10/08/2024
#బిజెపికేసులబండారంబట్టబయలు
*ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్, బిజెపి/మోడి ప్రభుత్వం (ఇడి, సిబిఐ) కనిపెట్టిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు బెయిల్ మంజూరు చేసింది. ‘బెయిల్, నాట్ జెయిల్, ఈజ్ ద రూల్’ అని జస్టిస్ బి. ఆర్. గవాయ్, కెవి విశ్వనాధన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
బెయిల్ పై విడుదలయిన మనీష్ సిసోడియా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తనపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న అణచివేత నుండి కాపాడిందని చెప్పుకున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సుప్రీం కోర్టు అమలు చేసినందు వల్లనే ఈ రోజు తాను కేంద్రం బందీ నుండి విడుదల అయ్యానని ప్రకటించాడు. త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా విడుదల కావడం ఖాయం అని నమ్మకం వ్యక్తం చేశాడు.
ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానం కొన్ని లిక్కర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా రూపొందించబడిందని, ఈ విధానంతో లబ్ది పొందిన లిక్కర్ కాంట్రాక్టర్ల నుండి 100 కోట్లు ఏఏపి పార్టీకి ముట్టాయని, తద్వారా ఏఏపి అవినీతికి, మనీ లాండరింగ్ కి పాల్పడిందని ఏఏపి పార్టీ, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మొ.న వారిపై సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు ఆరోపించి కేసులు నమోదు చేశాయి. దశల వారీగా ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తూ వాళ్ళని సాధ్యమైనంత ఎక్కువ కాలం జైళ్ళలో గడిపేలా ఎత్తుగడలు రచిస్తూ వచ్చాయి. చివరికి ఈ ఎత్తుల్ని పసిగట్టిన సుప్రీం కోర్టు వారి వాదనల్ని ఒక్కొక్కటీ విడమరిచి అవి ఎలా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయో చెబుతూ వివరించి సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
#అక్షింతలు
పనిలో పనిగా కింది కోర్టుల పైన సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ట్రయల్ కోర్టు, హై కోర్టు లు చట్టాలు ఏమి చెబుతున్నాయో, గతంలో సుప్రీం కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయో గ్రహించి చట్టాన్ని, సుప్రీం తీర్పులను, రూలింగ్ లను పక్కన పెట్టి తమ క్షేమాన్ని తాము చూసుకున్నాయని, తమకు మట్టి అంటకుండా చూసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చాయనీ “బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఎన్ ఎక్సెప్షన్” (బెయిలు నియమం, జైలు మినహాయింపు) అన్న సూత్రాన్ని విస్మరించాయని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఇతర కేసుల్లోనూ అవి ఇలాగే వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించింది.
“మా అనుభవం నుండి మేము చెప్పగల సంగతి ఏమిటంటే, బెయిలు ఇచ్చే విషయంలో ట్రయల్ కోర్టులు, హై కోర్టులు తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు (play safe) ప్రయత్నిస్తున్నాయి. బెయిల్ నియమం, బెయిలు నిరాకరణ మిననహాయింపు అన్న సూత్రాన్ని అవి కొన్ని సమయాల్లో ఉల్లంఘిస్తున్నాయి… ఓపెన్-అండ్-షట్ కేసుల్లో (చాలా సులభమైన కేసుల్లో) కూడా బెయిలు ఇవ్వని కారణంగా ఈ కోర్టుకు పెద్ద సంఖ్యలో బెయిల్ పిటిషన్లు వస్తున్నాయి. దానితో పెండింగ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది. కాబట్టి “బెయిల్ ఇవ్వడం నియమంగా, జైలుకు పంపడం ఒక మినహాయింపుగా” పరిగణించే సూత్రాన్ని గుర్తించి అమలు చేయాల్సిన అవసరాన్ని ట్రయల్ కోర్టులు, హై కోర్టులు ఇప్పటికైనా గుర్తించాలి” అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ట్రయల్ కోర్టులు, హై కోర్టులు మరీ ఇంత ఘోరంగా, వరస బెట్టి బెయిల్ నిరాకరించడం అనేది జరగలేదు. కానీ బిజెపి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండీ ప్రత్యేకంగా పనిగట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు అనేక మంది నేతలపై సిబిఐ, ఇడిలు కేసులు పెట్టడం, కేసులకు భయపడిన నాయకులు తమ పార్టీలను వీడి బిజెపి లో చేరడం, వాళ్ళు బిజెపి లో చేరడం తోటే వారిపై మోపిన కేసుల విషయంలో సిబిఐ, ఇడి ల నుండి విచారణ, అరెస్టు లాంటి చర్యలు ఉన్నట్టుండి ఆగిపోవడం సాధారణంగా మారిపోయింది.
