26/02/2022
🌏 న్యూస్ హైలెట్స్🌏
(27/02/2022)
🅿️మోదీతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఏమన్నారంటే?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. రష్యా దురాక్రమణను నియంత్రిస్తున్నట్లు ప్రధానికి తెలిపిన జెలెన్.. ఐరాస భద్రతా మండలిలో తమకు భారత్ నుంచి రాజకీయ మద్దతు కావాలని మోదీని కోరారు. దురాక్రమణను కలిసి పోరాడదామని పేర్కొన్నారు.
🅿️కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో.. సురక్షితంగా..!
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల యుద్ధంతో.. రెండు రోజులుగా కంటిమీద కునుకులేకుండా బతుకుతున్న భారతీయ విద్యార్థులకు క్రమంగా ఉపశమనం లభిస్తోంది. ఇండియన్ ఎంబసీ, కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో వారిని స్వదేశానికి తరలించేందుకు చర్యలు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేక బస్సుల ద్వారా వారిని సరిహద్దులకు తరలిస్తున్నారు.
🅿️ యూపీ లో సర్వం సిద్ధం.. బరిలో 692 మంది
ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఆదివారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
🅿️పట్టాలపై వ్యక్తి.. దూసుకొచ్చిన రైలు..?
ప్రజ్ఞ టుడే: ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిన ఓ వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడు. బిహార్ పాట్నా రైల్వేస్టేషన్లో రైలు రావడానికి ముందు ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి పట్టాలపై పడిపోయాడు. ఇంతలోనే రైలు దూసుకొచ్చింది. దీంతో పట్టాల మధ్యలో కదలకుండా అలాగే ఉండిపోయాడు. రైలు వెళ్లిపోగానే లేచి ప్లాట్‌ఫామ్‌పైకి పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు.
🅿️అక్కడ లీటర్ పెట్రోల్ రూ.200 ప్లస్
: అసలే ఆకలి సంక్షోభంలో మగ్గుతున్న శ్రీలంక నెత్తిన మరో పిడుగు పడింది. తినడానికి తిండి లేకుండా ఉన్న లంకేయులకు చమురు, నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. చమురు కొనుగోళ్లకు డబ్బులు లేవంటూ గతవారం అక్కడి సర్కారు చేతులెత్తేసింది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచుతూ చమురుసంస్థలు తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రజలను మరింత కుంగదీస్తోంది. శ్రీలంకలో లీటరు పెట్రోల్ 204 రూపాయలకు చేరగా.. లీటరు డీజిల్ ధర 139 రూపాయలకు ఎగబాకింది.
🅿️కేయూలో ఆందోళన..
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పరిపాలన భవనం ముందు నిరసన చేపట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదువుతున్న వారిని వసతిగృహాలు ఖాళీ చేయాలని ఆదేశించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
🅿️ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం
ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ బస్సులోనే అత్యాచారం చేశాడని ఓ మహిళ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 23న ఊరికి వెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ ఎక్కినట్లు మహిళ చెప్పింది. అర్ధరాత్రి కత్తితో బెదిరించి డ్రైవర్ అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది.
🅿️పెళ్లి కాలేదని వెళితే.. తల్లీకూతుళ్లపై రెండేళ్లుగా బాబా అత్యాచారం!
బాధితురాలు తన కుమార్తెకు పెళ్లి కావటం లేదని.. యోలా తాలూకాలోని నాగ్డే గ్రామంలో బాబా వద్దకు వెళ్లింది. యువతిపై చేతబడి జరిగిందని చెప్పిన బాబా.. తల్లితో సహా ముగ్గురు యువతులకు మత్తుమందు కలిపిన నీళ్లు తాగించాడు. అనంతరం సోదరుడితో కలిసి వారిపై అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించి.. సుమారు రెండున్నరేళ్లుగా తరచూ తల్లితో పాటు ఆమె కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతేకాకుండా ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు.
బాబా ఆగడాలు తట్టుకోలేని బాధితురాళ్లు.. ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించటం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. వారిని సూఫీ అజీజ్ అబ్దుల్ బాబా, జబ్బర్ షేక్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
🅿️రూ. 13.7 కోట్ల హెరాయిన్ సీజ్
రూ.7 కోట్ల విలువైన 1.04 కేజీల హెరాయిన్‌ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తరలింపుకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
🅿️చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స
అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ చిన్నారిని రక్షించారు కేరళ వైద్యులు. శిశువు జీర్ణక్రియలో ఉత్పత్తి అయ్యే ద్రవం ఛాతీలోకి లీక్ అవుతుందని గుర్తించి ఆమె ప్రాణాలు కాపాడారు.
