16/03/2024
ప్రయోక్త : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పటిష్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా ఎన్నికల అధికారి హరి నారాయణన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని, ఈ మేరకు జిల్లాలో పటిష్టంగా ఎన్నికల ప్రవర్తన నియమాలని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమయాత్తమైనట్లు ఆయన స్పష్టం చేశారు.
భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ మేరకు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుండగా, మన రాష్ట్రంలో నాలుగో విడతలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 25 నామినేషన్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్ర్కూటీని, నామినేషన్ల విత్ డ్రాకు ఏప్రిల్ 29 చివరి తేదీగా చెప్పారు. మే 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. జూన్ 6 తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని కలెక్టర్ వెల్లడించారు.
ఏప్రిల్ 18న ఫామ్-1 విడుదల చేస్తూ ఏ ఏ ప్రాంతాల్లో నామినేషన్లు స్వీకరిస్తామో తెలియజేస్తామన్నారు. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారని, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సబ్ కలెక్టర్, కావలి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్డీవోలు, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి మున్సిపల్ కమిషనర్, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డీవో నెల్లూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ కలెక్టర్ తెలుగు గంగ, ఉదయగిరి నియోజకవర్గానికి ఆత్మకూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వెంకటగిరి నియోజకవర్గానికి తిరుపతి సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు సెలవు దినాల్లో మినహా అన్ని రోజుల్లో నామినేషన్లను స్వీకరించనన్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సెక్యూరిటీ డిపాజిట్ గా 25 వేలు, అసెంబ్లీ నియోజకవర్గానికి రూ 10 వేలు చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మినహాయింపు ఉంటుందన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను అభ్యర్థులు ఫామ్ 26 ద్వారా అందజేయాల్సి ఉంటుందని, రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసే సమయంలో 100 మీటర్ల దూరం వరకే మూడు వాహనాలకు అనుమతి ఉంటుందని, ఆర్ వో చాంబర్లో అభ్యర్థితోపాటు మరో నలుగురికి ప్రవేశం ఉంటుందని చెప్పారు.
జిల్లాలో 2460 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, నెల్లూరు రూరల్ సంబంధించి 10 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లో ఏర్పాటుకు ఈసీఐ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం ఓటర్లు
2039215 మంది కాగా, పురుషులు 997908 మంది అని, స్త్రీలు 1041096, ఇతరులు 211 మంది అని కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో 53 ఎంసిసి బృందాలు, 78 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 81 ఎస్ ఎస్ టి బృందాలు, 20 వి ఎస్ టి బృందాలు నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై తమ విధులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సెక్షన్ 127 ఏ ప్రకారం అన్ని ప్రింటింగ్ ప్రెస్ ల నిర్వాహకులు తాము ప్రచురిస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలు, ఇతర ప్రచార ముద్రణపై ముందస్తుగా తమ అనుమతి పొందేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రకటనలు, హోర్డింగులు ఈసీఐ నిబంధనల మేరకు తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ మొదలైన ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన మాధ్యమాలు ప్రసారం చేసే అభ్యర్థుల ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజ్ లను ప్రసారం చేసే ముందు ఎం సి ఎం సి కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లోని డిఆర్డిఏ కార్యాలయం మిద్దె పైన సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పాత్రికేయులు ఎటువంటి ఫేక్ వార్తలను ప్రసారం చేయవద్దని, ప్రసారం చేసే ముందు వార్తలకు సంబంధించి ఏదైనా సందేహం ఉన్నచో మీడియా సెంటర్లో 24 గంటలు సమాచార శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని, వారి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని వార్తలు ప్రచురించాలన్నారు. అలాగే పత్రికల్లో చెల్లింపు వార్తలు (పెయిడ్ న్యూస్) ప్రచురించవద్దని, పెయిడ్ న్యూస్ పై ఎం సి ఎం సి ప్రత్యేక నిఘా పెట్టినట్లు కలెక్టర్ చెప్పారు.
ఓటర్లందరూ సెల్ ఫోన్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఎపిక్ నెంబర్ ఆధారంగా తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవచ్చు అన్నారు. తమ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు కూడా నో యువర్ కాండేట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
ఓటరు జాబితా కి సంబంధించిన ఓటరు తొలగింపులు ఇక ఉండవని, కొత్త ఓట్లు మాత్రం నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసేందుకు, ఓటర్లందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పాత్రికేయులు జిల్లా అధికార యంత్రాంగం తో సమన్వయంతో పని చేయాలని, మీడియా భాగస్వామ్యం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమని కలెక్టర్ చెప్పారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా దృఢ సంకల్పంతో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ లవన్న, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావు, డి పి ఆర్ ఓ మోహన్ రాజు, ఇంజనీర్ కిషోర్, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.