2019 లో రెండోసారి కూడా మరిన్ని సీట్లతో బిజెపి అధికారం లోకి రావడంతో సిబిఐ, ఇడి ల నుండి, ముఖ్యంగా ఇడి నుండి కేసులు మోపడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఫలితంగా మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, ఉత్తర ఖండ్, మధ్య ప్రదేశ్, (వాయవ్య) ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బిజెపి పార్టీలోకి తమ తమ పార్టీలను చీల్చి గుంపులు గుంపులుగా వలస వెళ్ళడం, తద్వారా ఇడి, సిబిఐ కేసుల నుండి ఉపశమనం పొందడం ఒక అధికారిక రాజకీయ విధానంగా మారిపోయింది.
ఈ వ్యవహారం తెర వెనుక జరగడం కాకుండా బహిరంగంగానే జరుగుతున్న విషయం టర్న్ కోట్ రాజకీయ నాయకుల బహిరంగ ప్రకటనల ద్వారా స్పష్టంగా ప్రజలకు అర్ధం అవుతున్నది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ఉమ్మడి శివసేన (చీలక ముందు) పార్టీ నాయకులు బహిరంగంగానే ఈ అంశాన్ని వెల్లడి చేస్తూ ప్రకటనలు చేశారు. “కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల కేంద్ర విచారణా సంస్థలు సిబిఐ, ఇడి ల కేసుల నుండి ఎదురవుతున్న కేసులను ఎదుర్కోలేక చస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు వీడి, బిజెపి తో జత కడితే ఈ కేసుల నుండి విముక్తి పొందవచ్చు” అని తమ నాయకుడికి వాళ్ళు పత్రికా ముఖంగానే విజ్ఞప్తి చేశారు.
ఇక మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ లతో అయితే సిబిఐ, ఇడి లు నేరుగా బిజెపి తరపున బేరసారాలు ఆడినట్లు వాళ్ళు వెల్లడి చేయడం గమనార్హం. “బిజెపితో శతృత్వం వదిలి మిత్రపక్షంగా మారితే మీ పైన ఈ కేసులు ఏవీ ఉండవు” అని విచారణాధికారులు తమతో బేరాలు ఆడారని వాళ్ళు చెప్పారు. అలాంటిది ఏమీ జరగలేదని సిబిఐ, ఇడిలు ఖండించడం వేరే సంగతి! అయినా, బిజెపి తరపున బేరాలు ఆడిన సంగతి విచారణా సంస్థలు ఎందుకు అంగీకరిస్తారు?
ఆ మాటకొస్తే కాంగ్రెస్/యుపిఏ హయాంలో సిబిఐ ని సుప్రీం కోర్టు “పంజరంలో బందీ అయిన చిలుక” (Caged Parrot) గా అభివర్ణించలేదా? మాయావతి, లాలూ ప్రసాద్ లాంటి వారిని సిబిఐ కేసుల ద్వారానే కాంగ్రెస్ నియంత్రించిన సంగతి సర్వ విదితమే.