🅿️నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం..
నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్ దుర్మరణం చెందారు. తమిళనాడుకు చెందిన గజరాజ్ కుమార్తె మహిమ.. నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీలో పైలట్‌గా శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా.. శిక్షణ విమానం 'సెస్నా-152' డబుల్ సీటర్‌లో ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పెదవూర మండలం రామన్నగూడెం తండా వద్దకు రాగానే.. విమానం అదుపుతప్పి వ్యవసాయ పొలాల్లో కుప్పకూలింది. భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. విమానం ముక్కలు కాగా.. మహిమ మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది.
"మహిమ అనే మహిళా పైలట్ మాచర్లలోని ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ నుంచి ట్రైనింగ్‌లో భాగంగా ఉదయం 10.30 గంటలకు శిక్షణ విమానంలో హైదరాబాద్ వైపు బయలుదేరింది. నాగార్జునసాగర్ వైపు నుంచి రామన్నగూడెం తండా వద్దకు రాగానే.. గాల్లోనే కంట్రోల్ తప్పి స్పిన్ అయింది. ఉదయం 10.50 గంటల సమయంలో కూలిపోయింది. ఇది సెస్నా 152 అనే ఎయిర్ క్రాఫ్ట్. ఇది టూ సీటర్ ప్లేన్.. దీన్ని ట్రైనింగ్ కోసం వినియోగిస్తారు. ప్రాథమిక విచారణలో మాకు ఈ విషయాలు మాత్రమే తెలిశాయి."- రెమా రాజేశ్వరి, నల్గొండ జిల్లా ఎస్పీ
🅿️గవర్నర్ తమిళిసైను అడ్డుకున్న మహిళలు
రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కొందరు మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని మహిళలు ఆరోపించారు.
గవర్నర్ అడ్డుకునేందుకు యత్నించిన మహిళలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ మహిళకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చినా బాధితులను ఎవరూ పట్టించుకోవడంలేదని మహిళలు ఆరోపించారు. పీఎస్‌లో కనీసం ఫిర్యాదు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు ఆమెకు సమస్యను తెలిపేందుకే యత్నించినట్లు తెలుస్తోంది.
🅿️శ్రీరాములపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీరాములపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన అనంతరం 31 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కాగా.. వారిని కమలాపూర్ పీహెచ్‌సీకి తరలించారు. కలుషిత ఆహారం కారణంగానే ఇలా జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. పలువురు విద్యార్థులు బలహీనంగా ఉన్నారని పేర్కొన్నారు
🅿️ అణ్ ఖడ్గాన్ని జరిపించిన పుతిన్... అడ్డు రావద్దంటూ హెచ్చరిక...
ఉత్తర కొరియా వంటి ఉలిపికట్టె తప్ప రెండో ప్రపంచ యుద్ధం తరవాత పెద్ద దేశమేదీ అణ్వస్తాల్రను చూపి బెదిరించిన సందర్భమే లేదు. గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఆనవాయితీని తప్పారు. ఉక్రెయిన్ మీద దండయాత్ర ప్రారంభించేముందు చేసిన ప్రసంగంలో ఆయన అణ్వస్త్రాల ప్రస్తావన తెచ్చారు. "సోవియట్ యూనియన్ పతనమయ్యాక గణనీయంగా వనరులు, శక్తిసామర్థ్యాలను కోల్పోయినప్పటికీ రష్యా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్ర రాజ్యమే. మా వద్ద ఇంకా అనేక అత్యాధునిక ఆయుధాలూ ఉన్నాయి. మా మీద ఎవరైనా దాడిచేస్తే తప్పక ఓటమి పాలవుతారు. వినాశకర పరిణామాలను ఎదుర్కొంటారు" అని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను అడ్డుకోవడానికి ఇతర దేశమేదైనా సైనికంగా ప్రయత్నిస్తే అణు దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఇలా పరోక్షంగా హెచ్చరించారు. ఇది అమెరికాను ఉద్దేశించి చేసిందనడంలో సందేహం లేదు.
