమ్మ కర్ణాటక రాష్ట్ర విధాన మండలి సభ్యురాలిగానూ పనిచేశారు. నాటకరంగానికి ఆమె చేసిన సేవలకు గాను 1985 లో ఆమెకు నటిగా కేంద్ర సంగీత నాటక అకాడెమి పురస్కారం లభించింది.*
*నిల్చున్న వారు ఎడమ నుంచి కుడికి వరుసగా --*
*1. కొత్తమంగళం సుబ్బు - ఈయన అసలుపేరు ఎస్. యం. సుబ్రమణియన్ - ఈయన స్వస్థలం కొత్తమంగళం పేరిట ఈయన్ని అలా పిలుస్తున్నారు. మహాకవి శ్రీశ్రీ తన లిమరుక్కులలో* *అనుకుంటాను ' కొత్తమంగళం సుబ్బు పాత* *చింతకాయపచ్చడి రుబ్బు' అంటాడు చమత్కారంగా. సుబ్బు ప్రఖ్యాత కవి, సంభాషణల రచయిత, పాటల రచయిత, దర్శకుడు. సుప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ' జెమిని' లో యస్. యస్. వాసన్ తరువాత స్థానం సుబ్బుదే. చంద్రలేఖ,* *అపూర్వ సహోదరర్ గళ్, వంజిక్కోట్టై వాలీబన్ వంటి విజయవంతమైన చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే ఆయనే సమకూర్చారు. మిస్ మాలిని, అవ్వయ్యార్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించింది కూడా ఆయనే. ప్రముఖ నటి* *యం.ఎస్. సుందరీబాయి ని వివాహం చేసుకొన్న సుబ్బు 1974 లో తన 63 వ ఏట మరణించాడు.*
*2. ప్రసిద్ధ నటుడు, గాయకుడు, నిర్మాత - దర్శకుడు పద్మశ్రీ చిత్తూరు వి నాగయ్య*
*3. హెచ్. యల్. నారాయణ రావు - ఈయన సుప్రసిద్ధ కన్నడ నటుడు, రచయిత, సంగీత దర్శకుడు. ఈయన మరో ప్రముఖ కన్నడ నటుడు విష్ణువర్ధన్ తండ్రి. నారాయణ రావు కుమారుడు విష్ణువర్ధన్ ప్రముఖ కన్నడ, తెలుగు నటి భారతిని వివాహం* *చేసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడైన విష్ణువర్ధన్ వంశవృక్ష, నాగర హావు మొదలైన చిత్రాలలో నటించి ప్రసిద్ధుడయ్యాడు.*
*4. డా. గోవిందరాజుల సుబ్బారావు - తెనాలికి చెందిన ఈయన రంగస్థల, సినీ* *రంగాలు రెండింటిలో మేటి అనిపించుకున్న గొప్ప నటుడు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన అసమాన* *చిత్రరాజం 'కన్యాశుల్కం' లోని* *లుబ్ధావధాన్లు పాత్రను ఈయన అద్భుతంగా పోషించారు.* *'మాలపిల్ల' చిత్రంలో సుందరరామయ్య పాత్ర,* **షావుకారులో చెంగయ్య పాత్ర,*
' *పల్నాటి యుద్ధం' లో బ్రహ్మనాయడు పాత్ర కూడా ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ' ముగ్గురు మరాఠీలు', ' బాలనాగమ్మ' కూడా ఈయనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన చిత్రాలు. అప్పట్లో ఏడ్చి అల్లరిచేసే పిల్లల్ని మాయల మరాఠీ వస్తున్నాడని అనగానే వాళ్ళు ఏడుపు ఆపేసేవారట.* *జెమినివారు కాంచనమాల బాలనాగమ్మగా,* *గోవిందరాజుల మాయల మరాఠీ గానూ తీసిన ' బాలనాగమ్మ' చూసిన పెద్దలు, పిల్లలు ఎవరికైనా గోవిందరాజుల సుబ్బారావు నటించిన సన్నివేశాలు ఒళ్ళు* *గగుర్పాటు కలిగించేటంత భయానకంగా ఉంటాయి. ప్రఖ్యాత చిత్రకారులు, సినీ దర్శకులు బాపు గోవిందరాజుల సుబ్బారావు గారి తమ్ముడి అల్లుడే.*