అయితే బిజెపి లాగా ఇంత అడ్డగోలుగా, డజన్ల సంఖ్యలో ఎంఎల్ఏలను కొనుగోలు చేసి రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వాలను కూల దోయడం, గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను రోజు వారీ టైమ్ టేబుల్ వేసుకున్నట్లుగా వేధింపులకు గురి చేయడం, ప్రతిపక్ష రాష్ట్రాల బిల్లులను ఆమోదించకుండా రాజ్యాంగ విరుద్ధంగా తొక్కి పెట్టడం, అటు రాష్ట్ర పతికి పంపకుండా, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపకుండా వివిధ బిల్లులను త్రిశంకు స్వర్గంలో వేలాడ గట్టడం, ‘ఆ బిల్లుల్ని ఆమోదించేదే లేదు, అలాగని తిప్పి పంపేది కూడా లేదు’ అని తమిళనాడు గవర్నర్ లాంటి వాళ్ళు రాజ్యాంగం పట్ల భయం లేకుండా ప్రకటించడం, చివరికి సుప్రీం కోర్టు కేసు విచారణకు స్వీకరించే ముందు రోజు బిల్లుల్ని ఆమోదించడం గానీ లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం గానీ చెయ్యడం లాంటి అడ్డగోలు చర్యలు తమకు అప్పగించబడిన ఒక డ్యూటీగా పాటించడం యధేచ్చగా సాగడం అన్నది కాంగ్రెస్ హయాంలో జరగలేదు అన్నది కూడా ఒక వాస్తవమే.
రాజ్యాంగ సూత్రాల పట్ల, సదరు సూత్రాలను అనుసరించడం ద్వారా ప్రజా పాలన (పాలక వర్గ ప్రయోజనాల కోసమే అయినా సరే) స్థిరంగా, ఆటంకాలు ప్రతిబంధకాలు లేకుండా సాగనివ్వడం అన్న రాజ్యాంగ నియమాల పట్ల ఎలాంటి గౌరవాన్ని బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదన్నది ఒక నిష్టుర సత్యం.
అలాంటి ప్రభుత్వం నుండి సామాన్య ప్రజలకు, సంపద సృష్టికర్తలు అయిన శ్రమ జీవులకు ఎలాంటి సానుకూల విధానాలు ఆశించగలం అన్నది ఒక ప్రశ్న. ఉద్యోగులపై నానాటికీ పెరుగుతున్న ఆదాయ పన్నులు, అత్యంత పేదల నుండి మైక్రో, స్మాల్, మిడిల్ స్కేల్ (MSME) పరిశ్రమల యాజమానుల వరకు జి.ఎస్.టి పన్ను భారం తడిసి మోపెడై నిత్యావసర సరుకుల ధరలను ఆకాశాన్ని దాటి పోవడాన్ని ఈ కోణం నుండి చూస్తే తప్ప అర్ధం చేసుకోలేము.
#కిందికోర్టులవైఫల్యం
సిసోడియా కేసులో నిజాలను పరిశీలించినట్లయితే బెయిలు-జైలు సూత్రాన్ని గుర్తించడంలో కింది కోర్టులు పూర్తిగా విఫలం అయ్యాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఒక శిక్షగా బెయిలును నిరోధించరాదు అన్న సంగతిని అవి విస్మరించాయని నొక్కి చెప్పింది. “ఒక నేరానికి పాల్పడినట్లు తీర్పు ఇవ్వటానికి ముందు సుదీర్ఘకాలం పాటు నిందితుడిని నిర్బంధించి, అది ట్రయల్ లేకుండా శిక్ష అనుభవించటంగా మారడం అనుమతించరాదు” అని సుప్రీం బెంచి తన తీర్పులో పేర్కొంది.