🅿️ఐపీఎస్ అధికారి రష్మి శుక్లాపై ఎఫ్ఐఆర్
(పుణె): అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుణె మాజీ కమిషనర్, ఐపీఎస్ అధికారిణి రష్మి శుక్లాపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. పుణెలోని బంద్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
🅿️మనస్తాపంతో యువ రైతు ఆత్మహత్య
(ముదిగొండ) : మండల పరిధిలోని మేడేపల్లి గ్రామంలో ఓ యువ రైతు.. వ్యవసాయంలో నష్టం వాటిల్లి అప్పులపాలు కావడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాల నేపథ్యంలో అప్పుల బాధ భరించలేక వెంకట రామారావు(30) అనే వ్యక్తి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🅿️మాట తప్పిన రష్యా.. జనావాసాలపై క్షిపణి దాడి
ఉక్రెయిన్‌పై రష్యా బలగాల మిస్సైల్స్ దాడి కొనసాగుతోంది. ఉక్రెయన్ రాజధాని నగరంలో కీవ్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో సుమారు ఐదు ఫ్లోర్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అపార్ట్‌మెంట్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపాయి. బాధితుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొదటి నుంచి ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలే తమ టార్గెట్ అంటూ చెప్పుకొస్తున్న రష్యా.. జనావాసాల మీద కూడా బాంబులతో విరుచుకుపడుతోంది.
రాజధాని నగరం కీవ్‌లోని ఓ భారీ భవనంపై రష్యా సైన్యం క్షిపణి ప్రయోగించిందని కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపారు. రాత్రి పూట రష్యా దళాలు.. దాడులకు దిగడంతో కీవ్‌లో భయనక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కీవ్‌లోకి ప్రవేశించడానికి రష్యా సైన్యం అన్ని దిశలను నుంచి దాడులు చేస్తూ వస్తోందన్నారు.
దెబ్బతిన్న అపార్ట్‌మెంట్ ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. శాంతియుతమైన కీవ్ నగరం.. రష్యా బలగాలు క్షిపణుల దాడులతో అట్టుడుకుతోందని అన్నారు. రష్యా ప్రయోగించిన మిస్సైల్ ఒకటి కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించాలని ఆయన కోరారు.
🅿️ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పేస్‌స్టేషన్‌ను కూల్చేస్తాం.. బైడెన్‌కు రష్యా దమ్కీ!!
అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను కూల్చేస్తామని హెచ్చరించింది. స్పేస్ స్టేషన్‌ను యూరప్ దేశాలపై కూల్చేస్తే మీకు ఓకేనా అంటూ ప్రశ్నించారు రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ రొగొజిన్. ఆంక్షలతో రష్యాను కట్టడి చేయాలంటే ఫలితం వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఉక్రెయిన్‌లోని సామాన్య ప్రజలపై రష్యా సైన్యం పాశవిక దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు మద్దతుగా నిలుస్తూ తమకు(నాటోకు) వ్యతిరేకంగా ఉన్న దేశాలకు జో బైడెన్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. అంతేకాదు ఈ అరాచకత్వానికి పుతిన్ కొన్ని నెలల నుంచే ప్రణాళిక రూపొందించారని, 1,75,000 మంది జవాన్లను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించారని చెప్పారు. ఉక్రెయిన్ వల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉందంటూ రష్యా ఒక రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.అయితే బైడెన్ ఈ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. రష్యా బెదిరింపు ధోరణికి దిగింది.
రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ బైడెన్‌కు దమ్కీ ఇచ్చారు. మమ్మల్ని ఆంక్షలతో కంట్రోల్ చేయాలని చూస్తే స్పేస్ స్టేషన్‌ను ఎవరు కాపాడతారు?" అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్‌లు చేశారు. "మీరు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే యూఎస్ లేదా, ఐరోపా దేశాల్లో స్పేస్ స్టేషన్ పడకుండా ఎవరు కాపాడతారు? అంటూ రోగోజిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. యూరప్? భారత్ - చైనా దేశాల మీద 500టన్నుల స్పేస్ స్టేషన్ కూల్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రవర్తనతో వాళ్లను ప్రమాదంలో పడేయాలని అనుకుంటున్నారా?’ ఐఎస్ఎస్ రష్యా మీదగా ఎగరదు, కాబట్టి ప్రమాదాలన్నీ మీకే. మీరు వాటికి సిద్ధంగా ఉన్నారా? అంటూ రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
🅿️పుతిన్ ఆస్తులు సీజ్.. అమెరికా సంచలన నిర్ణయం
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా ప్రభుత్వంపై కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన అగ్రరాజ్యం.. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌పై వ్యక్తిగత ఆంక్షల బాణాలను ఎక్కుపెట్టింది. ఉక్రెయిన్‌పై దాడికి వీరివురే బాధ్యులని ఆరోపించింది.
