16/11/2024
ఉద్యోగం
- నిరుపమ రావినూతల
#31 29/09/2024
ప్రభాత వేళ, తూరుపు తెలతెలవారుతుండగా, అలవాటు ప్రకారం, ఐదున్నరకే మెలకువొచ్చింది నాకు. వేసవి సెలవులు కావటంతో, స్కూల్ టీచర్‌గా పనిచేసే నాకూ బడికెళ్ళే నా పిల్లలకీ సెలవులే. బడి ఉన్న రోజుల్లో పిల్లల్ని లేపి, తయారుచేసి, వాళ్ళకి టిఫిన్లూ గట్రా పెట్టి, లంచ్ బాక్సులు కట్టి, నేనూ బడికి తయారవ్వాలంటే పొద్దున్నే లేెవాల్సిందే. దాంతో రోజూ టంచనుగా లేవటం అలవాటు కాబట్టి, సెలవులైనా మెలకువొచ్చేసింది. ఇక లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, చక్కటి వేడి వేడి కాఫీ కలుపుకుని, పెరట్లో పక్షుల కిలకిలారావాలు వింటూ, కాఫీతోపాటు లేలేత సూర్యకిరణాల వెచ్చదనాన్ని కూడా ఆస్వాదిస్తూ కూర్చున్నాను. ఇంకా భానుడి ప్రతాపం పతాక స్థాయికి చేరలేదు కాబట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మావారు పేరుకి ‘వర్క్ ఫ్రం హోం’ కానీ- అందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లాగే ఎడతెరపి లేని మీటింగులూ అర్ధరాత్రి దాకా పని ఒత్తిడి. అందుకే తనని పడుకోనిచ్చి, నేను వాకింగ్‌కి వెళ్దామనుకుని, పిల్లల్ని కూడా పార్కు దాకా తీసుకెళ్తే బావుంటుందనిపించి, వాళ్ళని కూడా లేచి తయారవమన్నాను. వాళ్ళు వేడిగా పాలు తాగేసి, నాతో బయలుదేరారు.
13, 8 ఏళ్ళ వయసున్న నా పిల్లలు శృతి, అమేయకి, ఇలా నాతో వ్యాహ్యాళికి వెళ్ళటం ఇష్టం. వాళ్ళ కబుర్లు వింటూ, నా కబుర్లు చెప్తూ, దారిలో వచ్చే చెట్టూ పుట్టా పక్షీ చూసుకుంటూ, నవ్వుకుంటూ నడవటం నాకూ ఎంతో ఇష్టం. ఒక రకంగా, ఇది మాకు బాండింగ్ టైమ్ లాగా. నా చిన్ననాటి కబుర్లూ, పిల్లల చిన్ననాటి సంగతులతో ఆహ్లాదంగా సాగుతోంది మా నడక.
ఇంతలో శృతి ‘‘అమ్మా, అందరూ మమ్మల్ని పెద్దయ్యాక మీరేం అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు. అలా నీ చిన్నప్పుడు నువ్వేం అవ్వాలనుకున్నావు? టీచరే అవ్వాలనుకుని చదివావా లేక ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అని సినిమా వాళ్ళు చెప్తారు కదా... అలా ఇంకేదో అవ్వాలనుకుని, అది కాకుండా టీచర్ అయ్యావా?’’ అని కుతూహలంగా అడిగింది.
‘‘నువ్వు పుట్టకముందు, నేనూ నాన్నలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని శృతీ. రోజంతా ఇద్దరం ఆఫీస్ పనిలో, ఊపిరి సలపని మీటింగులతో డెడ్‌లైన్లతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేవాళ్ళం. ఆ ఉరుకుల పరుగుల జీవితంలో, నీ రాక మాకెంతో సంతోషాన్నిచ్చింది. నాన్నా నేనూ ఇద్దరం ఆ బిజీ జీవితాలతో నీకు తగినంత సమయం ఇవ్వలేమేమోననిపించింది. నువ్వు మా జీవితాల్లోకి రాబోతున్నావని తెలిసినపుడు, నిన్ను దగ్గరుండి, అపురూపంగా, ప్రేమగా చూసుకోవాలని ఆ సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి, నీతోపాటు ఇంటిపట్టున ఉన్నాను. ఇంకో ఐదేళ్ళకి చెల్లి పుట్టింది. అలా మీ ఇద్దరినీ చూసుకుంటూ, దాదాపు పదేళ్ళు ఇంట్లో ఉన్నాను. అమేయ కూడా బడికి వెళ్ళటం మొదలెట్టాక, నాకు కాస్త ఖాళీ దొరకటంతో, ఇలా టీచర్‌గా చేస్తున్నాను.’’