జూన్ 4, 2024 తేదీన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ నేర పరిశోధన జులై 3 లోగా పూర్తవుతుందని ఆ తేదీ నాటికి చార్జి షీటు దాఖలు చేస్తామని సుప్రీం కోర్టులో హామీ ఇచ్చిన సంగతిని బెంచి గుర్తు చేసింది. అయినప్పటికీ 18 నెలల పాటు నిందితుడిని నిర్బంధంలో కొనసాగించడమే కాక తమ హామీని నిలబెట్టుకోకుండా చార్జి షీటు దాఖలుకు మరో నెల రోజుల పాటు సమయం కోరడం, మరో 8 మంది సాక్షులను విచారించవలసి ఉన్నదని చెప్పడం ఏమిటని బెంచి ప్రశ్నించింది. ఇలాంటి తరుణంలో బెయిల్ నిరాకరించి బెయిల్ కోసం మరోసారి ట్రయల్ కోర్టు నుండి మొదలు పెట్టేలా చేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు సూచించడం తగదని ద్విసభ్య బెంచి స్పష్టం చేసింది. అలా చేస్తే నిందితుడిని పాము-నిచ్చెన తరహా ఆట లోకి నెట్టడమే అంటూ ఏ.ఎస్.జి సూచనను తిరస్కరించింది.
“ఈ కేసులో 493 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. వేల పేజీల పత్రాలు, లక్షకు పైగా పేజీల డిజిటల్ పత్రాలు ఈ కేసులో ఉన్నాయి. కనుక సమీప భవిష్యత్తులో ఈ కేసు విచారణ పూర్తి అవుతుందన్న సూచనలు కనీస ఆలోచనకు కూడా తట్టడం లేదు. మా దృష్టిలో, ట్రయల్ వేగంగా పూర్తి అవుతుందన్న నమ్మకాన్ని చూపిస్తూ అప్పిలెంట్ ని అనంత కాలం పాటు ఊచల వెనుక బందీగా ఉంచడం అన్నది రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 లో పొందుపరిచిన ప్రాధమిక హక్కుకు విరుద్ధం” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
ఇడి పరస్పర విరుద్ధమైన వాదనలు చేయటాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపింది. ఒక వైపేమో అక్కరకు రాని అభ్యర్ధనలు సిసోడియా ఫైల్ చేయకపోతే ట్రయల్ ఈ పాటికి మొదలై ఉండేది అని ఇడి ఆరోపిస్తున్నది. మరో వైపేమో ‘తమ వద్ద ఉన్న డేటాను ఒక పద్ధతిలో పెట్టి అంతిమ చార్జిషీటు నమోదు చేసేందుకు జులై 3 వరకు సమయం కావాలని జూన్ 4, 2024 తేదీన, ఇడియే కోరిందని కోర్టు ఎత్తి చూపింది. “చివరి చార్జ్ షీటు జూన్ 28 తేదీన (మా వద్దకు) వచ్చింది… ఆ తర్వాత అనుబంధ చార్జి షీటు దాఖలు చేసే క్రమంలో ఉన్నట్లుగా మీరు చెప్పారు… దీనర్ధం ఏమిటి? చార్జి షీట్లు అన్నీ ఫైల్ చేయకుండా ట్రయల్ ప్రారంభం కావటానికి వీలు లేదని మీరు భావిస్తూనే.. ఇప్పుడేమో వాళ్ళు ఆలస్యం చేశారు, లేకపోతే ట్రయల్ మొదలై ఉండేది.. అని చెబుతున్నారు. ఇక్కడ మీ వాదనలో అసంబద్ధత స్పష్టంగా వ్యక్తం అవుతున్నది” అని జస్టిస్ విశ్వనాధన్ ఏ.ఎస్.జి ఎస్.వి.రాజుకు చెప్పారు.
#విధానం- #నేరత్వం
జస్టిస్ విశ్వనాధన్ ఎత్తి చూపిన అంశాలలో ముఖ్యమైనది: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక “విధానం” మరియు “నేరత్వం”కు మధ్య ఏ పాయింట్ వద్ద మీరు గీత గీయగలరు? అని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు ను ప్రశ్నించడం!