ఈ విషయంలో అమెరికా.. ఐరోపా సమాఖ్యను అనుసరించింది. పుతిన్‌తో పాటు లావ్రోవ్‌ల ఆస్తులను స్తంభింపజేసేందుకు ఈయూ నిర్ణయించింది. ఈ రెండో విడత ఆంక్షలకు 27 దేశాల ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశం ఆమోదం తెలిపింది. ఇలా అగ్రరాజ్యం ఓ దేశాధినేతపై నేరుగా ఆంక్షలు విధించడం చాలా అరుదు. గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, బెలారస్ అధ్యక్షుడు లుకషెంకా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌పై ఈ తరహా ఆంక్షలు అమలు చేసింది.
రష్యా రక్షణ మంత్రి సెర్టీ షోయిగు, రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరసిమోవ్‌పై కూడా అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఇప్పటికే రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 11 మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ.. పుతిన్ ఆక్రమణ దిశగా అడుగులు వేశారని అమెరికా భావిస్తున్నట్లు తెలిసింది. ఇది పూర్తిగా పుతిన్ నిర్ణయమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యావత్తు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చి రష్యా చర్యలను వ్యతిరేకించాల్సిన బాధ్యత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఉంది.
అమెరికా సహా ఇతర దేశాలు విధిస్తున్న కఠిన ఆంక్షలతో రష్యా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. అలాగే, అంతర్జాతీయ సమాజంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఒంటరి అవుతుందని తెలుస్తోంది. పుతిన్‌పై నేరుగా ఆంక్షలు విధించడంతో రష్యా దురాక్రమణను నిలువరించడంతో పాటు, ఐరోపాలో పెద్దయుద్ధం జరగకుండా ఆపే దిశగా ముందుకెళుతున్న పరిస్థితి కనిపిస్తిన్నా.. ఇది సాధ్యమేనా అనేది ప్రశ్న. ఏదేమైనా.. ప్రస్తుతం అమెరికా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు.
🅿️ఓయోలో రూం బుక్ చేసుకుంటున్నారా... హైదరాబాద్ పోలీసులు మీపై కన్నేశారు
ఓయో రూమ్స్ గురించి యువతకు పరిచయం చేయనవసరం లేదు. వివిధ రకాలైన లాడ్జీలు మరియు హోటల్ల నిర్వాహకులకు సైతం ఈ సేవల గురించి తెలిసిందే. అయితే ఓయో రూమ్స్ విషయంలో ఇన్నాళ్లు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క అని హైదరాబాద్ పోలీసులు తేల్చిచెప్తున్నారు.
హైదరాబాద్ పరిధిలోని ఓయో రూమ్స్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రూమ్స్ల్లో పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బషీర్ బాగ్లోని సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నగరంలోని ఓయో రూమ్స్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి అని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ప్రతి ఓయో సెంటర్ వద్ద సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచాలన్నారు. 6 నెలల స్టోరేజీని తప్పనిసరిగా భద్రపరచాలని ఆదేశించారు. ఓయో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ కార్డుతో పాటు ఇతర వివరాలను కచ్చితంగా నోట్ చేసుకోవాలని సీపీ సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇదిలాఉండగా డార్క్ నెట్ వెబ్సైట్ కార్యక్రమాలపై నిఘా పెట్టామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పటిష్ట నిఘా పెట్టి నిందితుల్ని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసిందన్నారు. డ్రగ్స్ కేసుల్లో మొత్తం 11 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులే అధికంగా ఉన్నారు. గతంలో కౌన్సెలింగ్ ఇచ్చి విద్యార్థులను వదిలేశామన్నారు. విద్యార్థులు మళ్లీ డ్రగ్స్ వాడుతున్నారని అందుకే విద్యార్థులను అరెస్టు చేశామని ప్రకటించారు.