*5. ముదిగొండ లింగమూర్తి . సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, కారెక్టర్ ఆర్టిస్ట్ అయిన లింగమూర్తిది కూడా తెనాలే. ఆయన వెంకన్న కాపురం, పెళ్లిచూపులు, త్యాగం వంటి జనరంజకమైన నాటకాలు రాశారు.* *' పాండవ వనవాసం', ' శ్రీకృష్ణావతారం' చిత్రాలలో శకునిగా,*
*' మహామంత్రి తిమ్మరుసు' లో హంవీరుడుగా, 'యోగి వేమన' లో అభిరామునిగా, ' కాళహస్తి మహాత్యం' లో కైలాసనాథ* *శాస్త్రి గా ఆయన పలు వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్నారు. 1980 లో వారణాసిలో ఆయన మరణించారు.*
*6. సి. యస్. ఆర్. - చిలకలపూడి* *సీతారామాంజనేయులు ఆయన పూర్తి పేరు. ఆయన స్వస్థలం మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడి. రెవిన్యూ ఉద్యోగి అయిన వీరి తండ్రి బదిలీపై గుంటూరు జిల్లా పొన్నూరు వచ్చి స్థిరపడగా ఈయన బాల్యంలో గుంటూరు జిల్లా నాటకరంగ ప్రభావం ఈయనపై బలంగా పడింది.* *ఎన్ టి ఆర్, ఏ యన్ ఆర్ ల ప్రవేశానికి ముందు తెలుగు చలనచిత్ర రంగంలో సియస్ ఆర్ ఒక ప్రభావవంతమైన నటునిగా భాసిల్లారు.* *ఒకప్పుడు కృష్ణ, శ్రీ వెంకటేశ్వర, తుకారాం, రామ పాత్రలలో నటించి మెప్పించిన సి యస్ ఆర్ ఎన్ఠీఆర్ రంగప్రవేశంతో కారెక్టర్ నటునిగా రూపాంతరం చెందారు. ' పాతాళభైరవి' లో ఉజ్జయిని రాజుగా, ' దేవదాసు'* *లో ముసలి జమీందారుగా, 'కన్యాశుల్కం' లో రామప్ప పంతులుగా, 'రోజులుమారాయి' లో సాగరయ్యగా, 'మాయాబజార్'* *లో శకునిగా, ' అప్పుచేసి పప్పుకూడు' లో రావు బహద్దూర్ రామదాసుగా, ' జగదేక వీరుని కథ' లో కొత్తమంత్రి బాదరాయణ ప్రెగ్గడ గా, ' రేచుక్క- పగటిచుక్క' లో అసమర్థుడైన రాజుగా, ' ఙయం మనదే' లో రాజు* *మహీపతిగా, ' రాణి రత్నప్రభ' లో దుష్ట మంత్రిగా - ఇలా చేసిన ప్రతి పాత్రనూ అద్భుతంగా పోషించిన సియస్ ఆర్ 1963 లో తన 56 వ ఏట మృతి చెందారు.*
*7. సిహెచ్. నారాయణరావు - చదలవాడ నారాయణరావు తెలుగు చలనచిత్ర సీమలో అక్కినేని, యన్ టి ఆర్ ప్రవేశించక ముందు* *కథానాయకునిగా ఒక వెలుగు వెలిగారు. రైల్వే ఉద్యోగం చేస్తూ నాటకాలలో నటించి పేరు ప్రఖ్యాతులు పొందిన తరువాత* *మొదటిగా జీవనజ్యోతి (1940) లో నటించి, తరువాత మనదేశం, ముగ్గురు మరాఠీలు, స్వర్గసీమ, జీవితం* *వంటి చిత్రాలలో నటించి పేరు తెచ్చుకున్నారు. 50 చిత్రాలకు పైగా చేసి, తెరమరుగైన నారాయణరావు తిరిగి 1967 లో*
*ఏ యన్ ఆర్ నటించిన రహస్యం చిత్రంలోనూ, 1973* *లో చిట్టచివరిగా కృష్ణ నటించిన ' మంచివాళ్లకు మంచివాడు' లోనూ గుర్తుపెట్టుకోదగ్గ పాత్రలలో నటించి 1984 లో చెన్నైలో మృతి చెందారు.*
