20/07/2024
మధ్యాహ్న భోజనం పై ధరాభారం..!
. పెరిగిన కూరగాయలు నిత్యవసర వస్తువుల ధరలు..
. బిల్లుల మంజూరిలో జాప్యంతో ఆందోళన
. అప్పుల పాలవుతున్న నిర్వాహకులు
. ఆగస్టు ఒకటో తేదీ నుండి భోజనం పెట్టలేం...
. సమ్మెకు సిద్ధమవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు...
కోదాడ, జూలై 19 (ప్రభ న్యూస్):
ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలుపై పెరిగిన ధరల ప్రభావం చూపుతుంది. ఇటీవల నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడంతో అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గత విద్యా సంవత్సరంలో పది నెలల నుండి 9వ తరగతి 10 వ తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు తెలిపారు.
పెరిగిన జీతం రాకపోగా, అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరగడంతో ఇంటికి వెళ్లకుండా రాత్రి అయ్యేంతవరకు స్కూలు వద్దనే ఉండాల్సి వస్తుందని వాపోయారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో అనంతగిరి మండలంలో 23 ప్రాథమిక పాఠశాలలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలు, 07 ఉన్నత పాఠశాలకు గాను 1483 మంది విద్యార్థిని విద్యార్థులు, కోదాడ మండలంలో 39 ప్రాథమిక పాఠశాలలో, 04 ప్రాథమికోన్నత పాఠశాలలు, 15 ఉన్నత పాఠశాలకు గాను 5134 మంది విద్యార్థులు, చిలుకూరు మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలో, 1 ప్రాథమిక ఉన్నత పాఠశాల, 7 ఉన్నత పాఠశాలకు గాను 1488 మంది విద్యార్థులు, నడిగూడెం మండలంలో 27 ప్రాథమిక పాఠశాలలు, 09 ఉన్నత పాఠశాలలకు గాను 1093 మంది విద్యార్థులు, మునగాల మండలంలో 27 ప్రాథమిక పాఠశాలలు, 02 ప్రాథమికోన్నత పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలకు గాను 1727 మంది విద్యార్థులు ఉండగా, మొత్తం కోదాడ నియోజకవర్గంలో 10925
మంది విద్యార్థులు ఉన్నారు.
గిట్టుబాటు కానీ భోజనం ధరలు..
మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్న నిర్వాహకులైన స్వయం శక్తి సంఘాల మహిళలు, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలకు మార్కెట్లో పెరిగిన నిత్యవసర వస్తువులతో సరిపోవడం లేదు 1 తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ. 5. 45 పైసలు 6 వ తరగతి నుండి 8వ తరగతి వరకు రూ. 8. 17 పైసలు, 9వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు కోడిగుడ్డుతో కలిపి రూపాయలు 10.67 పైసలు చెల్లిస్తోంది. అయితే పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు సరిపడడం లేదు. అయినప్పటికీ నిర్వాహకులు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ప్రభుత్వం గుడ్డుకు రూ.5 చెల్లిస్తుండగా నిర్వాహకులు మార్కెట్లో రూ.6.50 నుండి రూ.7 వరకు కొనుగోలు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని చెప్తున్నారు. 9వ తరగతి 10 తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వము గత విద్యా సంవత్సరంలో సుమారు పది నెలల నుండి నిర్వాహకులకు ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు గుడ్డుకు సంబంధించిన బిల్లులు, పెరిగిన జీతం ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లించకపోతే, అప్పులు ఎవరు ఇచ్చే పరిస్థితి లేనందున ఆగస్టు ఒకటో తేదీ నుంచి 9వ తరగతి పదవ తరగతి విద్యార్థులకు తాము భోజనం అందించలేమని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తక్షణమే పెండింగ్ బిల్లులను, మంజూరైన వేతనాలని చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న కార్మికులు వేడుకుంటున్నారు.