🅿️వెయ్యి రూపాయల కోసం కజిన్ బ్రదర్ హత్య.. కామారెడ్డిలో దారుణం.. మర్డర్ కేసును ఒక్క రోజులో చేధించిన పోలీసులు
డబ్బుకు బంధాలు.. ప్రేమలు ఏమీ ఉండవు.. డబ్బు కొసం మనిషి ఏమైనా చేస్తాడు.. ఎంతటి దారణానికైనా తెగిస్తాడు. ప్రాణం తీయడానికైనా వెనుకాడరు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన షేక్ సమీఉద్దీన్ నిజామాబాద్ నగరంలోని ఓ ఫ్లవర్ మర్చంట్ లో పనిచేస్తున్నాడు. అయితే తన చిన్నాన్న కొడుకు అయినా షేక్ వసీం ను కూడా అక్కడే పనికి పెట్టాడు. వసీం తన యజమాని వద్ద 45 వేలు రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు కట్టలేక పోయాడు. అయితే ఆ యజమాని.. మీ వాడు డబ్బులు తీసుకుని వెళ్లాడు, తిరిగి కట్టలేదని షేక్ సమీఉద్దీన్ కు చెప్పాడు. దీంతో సమీ ఉద్దీన్ వసీం దగ్గరికి వెళ్లి డబ్బులు ఆడిగారు. దీంతో వసీం రూ. 45 వేలు తీసుకువచ్చి షేక్ సమీ ఉద్దీన్ కి ఇచ్చి యజమానికి ఇవ్వమని చెప్పాడు. సమీ ఉద్దీన్ మాత్రం 44 వేలు రూపాయలు ఓనర్‌కు ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు తన వద్దే ఉంచుకున్నాడు.
షేక్ సమీ ఉద్దీన్, షేక్ వసీం తో పాటుగా మరో స్నేహితుడు అలిమొద్దిన్ తో కలిసి ఫిబ్రవరి 24న రాత్రి దుబ్బ ప్రాంతంలోని వైన్ షాపులో మద్యం సేవించారు. అయితే ఫ్లవర్ మర్చంట్ యజమాని వసీం కి ఫోన్ చేసి, సమీ ఉద్దీన్ 44 వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు, ఇంకా వెయ్యి రూపాయలు ఎప్పుడిస్తావని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన వసీం, సమీ ఉద్దీన్ ను నిలదీశాడు. మాటా మాటా పెరిగి ఇద్దరు కజిన్స్ గొడవ పడ్డారు. ఆగ్రహించిన వసీం కోడిని కోసే కత్తితో సమీ ఉద్దీన్ పై దాడి చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు . దీంతో సమీ ఉద్దీన్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో స్నేహితుడు అలీమొద్దిన్ను అపే ప్రయత్నం చేయగా అతనిపై సైతం వసీం దాడికి పాల్పడటంతో అతను అక్కడి నుండి పారిపోయాడు.
విషయం తెలుసుకున్న నిజామాబాద్ నగర సీఐ కృష్ణ, మూడో టౌన్ ఎస్ఐ భాస్కర చారీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వసీం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం లోని బస్టాండ్ లో ఇతర ప్రాంతానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.
🅿️మూడో ప్రపంచం యుద్ధం వస్తే ఎవరు ఎటువైపు నిలుస్తారు..
ఉక్రెయిన్ ఉరుముతోంది. రష్యా గర్జిస్తోంది. ఫలితంగా బాంబుల మోత మోగుతోంది. స్కడ్, మిసైల్స్ ప్రయోగాలే కాదు సైరన్ శబ్దాలతో ఠారెత్తుతోంది. బతుకుజీవుడా అంటూ బంకర్లలో దాక్కోవాల్సి వస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందో తెలియడం లేదు. ఇప్పుడు అంతటా ఒకటే చర్చ. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా. మహాయుద్ధం వస్తే ఏయే దేశాలు ఎటువైపు ఉంటాయి. భారత్ పరిస్థితి ఏంటి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాల ముప్పు పొంచి ఉందా.. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని పుతిన్ ప్రకటించడం ఉత్కంఠను పెంచుతోంది. మూడో ప్రపంచం యుద్ధం వస్తే ప్రపంచంలోని 224 దేశాలు మూడు ముక్కలవడం ఖాయంగా కనిపిస్తోంది. 1945 తర్వాత ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. యుద్ధం చేసే వారి వైపు రెండుగా మిగతాదేశాలు చీలతాయి. ఎవరి వైపు కాకుండా తటస్ఠంగా ఉండే దేశాలు మూడోవైపు కానున్నాయి. ఊహాజనితమే అయినా వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం..
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం..