అప్పు చేయకండి.. తప్పు చేయకండి
‘‘అయితే, నువ్వు నా గురించే నీ సాఫ్ట్‌వేర్ జాబ్ మానేశావా అమ్మా? చిన్నప్పటి నుండీ ఎంతో కష్టపడి చదువుకుని, అంత మంచి జాబ్ తెచ్చుకుని ఉంటావ్. నేను పుట్టేసరికి అదంతా వదిలేసుకున్నావా? అప్పట్లో నేను నీకు పుట్టకపోయుంటే, నువ్వింకా ఆ జాబ్ చేస్తూ మంచి పొజిషన్‌లో ఉండేదానివేమో కదా! నా వల్లే నువ్వలా అవ్వలేకపోయావు కదూ’’ దాదాపు కళ్ళనీళ్ళతో అడిగింది శృతి.
ఊహించని ఆ ప్రశ్నా తన కళ్ళనీళ్ళూ నన్ను కలవరపెట్టాయి. అయినా సంబాళించుకుని, ‘‘ఛఛ, అలా కాదు తల్లీ. నేను ఆ ఉద్యోగం మానేయటానికి నా కారణాలు నాకున్నాయి. నీవల్ల నేను కెరీర్ కోల్పోయానని ఎప్పుడూ అనుకోలేదు. నా పూర్తి ఇష్టంతో, మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న కోరికతో, ఆ ఉద్యోగం ఉంటే రెండు పడవల ప్రయాణం కష్టమన్న భావనతో వద్దనుకున్నాను, అంతే’’ అన్నాను.
‘‘అమ్మా, నా ఫ్రెండ్స్ అమ్మలందరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. వాళ్ళెవరూ కుటుంబానికే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఇలా మంచి జాబ్ మానెయ్యలేదు. నా ఫ్రెండ్స్‌కి వాళ్ళ అమ్మలు కావాల్సినంత పాకెట్ మనీ ఇస్తారు. కనీసం ‘ఎందుకు, ఏమిటి, దాన్నెలా ఖర్చు పెడుతున్నార’ని కూడా అడగరట. మనలా ప్రతి ఖర్చూ ఆచితూచి చెయ్యాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సెలవులొస్తే టూర్లనీ మ్యూజిక్ కాన్సర్ట్‌లనీ... ఎంతో ఎంజాయ్ చేస్తారు. నువ్వూ అప్పట్లో నీ జాబ్ మానెయ్యకుండా ఉండుంటే, మనమూ అందరిలా సంతోషంగా ఉండుండేవాళ్ళం కదా. నా గురించి నువ్విలా చెయ్యటం నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వలా చెయ్యకుండా ఉండాల్సిందమ్మా’’ బాధగా అంది శృతి.
తన ఫ్రెండ్స్ అందరి అమ్మలకంటే ఉన్నతంగా ఉండగలిగే అవకాశాన్ని నేను తొందరపాటుతో చేజేతులా జారవిడుచుకున్నానన్న బాధా, బాగా సంపాదించగలిగే అవకాశం ఉన్న ఐటీ ఉద్యోగంకంటే టీచరు ఉద్యోగం అంత గొప్పదేమీ కాదనే తక్కువ భావనా శృతి మాటల్లో, ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది.
‘‘శృతీ, నీ ఫ్రెండ్స్ జీవితాలు పైకి కనిపించేంత అందంగా, సంతోషంగా ఏమీ ఉండవు నాన్నా. వాళ్ళకి కూడా ఎన్నో అసంతృప్తులూ, వెలితీ, ప్రేమ రాహిత్యం... ఇలా ఎన్నో ఉంటాయి. డబ్బుతో వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ సంతోషాన్ని కాదు. వాళ్ళ అమ్మానాన్నలు తమతో సమయం గడపాలనీ వాళ్ళకి నచ్చినవి వండి ప్రేమగా తినిపించాలనీ రాత్రుళ్ళు వాళ్ళతో కబుర్లూ కథలూ చెప్పాలనీ ఎంత ఆరాటపడతారో తెలుసా? తల్లిదండ్రులు నిత్యం బిజీగా ఉండే ఇళ్ళలో పిల్లలు, ఒక ప్రేమపూర్వకమైన స్పర్శ కోసం, ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎంత అలమటిస్తుంటారో నీ ఊహకి కూడా అందదు. ఆఫీసు పని వత్తిడితో, వాళ్ళ తల్లిదండ్రులు రోజూ అవన్నీ చెయ్యగలరా? నీ ఫ్రెండ్స్ నిజంగా ఆనందంగా ఉన్నారనీ వాళ్ళకి ఏ లోటూ లేదనీ నువ్వు నమ్మకంగా చెప్పగలవా?’’ సూటిగా అడిగాను.