ఒక విధానం (పాలసీ) లో మార్పులు చేసినప్పుడు నిర్దిష్ట మద్యం హోల్ సేల్ డీలర్లు లబ్ది పొందిన మాత్రాన నేరత్వం చోటు చేసుకుందన్న అవగాహనకు రావచ్చా? అని జస్టిస్ విశ్వనాధన్ ప్రశ్నించారు.
న్యాయమూర్తి సూచన/ప్రశ్న లో వ్యక్తం అవుతున్న అవగాహనను ప్రత్యేకంగా గుర్తించాలి. ఒక ప్రభుత్వం తనకు ముందరి ప్రభుత్వం చేసిన విధానాన్ని మార్చి కొత్త విధానం రూపొందించినపుడు ఇతరులు లబ్ది పొందడం జరిగితే అంతమాత్రాన విధాన రూపకర్తలకు నేరత్వం అంటగంటవచ్చా అన్నది సుప్రీం జడ్జి కక్షిదారుల ముందు ఉంచిన న్యాయ మీమాంస.
బిజెపి పార్టీకి చెందిన అతి ముఖ్యమైన సీనియర్ నేతలు బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో స్వయంగా మసీదు వద్ద నిర్మించిన వేదిక పైన నిలబడి కరసేవకులను ప్రోత్సహిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి మొదలైన అతిరధ మహారధులు ఈ జాబితాలో ఉన్నారు. కానీ లిబర్హాన్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చేటప్పుడు మాత్రం “రామ రామ మేము అసలు ఆ ప్రాంతం లోనే లేము. కూల్చివేత అనుకోకుండా జరిగిపోయింది. కరసేవకులు అంతపని చేస్తారని మాకు తెలియనే తెలియదు” అని సాక్ష్యం ఇచ్చారు. “ఔర్ ఏక్ ఢక్కా మారో” అని మైకులో ప్రోత్సాహకరంగా ఆదేశాలు ఇచ్చిన అద్వానీ సైతం లిబర్హాన్ కమిషన్ ముందు ఇదే సాక్ష్యం ఇచ్చారు. కానీ బిజెపి/ఆర్ఎస్ఎస్/విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూత్వ సంస్థల కార్యకర్తల వద్ద మాత్రం మసీదు కూల్చిన ఘనతను గౌరవాన్ని పొందడంలో పోటీలు పడ్డారు. మసీదు కూల్చివేతను ఒక రాజకీయ నినాదంగా అమలు చేసిన బిజెపి నేతలు చట్టం వద్ద మాత్రం ఆ నినాదానికి కట్టుబడి ఉండలేకపోయారు.
#ప్రభుత్వాలకుపట్టినవైరస్
రాత్రికి రాత్రే పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించి అనేకానేక మంది బ్యాంకుల ముందు క్యూలలో నిలబడి అలసి సొలసి శోష వచ్చి పడిపోయి చనిపోతే ఆ చావుల బాధ్యతను మోడి ప్రభుత్వం ఏ మాత్రం మోయలేదు. బాధ్యత తీసుకోవడం అటుంచి ఆ నాటి చావుల గురించి ప్రధాని నరేంద్ర మోడి ఇప్పటి వరకు ఒక్క మాటా మాట్లాడిన పాపాన పోలేదు. ఇక్కడ ‘పాలసీ’ కీ, సామాన్య ప్రజలు చావుకు గురైన ‘నేరత్వం’ కూ మధ్య సంబంధాన్ని గుర్తించాల్సిన అవసరం లేదా? ఈ అర్ధం లేని విధానం వలన జిడిపి 2 శాతం మేర పడిపోతుందని మాజీ ప్రధాని మన్మోహన్ ప్రకటిస్తే ఆయన్ని ఎద్దేవా చేశారు. తీరా జిడిపి 2 శాతం తగ్గడం మాత్రమే కాదు, నెగిటివ్ వృద్ధి నమోదు చేస్తూ ఆర్ధిక వ్యవస్థ కుదించుకుపోయినా మర్యాదకైనా తప్పుని గుర్తించిన పాపాన పోలేదు, బిజెపి ప్రభుత్వం!