నాలుగు కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్‌పై 14 కోట్లకు పైగా జనాభా ఉన్న రష్యా దాడి చేస్తోంది. అన్ని అస్త్రశస్త్రాలను వాడుతోంది. ఇటు ప్రాణ నష్టం, అటు ఆస్తి నష్టం జరుగుతోంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. యుద్ధం వద్దని చెప్పలేక అలాని ఊరుకోలేక తల్లడిల్లుతున్నాయి చాలా దేశాలు. రష్యాపై ఆంక్షలు విధించడం నాటోలోని 30 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) లోని 27 దేశాలకు సుతారం ఇష్టం లేదు. రష్యన్ సైనికుడు అడ్డంకులు తెలుసుకోవాలనుకోడు అనేది సామెత. ఇప్పుడు కీవ్ నగరంలో వారికి అదే ఎదురవుతోంది. తక్కువ మంది ఉన్నా.. ఉక్రెయిన్ వాసులు ధీటుగానే తిప్పికొడుతున్న తీరు ఆశ్చర్యమే. ఆప్ఘనిస్తాన్‌లో యుద్ధంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోతే తమ దేశం కోసం, తమ ప్రజల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వయంగా రంగంలోకి దిగడం కత్తిమీద సామె. రష్యాపై ఆంక్షలు విధిస్తే ఆర్థికంగా నష్టమే అయినా ఇటు ఈయూ అటు నాటో మరోవైపు మిగతా దేశాలు గట్టి హెచ్చరికలే పంపాయి. సమరానికి సై అంటున్న దేశాలే కాదు.. వాటితో పెట్టుబడులు పెట్టిన దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే వీలుంది. ముడిచమురు, గ్యాస్, ఆహారం, లోహాల విషయంలో ఆధిపత్యం ఉన్న రష్యాతో ఢీ అంటే ఢీ అనే దేశాలు కాస్త వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నాయి.
రష్యాకు మద్దతునిచ్చే దేశాలు..
రష్యాకు మద్దతునిచ్చే దేశాలు..
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతలా రష్యాకు శత్రుదేశం అమెరికా. దానికి శత్రువు చైనా. కాబట్టి చైనా నుంచి రష్యాకి గట్టి మద్దతు ఉంది. ప్రపంచంలో అమెరికాకు ధీటుగా బదులిచ్చే దేశాల్లో ముందు వరుసలో ఉంది చైనా. అందులోను రష్యా కమ్యూనిస్టు దేశం కావడంతో మొదటి నుంచి చైనా-రష్యాల మధ్య గట్టి బంధమే ఉంది. ఉక్రెయిన్ కు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ( నాటో) ఏక పక్షంగా మద్దతునివ్వడంపై చైనా ధ్వజమెత్తుతోంది. మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాలు చైనాను ఏకాకి చేసే ప్రయత్నం చేసినా రష్యా అండగా ఉంటూ వస్తోంది. చైనాకు 57,321 మిలియన్ డాలర్లు ఎగుమతులను (13.43 శాతం) పంపుతోంది రష్యా. అదే సమయంలో చైనా నుంచి 54,142 మిలియన్ల డాలర్లు దిగుమతులు( 21.91 శాతం వాటా) రష్యాకు వస్తున్నాయి. వాణిజ్యం, మిలటరీ, స్పేస్ వంటి రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. కాబట్టి డ్రాగన్ కంట్రీ ఓటు రష్యాకే.
ఆ ఆరుగురు..
1991లో సోవియెట్ యూనియన్ ముక్కలైంది. 15 దేశాలుగా విడిపోయింది. అందులో ఉన్న అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, బెలారస్ రూటు ఇప్పుడు రష్యా వైపే. ఆ ఆరు దేశాలు రష్యాను వేరు పరచలేవు. అందుకే బెలారస్ లో ముందుగానే తమ యుద్ధ విమానాలను ఉంచిన పుతిన్ అక్కడ నుంచే ఉక్రెయిన్ పై దాడి మొదలెట్టాడు. ఈ దేశాల మధ్య కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్‌టీవో) ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా, అది తమ మీద దాడిగానే భావించాలి. ఒకరికొకరు సహకారం అందించుకోవాలనేది నియమం. అందుకే ఆ దేశాలు ఎప్పుడు ఒకటే.
పిట్ట కొంచెం కూత..
అమెరికాకు బద్ద శత్రుదేశం క్యూబా. చిన్నదేశమైన క్యూబాను ముప్పు తిప్పలు పెట్టినా అగ్రదేశం అమెరికాకు లొంగలేదు. పంచదార దేశమైన క్యూబా ఎప్పుడూ అండగానే ఉంటోంది. నాటో బలగాలు రష్యా సరిహద్దులకు వెళితే ఊరుకునేది లేదని గట్టిగానే చెప్పింది.
