30/08/2023
★ ఆకాశమే హద్దురా!
★ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ
★ బిజినెస్-ఫ్రెండ్లీ విధానాలతో
వృద్ధిపథంలో రాష్ట్రం
★ గత ఆర్థిక సంవత్సరం రూ.50 వేల కోట్ల
పెట్టుబడులు రాక
★ అన్నింటా కలిసొస్తున్న
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు
పాలనే చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు నైపుణ్యం-ప్రతిభే లేదు.. గత వైభవమంతా మావల్లే.. ఇదీ తొమ్మిదేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ గురించి నాడు వినిపించిన అవాకులు.. చేవాకులు.
కానీ.. ఎగతాళి చేసినవారే నేడు నోరెళ్లబెట్టి తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి ఆశ్చర్యపోతున్నారు. అన్నింటా కలిసొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు.. అన్ని రంగాల్లోనూ తెలంగాణను అగ్రగామిగా నిలబెడుతున్నాయి. యావత్తు దేశాభివృద్ధికే ఇప్పుడు రాష్ట్ర ప్రగతి ఓ ప్రామాణికం.. ఓ కొలమానం.
పెట్టుబడులు.. ఉద్యోగావకాశాలు.. నైపుణ్యాభివృద్ధి.. మౌలిక సదుపాయాల కల్పన.. పరిశ్రమల ఏర్పాటు.. ఇలా ఏ అంశంలో చూసినా తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. సమర్థవంతమైన నాయకత్వంలో పరుగులు పెడుతున్న రాష్ర్టాభివృద్ధి.. నవ చైతన్యానికి నాందీగా నిలుస్తున్నది. భావి తరాలకు బంగారు బాట వేస్తున్నది. అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ ఖ్యాతిని తీసుకెళ్తున్నది.
అవకాశాలు రాక కాదు.. వనరులు లేక అంతకన్నా కాదు.. దశాబ్దాలపాటు తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లే. అవును.. దార్శనికత కలిగిన నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం. దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ర్టాల్లో అన్నింటికంటే ఆఖర్లో వచ్చిన తెలంగాణ.. అబ్బురపరిచే రీతిలో ప్రగతిని చూపిస్తున్నది మరి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (వ్యాపారానికి అత్యంత అనుకూలం) సూచీలో తెలంగాణ ఆకర్షణీయమైన స్థానాన్నే దక్కించుకున్నది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోనూ 4వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూరదృష్టితోనే ఇది సాధ్యమైందని ఆర్థిక రంగ, ఇండస్ట్రీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కీలక రంగాలన్నింటిలోనూ బలమైన పునాదులు వేశారని ప్రశంసిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలోకి సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేస్తున్నారు.
బ్యాంకింగ్ రంగంలో..
---------------------------------
ఒకప్పుడు దేశంలోని మొత్తం బ్యాంక్ కార్యాలయాల్లో.. తెలంగాణలో ఉన్నవి కేవలం 3.67 శాతమే. అయితే రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ఫైనాన్షియల్ అడ్వాన్స్‌మెంట్లతో బ్యాంక్ శాఖల సంఖ్యలో జాతీయ స్థాయికి సమానంగా వృద్ధిరేటు నమోదవుతున్నదిప్పుడు. 2015 నుంచి 18.5 శాతంగా ఉంటున్నది. 884 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ శాఖలు, 147 ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ శాఖలు కొత్తగా ఏర్పాటయ్యాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల విస్తరణ వేగంగా జరుగుతున్నది. ఇక దేశంలోని డిపాజిట్లలో 3.7 శాతం తెలంగాణవే. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులూ డిపాజిట్ల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
2015 నుంచి రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.6,93, 887 కోట్లకు పెరిగాయి. గడిచిన దాదాపు 9 ఏండ్లలో రెట్టింపైనట్టు తేలింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిపుష్ఠికి అద్దం పడుతున్నది. పెరిగిన ప్రజల ఆదాయ మార్గాలనూ సూచిస్తున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార అనుకూల నిర్ణయాలు.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షిస్తున్నాయి. యువతలో నైపుణ్యం-ప్రతిభను పెంపొందించడానికి తెలంగాణ ప్రభు త్వం చేస్తున్న కృషి అభినందనీయం. అటు ఎంఎస్‌ఎంఈలకు, ఇటు స్టార్టప్‌లకు గొప్ప సహకారం లభిస్తున్నది. నిర్మాణ, ఐటీ, ఔషధ, ఏరోనాటిక్స్, వ్యవసాయం.. ఇలా అనేక రంగా లు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి.
-లోకేశ్ ఫతేపురియా,
తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్
ఇండస్ట్రీ ఫెడరేషన్ జాయింట్ డైరెక్టర్
వ్యవసాయానికి పెద్దపీట
--------------------------------------
ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో వ్యవసాయానిదీ కీలకపాత్రేనని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందువల్లే రాష్ట్ర అవతరణ నాటి నుంచి వ్యవసాయ రంగానికి, రైతు సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, కనీస మద్దతు ధర, వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వంటివి వీటికి సాక్ష్యం. 2015 నుంచి రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెట్టుబడులు 240 శాతం పెరుగడం గమనార్హం. దీంతో పారిశ్రామిక రంగంతో పోటాపోటీగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామమన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయిప్పుడు.
ఎంఎస్‌ఎంఈలకు చేయూత
--------------------------------------
సమైక్య రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లు కుదేలైపోయాయి. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దగ్గర్నుంచి మోడువారిన ఎంఎస్‌ఎంఈల్లో కొత్త చిగుర్లు తొడిగాయి. రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో ఉద్యోగ కల్పనలోనూ ఇప్పుడు ఎంఎస్‌ఎంఈలు భాగమవుతున్నాయి. బ్యాంకింగ్ రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల సహకారం పెరిగి ఈ పరిశ్రమల్లో ఆకర్షణీయ ఉత్పాదకత నమోదవుతున్నది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా భూ కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన, టీఎస్ ఐపాస్, టీ-హబ్, వుయ్ హబ్ వంటివి కలిసొస్తున్నాయి. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ అభివృద్ధి బాటలు పడుతున్నాయి. కాగా, పుణెకు చెందిన ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్ (ఈఎఫ్‌ఎల్).. వరంగల్, సూర్యపేటల్లో కొత్త శాఖల్ని ఏర్పాటుచేసి అక్కడి చిన్న పరిశ్రమల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నది. అంతేగాక ప్రభుత్వ ప్రోత్సాహంతో మరెన్నో ఎన్‌బీఎఫ్‌సీలు.. ఎంఎస్‌ఎంఈలకు అండగా రాష్ట్రంలోకి వస్తుండటం గమనార్హం.