అప్పటి వరకూ లక్షల మందితో ర్యాలీలు నిర్వహించిన ప్రధాన మంత్రి కోవిడ్ 19 అరికట్టే పేరుతో అర్ధాంతరంగా దేశం మొత్తం నెలల తరబడి లాకౌట్లు ప్రకటించడం వలన కోట్లాది శ్రామికులు, కూలీలు, కూడుకు, నీడకు, దాహానికి అలమటిస్తూ వేల కిలో మీటర్లు హైవేల వెంబడి కాలి నడకన దక్షిణ భారతం నుండి మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ల వరకు వెళుతున్న దృశ్యాలు టి.విలు, సోషల్ మీడియా, పత్రికలలో ప్రతి రోజూ కనిపిస్తున్నా మోడి ప్రభుత్వం వారికి సాయం చేసేందుకు స్పందించలేదు. దారి మధ్యలో సత్తువ ఉడిగి, డీ హైడ్రేషన్ తో అనేక మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమైనా కుట్టలేదు.
లక్షల కోట్ల నిధుల పైన కేంద్ర ప్రభుత్వం కూర్చుని కూడా స్పందించలేదు. కానీ హైవేల వెంబడి కాలి నడకన వెలుతున్న పేద ప్రజలను దక్షిణ భారత దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలే తమ వద్ద ఉన్న కొద్ది పాటి డబ్బుతో కాలి ప్రయాణీకులను ఆదరించి ఇవ్వగలగిన సౌకర్యాలు కల్పించి ఆలంబనగా నిలబడ్డారు. ప్రభుత్వాలు నిరాకరించిన బాధ్యతను సామాన్య ప్రజలు నెత్తిన వేసుకుని బాసటగా నిలబడ్డారు. మంచి నీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ రసం, చెప్పులు, బ్రష్-పేస్ట్ లు దారిలో వీలున్న చోట వండుకుని తినటానికి కూరగాయలు, సరుకులు, బియ్యం; డబ్బులు… ఇలా ఒకటేమిటి తమకు సాధ్యమైన అన్నిరకాల సహాయాలు సామాన్యులు చేశారు. కొన్ని చోట్ల ఫేస్ బుక్ ద్వారా నిధులు సేకరించి స్వయంగా బస్సులు సమకూర్చి బెంగాల్ వరకు బాధితులను పంపిన ఘటనలు కూడా ఉన్నాయి.
కోవిడ్ 19 వైరస్ అరికట్టే పేరుతో ‘నిర్లక్ష్యం, ప్రజల పట్ల బాధ్యతా రాహిత్యం’ అనే వైరస్ లను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అంటించింది. చేదు వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలకు పట్టిన “నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం” వైరస్ లకు మందు వేసుకునేందుకు ప్రభుత్వాలు స్థిరంగా నిరాకరించడం. అందుకే ప్రజలే పూనుకుని ప్రభుత్వాలను ఆవహించిన వైరస్ కు మందును బలవంతంగా అయినా తినిపించాలి.
మనీష్ సిసోడియా సమాజంలో లోతైన సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి గనుక ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడన్న వాదనను అంగీకరించలేము అని పేర్కొన్న బెంచి 10 లక్షల బాండ్లను రెండింటినీ పూచీకత్తుగా ఇవ్వాలని, ప్రతి సోమవారం పోలీసు స్టేషన్ లో హాజరు కావాలని షరతు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
---అభినందనలతో, విశేఖర్
(తెలుగువార్తలు.కామ్)