2011లో సిరియాలో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు అండగా నిలిచింది రష్యా. సిరియాకు రష్యా మంచి మిత్రదేశం. కాబట్టి ఆ దేశం మద్దతు కచ్చితంగా రష్యాకే. పాపులిస్టు విధానాలతో ఆర్థిక రంగంలో పుంజుకున్న వెనెజులా మొదట్నుంచి రష్యాకు మిత్రుడే. ఇక మధ్య ప్రాచ్య దేశాల్లో ఇరాన్ మద్దుతు ఎప్పుడూ రష్యాకే ఉంటోంది. అమెరికాకు బద్ద శత్రువు ఇరాన్. అసలు ఇరాన్ తో అమెరికా అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మాములు విషయం కాదు.
అప్పటి నుంచి ఇరాన్ రష్యాకు దగ్గరవుతోంది. ఇరాన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రష్యా ఆయుధాలు సరఫరా చేసింది. అట్టు పెడితే అట్టున్నర పెట్టాలన్నట్లు ఇరాన్ రష్యాతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. అవసరాన్ని బట్టి సాయం చేస్తానంటోంది.
అతడి రూటే సెపరేటు..
మొండోడు మేధావి కంటే గట్టోడు అనేది సామెత. దక్షిణ కొరియానే కాదు.. అమెరికాకు చుక్కలు చూపిస్తూ కొరకరాని కొయ్యగా మారాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్. అణు పరీక్షల ద్వారా అమెరికాకు నిద్రలేకుండా చేస్తున్నాడు. అలాంటి నార్త్ కొరియా రష్యాకు దన్నుగా ఉంది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేసినప్పుడు అమెరికా ఆంక్షలు విధించే ఆలోచన చేసింది. కానీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో అధికారమున్న దేశాల్లో రష్యా ఉండటంతో అడ్డుపడినట్లైంది. ఐరాసలోని 192 దేశాలు సరే అన్నా.. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల్లోని ఒక్క దేశం కాదన్నా వెనక్కు తగ్గాల్సిందే. ఇక్కడ అదే జరిగింది. అమెరికాకు రష్యానే కాదు.. చైనా గట్టిగానే అడ్డుపడింది. మూడో ప్రపం యుద్ధం వస్తే ఉత్తర కొరియా రష్యా వైపే ఉంటుంది.
ఉక్రెయిన్ కు మద్దతునిచ్చే దేశాలేంటి..
రష్యాకు వైరి వర్గం అమెరికా. సహజంగానే అది ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తోంది. అసలు ఉక్రెయిన్ ఆ మాత్రం ఉందంటే అమెరికా ఉందనే ధీమానే. కాకపోతే రష్యా అణ్వస్త్రాలను తీస్తుందనే భయంతో ఏం చేయలేకపోతోంది అగ్రరాజ్యం. మరోవైపు బ్రిటన్ ఉక్రెయిన్‌కి అండగా నిలుస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. రష్యా పై ఆంక్షలు విధిస్తోంది.
నాటో కూటమిలో ఉన్న 30 యూరప్ దేశాలైన ఆల్భేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రోయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈస్తోనియా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐస్ లాండ్, ఇటలీ, లాత్వియా, లుధేనియా, లక్సంబర్గ్, మాంటినిగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రుమేనియా, స్లోవేకియా, సాల్వినియా, స్పెయిన్, టర్కీ, యూకే, అమెరికా మద్దతు ఉక్రెయిన్‌కే ఉంది. పైకి చెప్పకపోయినా రష్యా పై ఆంక్షలు విధించేందుకే వారి మొగ్గు ఉంది. వారు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఉక్రెయిన్ నాటో దేశం కాకపోవడంతో వారెవరు రష్యా పై దండెత్తే అవకాశం లేదు. కాకపోతే బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్‌ల్యాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్ దేశాలు మొదటి నుంచి ఉక్రెయిన్ కు సహకారం అందిస్తున్నాయి.