*8. దండపాణి దేశికర్ - పూర్తిపేరు యం. యం. దండపాణి దేశికర్. ఈయన నటుడు, గాయకుడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు.* *అన్నామలై విశ్వ విద్యాలయంలో శాస్త్రీయ సంగీత విభాగ ప్రొఫెసర్ మరియు శాఖాధిపతిగా పనిచేశారాయన. జెమినీ వారు తీసిన ' నందనార్' చిత్రంలో నందనార్ పాత్రను పోషించింది ఈయనే. (శైవ భక్తి ఉద్యమకారులైన నాయనార్లు* *లేక నాయన్మార్లలో చిదంబరంలోని నటరాజస్వామిని ఆరాధించిన దళితుడైన నందనార్ కూడా ఒకరు.)*
*9. కె. ఆర్. రామస్వామి (KRR ). కుంభకోణం రామభద్ర రామస్వామి ఈయన పూర్తిపేరు. రాజకీయాలలోకి మొదటగా ప్రవేశించిన సినీ నటుడు ఈయనే. ఈయన మొదటగా ద్రావిడ కజగం (D.K.) లో చేరి, ఆ తరువాత ద్రావిడ మున్నేట్ర కజగం (D. M. K. ) లోకి వెళ్లారు. వేలైక్కారి, గుమాస్తావీన్ పెణ్, పూమ్* *పావై, నాడోడి, అరస కట్టలై, నమ్ నాడు మొదలైన చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి తన 57 వ ఏట 1971 లో మరణించారు.*
*10. సుప్రసిద్ధ తమిళ నటుడు రంజన్ - పూర్తి పేరు రామనారాయణ వెంకట రమణ శర్మ - రచయిత,* *నటుడు, గాయకుడు. 1948 లో జెమినీ సంస్థ నిర్మించిన 'బ్లాక్ బస్టర్ ' చిత్రం 'చంద్రలేఖ' రంజన్ కి గొప్ప పేరు* *ప్రఖ్యాతులు తెచ్చింది.* *తమిళంలో ఆయన నటించిన మంగమ్మ శపథం కూడా మరో సూపర్ హిట్. తరువాత హిందీ చిత్రసీమలో ప్రవేశించి మదారీ, సువర్ణ్ సుందరీ, మాజిక్ కార్పెట్, చోర్ చోర్, చోర్ హో తో ఐసా వంటి పలు చిత్రాల్లో నటించారు. అంజలీ దేవి,* *రంజన్ నటించిన రాజా మలయ సింహ, కొండవీటి దొంగ చిత్రాలు తెలుగులో సూపర్ హిట్స్ అయ్యాయి. తన 65 వ ఏట 1983 లో అమెరికాలోని న్యూ జెర్సీ లో ఆయన మృతి చెందారు. జానపద చిత్రాలలో తర్ఫీదు పొందిన గుర్రం, కుక్కలను మొదటగా ప్రవేశపెట్టింది ఆయన చిత్రాలలోనే కావడం విశేషం.*
*11.సుప్రసిద్ధ తమిళ హాస్యనటుడు టి. ఆర్. రామచంద్రన్*
*( టి. ఆర్.ఆర్. ) తమిళ* *చిత్రాలు తిరువళ్ళువర్, కణ్ణగి, ఆలయమణి ( తెలుగులో గుడిగంటలు), బాగ్దాద్ తిరుడన్ ( తెలుగులో బాగ్దాద్ గజదొంగ) మొదలైన చిత్రాలలో హాస్యపాత్రలు పోషించాడు.*
*12. హొన్నప్ప భాగవతార్ - సుప్రసిద్ధ కన్నడ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, సినీ నిర్మాత, దర్శకుడు*
' *మహాకవి కాళిదాస' ఈయన* *నిర్మించిన విజయవంతమైన* *చిత్రాలలో ఒకటి. బి. సరోజాదేవిని వెండితెరకు పరిచయం చేసింది ఈయనే.*
*13. కె. సుబ్రహ్మణ్యం - తొలితరం తమిళ సినీ నిర్మాత - దర్శకుడు. ఈయన మొదటి పేరు కృష్ణస్వామి. 1934 నుంచి ఈయన తన పేరును సుబ్రహ్మణ్యం గా మార్చుకున్నారు. తమిళ చలన చిత్ర నిర్మాణానికి పునాదులు వేసింది ఈయనే. ప్రహ్లాద, భర్తృహరి, మానసంరక్షణం వంటి తొలితరం చలనచిత్రాల నిర్మాత- దర్శకుడు ఈయనే.*
*ఎందరో మహానుభావులు* !
సేకరణ. RK🤝🌹
🎊💦🌹💎🏵️🦚🌈