03/02/2025
కేజ్రీవాల్ గారి మీద ఇంత దిగజారి ఆరోపణలు చేయటానికి మీకు మనసు ఎలా ఒప్పింది చంద్రబాబు గారు?ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, నీట్/పోటీ పరీక్షలలో వాటి స్థానం ఏమిటి మన రాష్ట్రాల స్థానం ఏమిటో ఒక్కసారి చూసి రండి. ఓట్ల కోసం మద్యం-ధనం ఏరుల్లా పారించిన వారు అరవింద్ గారు కాదు, మరి ఎవరు? ఎన్నికల ప్రచారంలో ప్లేటు తిరగేయడం- మీ రాజకీయం మీ ఇష్టం, కానీ ఇలాంటి ప్రచారమా? అరవింద్ గారు వారి భార్య సునీత గారు ఐఆర్ఎస్ కి ఎంపికై కమిషనర్ గా కూడా పనిచేశారు తర్వాత స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత లంచాలు దొబ్బారని, వ్యక్తిగతంగా పాలెస్ కట్టుకున్నారని ఇంకోటి ఆరోపణలు లేవు. ముగ్గురు ఐఐటీయన్స్ ఉన్న కుటుంబంలో ఉన్న ఆయనకి, జగన్ మోహన్ రెడ్డి గారికి మీరు లింకు పెట్టారా? విశ్వసనీత కోల్పోవడంలో ఇంకా కిందకు జారిపోతున్నారు, లేదు మిమ్మల్ని జారేలా చేస్తున్నారు ఆదాని గారి పార్టీ బ్యాచ్. What a Great fall! దేశంలో ఒక పెద్ద రాజకీయ వేత్త, stalwart పొజిషన్ నుంచి... ఆ ఆదాని గారి బ్యాచ్ మోషా గార్లకు భజన చేసే బ్యాచ్ గా మారిపోవటంపై ఒక తెలుగు వాడిగా బాధపడుతున్నాను. మీ పార్టీ అభిమానులకు, ఎన్టీఆర్ గారి అభిమానులకు కూడా మీ ఈ వ్యవహారం నచ్చి ఉండదేమో.
మిమ్మల్ని ఏమన్నా ఒక్క మాట అన్నా తప్పుగా అరవింద కేజ్రీవాల్ గారు అన్నారా? ఒక సీటు ఏపీలో వారి పార్టీకి అడిగితే మీరు ఇవ్వకపోయినా సరే, మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి మీకు అనుకూలంగా ప్రచారం చేసి వెళ్లారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా. బిజెపి ఆయనపై కక్ష గట్టడానికి అది కూడా ఒక చిరు కారణం అయి ఉండవచ్చు. పదేళ్ల నుంచి ఢిల్లీని బ్రష్టు పట్టించారు అని నిన్న అన్నారు, ఐదేళ్ల క్రితం ఆయననే గొప్ప పాలకుడు అని పొగిడారు ఏమిటండి? ఢిల్లీలో అర్బన్ డెవలప్మెంట్ అంటే మున్సిపల్ మినిస్ట్రీ మొత్తం మీరు ఇప్పుడు భాగస్వామ్యంలో ఉన్న మోడీ గారి చేతుల్లోనే దాదాపు గత 11 సంవత్సరాల నుంచి ఉంది. లా అండ్ ఆర్డర్ మరియు పోలీస్ సిబ్బంది కూడా కేంద్ర హోంశాఖ చేతుల్లోనే ఉంది. తెలియదా మీకు?
అరవింద్ గారు నాడు ఢిల్లీలో మీరు పెట్టిన సభకు వచ్చి పూర్తిగా సంఘీభావం తెలియజేశారు. మీ ఎంపీలు అరెస్ట్ అయితే ఏకంగా పోలీస్ స్టేషన్ కి ముఖ్యమంత్రిగా వచ్చి వారికి సంఘీభావంగా నిలబడ్డారు. వాళ్ళ ఎంపీలని మీ ఎంపీలకు మద్దతుగా పార్లమెంట్లో నిలబడేలా చేశారు. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా రావాల్సిందేనని తన రాష్ట్రం సంగతి పంజాబ్ కి అడగకుండా మన కోసం పోరాడారు. అలాంటి ఆయన మీద ఇలాంటి ఆరోపణలు ఏమిటండీ? మీరు ఎన్నిసార్లు ఇలా అతికిపోయి ప్రయత్నాలు చేసినా మోడీ గారు మిమ్మల్ని విశ్వసనీయత లోకి తీసుకోరు.
అయినా మాకు అర్థం కానిది మీరు దావోస్ వెళ్లి మోదీ గారిని విపరీతంగా పొగడటం ఏంటో? దావోస్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులోకి పోయి ఆయనను అతిగా పొగిడితే ఆ పెట్టుబడిదారులు ఆయన దమ్మున్నోడు కాబట్టి ఆయన రాష్ట్రంలో కెళ్ళి పెట్టుబడి పెడదాం అని అనుకుంటారు కదా! ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? అసలు దావోస్లో ఆ గుజరాతి పెద్ద గురించి పొగడాల్సిన అవసరం ఏంటి? ఏ విధంగా అయినా సబ్జెక్టా అది? అయినా ఆయన మీకు ఆల్రెడీ వేరే ప్లాన్లు, రెండు మూడు సంవత్సరాలలో త్వరలోనే అష్టదిగ్బంధ వ్యూహాలు రెడీ చేశారంట. నిన్న ఆంధ్రప్రదేశ్ కు జరిగిన బడ్జెట్లో అమరావతికి పోలవరం లైవ్ స్టోరేజీ కి ఇచ్చే నిధుల విషయంలో చేసిన మోసం గురించి కనీసం బయట ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం అటుంచి రివర్స్లో కేంద్రాన్ని విపరీతంగా పొగడటం నచ్చలేదు. అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆ గుజరాతి పాలకులకు వీర విధేయత చూపించారు, రాష్ట్ర హక్కుల్ని పక్కన పెట్టారు. మొన్న కేంద్రం చేసిన దుర్మార్గ బడ్జెట్లో కంటే 8 సంవత్సరాల క్రితం బడ్జెట్లోనే కొంత మేలు. అప్పుడు రక్తం సలసలా మరిగిపోతుంది అన్నారు మీరు. మరి ఇప్పుడు ఎందుకని అలా జరగలేదు? దయచేసి ఆలోచించండి. 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని దిక్కుమాలిన సర్వేలు నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్లి వేచి ఉండి కలిసి వచ్చారు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అవి సరికాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్లకి (గుజరాత్ కి కూడా?) వనరులు తరలించారు, అది ఆ మోషా గార్లు వారి బాస్ ఆదాని గారి దృష్టిలో పడి మీ మీద మరింత కక్ష పెరిగింది. సహజం. ఆ రెండిటి వల్ల ఆఖరులో మీ ఎన్నికల్లో వనరులు తక్కువై ఇబ్బంది పడ్డారు అనేది నిజం కాదా? 2019 నుంచి అంతకుముందు కంటే కూడా ఉధృతంగా మేము ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఉద్యమం చేసినా సరే 95% మీడియా ప్రజలకు తెలియజేయలేదు. ఆ సమయంలో కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా 99.99% ప్రజలకు మీడియాలు తెలియచేయలేదు. మా పోరాటం ఆంధ్ర హక్కుల కోసం తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఏనాడూ ఆగలేదు, ఆగదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా విన్నపం.