రష్యా తీరును మొదట్నుంచి వ్యతిరేకిస్తోంది పోలెండ్. ఉక్రెయిన్‌కి చమురు, ఆయుధ సరఫరా చేస్తోంది. రష్యాను తప్పుపడుతూ మిగతా దేశాలను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. పెద్ద దేశమైన జర్మనీ చాన్స్‌లర్ ఉలఫ్ స్కాల్జ్ రష్యా యుద్ధం చేయవద్దని చెబుతూ వస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానేయల్ మాక్రాన్ కూడా రష్యా వెనక్కు తగ్గాలని మొదటి నుంచి పిలుపునిస్తున్నాడు. రష్యాకి నచ్చజెప్పేందుకు ఆ రెండు దేశాలు బాగానే ప్రయత్నించాయి. ఉక్రెయిన్ లోని లుహాన్స్, డోనెస్కీలను స్వతంత్ర హోదా కల్పిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేయడం వారికి మరింతగా ఆగ్రహం తెప్పించింది. అంతే తాము ఉక్రెయిన్ కు మద్దతుగా ఉంటామని చెప్పాయి. జర్మనీ అయితే రష్యాతో చేసుకున్న వాణిజ్యం బంధాలపై పునరాలోచన చేస్తామని హెచ్చరించింది. నార్డ్ స్ట్రీమ్ గ్యాప్
పైప్‌లైన్-2 ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్లు జర్మనీ ప్రకటించడం రష్యాకు పెద్ద దెబ్బ.
బ్రిటన్ (UK) కూడా రష్యా పై ఆంక్షల కొరఢా ఝళిపించింది. రష్యా బ్యాంకుల సేవలను పూర్తిగా రద్దు చేసింది. యూకే మార్కెట్లో రష్యా పెట్టుబడులు పెట్టవద్దని ఆదేశాలిచ్చింది. రష్యా నుంచి ఎవరూ ఇటువైపు రావద్దని చెప్పేసింది. బ్రిటన్ కు వచ్చే రష్యా ఎయిర్‌లైన్స్‌పై నిషేధం విధించింది. హైటెక్, రిఫైనరీ ఉత్పత్తుల సరఫరాను నిలిపేసింది.
ఇక దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించాయి చిన్న దేశమైన చెక్ రిపబ్లిక్ తన మద్దతుదారులతో కలిసి ఉక్రెయిన్‌కి అండగా ఉంటామని చెప్పింది. వారే కాదు యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈయూ చీఫ్ ఉర్సులా లెయెన్ రష్యా దాడిని ఖండించడమే కాదు.. రక్తపాతం వద్దని రష్యాను హెచ్చరిస్తోంది.
గోడమీద పిల్లులు..
ఉక్రెయిన్-రష్యా విషయంలో భారత్‌తో పాటు చాలా దేశాలు తటస్థ వైఖరి అవలింబిస్తున్నాయి. ఉక్రెయిన్-భారత్ మధ్య ఏటా 2.5 బిలియన్ డాలర్లు (రూ.19,000 కోట్లు) వర్తకం సాగుతోంది. లోహాలు, ప్లాస్టిక్, పాలీమర్స్, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నాం. రెడ్డీ ల్యాబ్స్, సన్ వంటి కంపెనీల నుంచి మందులు, మిగతా ప్రాంతాల నుంచి యంత్ర సామగ్రి, రసాయనాలు, ఆహారపదార్థాలను అక్కడకు ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు రష్యాతోను వాణిజ్యం బాగానే సాగుతోంది. 2020-21 8.1 బిలియన్ డాలర్ల వాణిజ్యం ( సుమారు రూ.61,000 కోట్లు)భారత్ -రష్యా మధ్య జరిగింది. రష్యాకు మనం 2.6 బిలియన్ డాలర్లు ( రూ.
19,500 కోట్లు) విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తుండగా అక్కడ నుంచి 5.5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. ఒకవైపు కోపు తీసుకుంటే మరోవైపు ఇబ్బంది ఎదురవుతోంది.
ఇటు రష్యా, అటు అమెరికాతోనూ మనకు మంచి సంబంధాలున్నాయి. అందుకే శాంతి శరణం పఠిస్తున్నాం. చైనాతో గల్వాన్ సరిహద్దుల్లో యుద్ధం వచ్చినప్పుడు రష్యా సాయం కావాలనుకుంది భారత్. చైనా, రష్యాలు స్నేహితులు కాబట్టి పుతిన్ ద్వారా చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత్ వ్యవహరిస్తోంది. మనం వాడే ఆయుధాల్లో 50 శాతం రష్యా నుంచి కొనుగోలు చేసినవే. అంతే కాదు.. ఒకదేశం వైపు మొగ్గు చూపితే నాటో, ఈయూ కూటమిలోని సభ్య దేశాలు భారత్ కు వైరి వర్గంగా మారే వీలుంది. అంత అవకాశం ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే భారత్ గోడమీద పిల్లవాటంలా ఉంది. భారత్ వైఖరిని రష్యా స్వాగతిస్తుంటే ఉక్రెయిన్‌కు కోపం వస్తోంది. ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఫోన్ చేసి మరీ మద్దతు కోరినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.