‘‘నువ్వు చెప్తోంటే అనిపిస్తోందమ్మా... నా ఫ్రెండ్స్ చాలాసార్లు నా లంచ్ బాక్స్‌లో, నువ్వు పెట్టే హెల్దీ వంటలు రుచి చూసి భలే బావున్నాయనీ వాళ్ళలా నేను ఎప్పుడూ రుచిలేని ఆ కొనుక్కొచ్చిన రెడీమేడ్ వంటలు తినక్కర్లేదనీ నేను చాలా లక్కీ అనీ అంటుంటారు. వాళ్ళ అమ్మలకి రోజూ వంట చేసే టైముండదట. నా ప్రోగ్రెస్ కార్డులో నాకు మంచి మార్కులొచ్చినప్పుడల్లా, నువ్వు మమ్మల్ని హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకుని ఎంతో మురిసిపోతావు. మాకిష్టమైనవి మాకోసం అప్పటికప్పుడు వండేసి సర్‌ప్రైజ్ చేస్తావు. కానీ, నా ఫ్రెండ్స్‌కి ఇలాంటివేమీ తెలీదట. వాళ్ళ అమ్మలు ఎప్పుడూ అలసిపోయి వస్తారట ఇంటికి. ఆ తర్వాత కూడా వీళ్ళని పట్టించుకునే ఓపికా తీరికా ఉండదట. ఇవన్నీ చెప్పి, నా ఫ్రెండు హారిక ఒకసారి ఏడ్చింది కూడా. పేరెంట్స్ డబ్బులిచ్చేసి వాళ్ళనే ఏదో ఒకటి కొనుక్కోమంటారుట. నేను వాళ్ళు ఆ డబ్బులతో కొనుక్కునే రకరకాల వస్తువులని చూసి అబ్బురపడ్డానే కానీ, వాళ్ళందరికంటే నేనే సంతోషంగా ఉన్నానన్న విషయం గుర్తించలేదు. అయాం సారీ అమ్మా. నాకే ఇన్నాళ్ళూ తెలీలేదు’’ నిజాయతీగా చెప్పింది.
‘‘అదొక్కటే కాదు శృతీ. బిజీ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు, కావాలని కాకపోయినా, పిల్లలకి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. అటువంటి పిల్లలు- అందరూ కాదు కానీ, కొందరు- మానసికంగా చాలా ఒత్తిడితో ఉంటారు. బయటివాళ్ళు కాస్త ప్రేమగా మాట్లాడగానే వారిని ఇట్టే నమ్మేసి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఆత్మన్యూనత, తనెవరికీ ఇష్టం లేదేమోనన్న భావనతో వాళ్ళలో వాళ్ళు కుంచించుకుపోతూ, క్రమంగా అంతర్ముఖులుగా మారిపోతుంటారు. ఇవన్నీ చిన్నతనంలోనే గుర్తించకపోతే, ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్, సోషల్ ఏంగ్జైటీ లాంటి రుగ్మతల బారిన పడతారు. ఆ బాధ, నిరుత్సాహం నా చిన్నతనాన బాగా తెలిసిన దానిని నేను. ఒక రకంగా ఆ బాధే, నాకు నువ్వు పుట్టినపుడు, ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి, కొన్నేళ్ళపాటు గృహిణిగా మారటానికి కారణమయింది.’’
‘‘ఏమైందమ్మా నీ చిన్నతనంలో? అంతేకాదు, అసలు ఇంజనీరింగ్ చేసిన నువ్వు, పెద్ద క్లాసులకి టీచర్‌గా వెళ్ళకుండా, చిన్నపిల్లల టీచర్‌గా ఎందుకయ్యావు? ఆ విషయాలు మాక్కూడా చెప్పు’’ అని పిల్లలిద్దరూ ఆసక్తిగా అడిగేసరికి, ఇక పార్కులో చెట్టుకింద బెంచీ మీద కూర్చుని నా చిన్నతనంలోకి వెళ్ళాను.
‘‘మా అమ్మానాన్నలిద్దరూ పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలతో ఉన్నత స్థానాల్లో ఉండేవారు. నిత్యం బిజీ. ఇంటికొచ్చినా తరగని ఆఫీసు పని. ఇక నాతో గడపటం, నాపై గారాబం చూపించటం లాంటివి కల్లో మాట. నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన చూపించే గారాబం, ఆప్యాయతా నాకూ కావాలనిపించేది, కానీ కుదరదు. నేను కోరిన ఏ వస్తువైనా క్షణాల్లో అమర్చగల ఆర్థిక స్థోమత నా తల్లిదండ్రులకి ఉంది కానీ... నేనాశించే ప్రేమా, సహన స్థోమత లేదు వారికి. వారి దైనందిన వత్తిడులు వారివి. ఇక వారి నుంచి క్వాలిటీ టైమ్ దొరకదని అర్థమయ్యాక, క్రమంగా ఒంటరిగా, చదువే లోకంగా మారింది నా జీవితం. మంచి మార్కులు వచ్చినపుడు కూడా వారి స్పందన పొడిపొడిగా ఉండేది. బాగా చదివి ఇంజినీర్‌ని అయితే, అప్పుడైనా మెచ్చుకుని దగ్గరకు తీసుకుంటారనుకున్నాను.
చదువు పూర్తవుతూనే, కాలేజీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి జాబ్ సాధించి, ఆనందంగా ఇంటికెళ్ళి చెప్పినపుడు, ఎగిరి గంతేసి, ఊరంతా సంబరం చేసి, నన్ను ఆప్యాయంగా హత్తుకుంటారనుకున్నాను. కాని క్లుప్తంగా ‘మంచిది, సంతోషం’ అనేసి, తమ మీటింగ్‌కి టైమ్ అయిందని హడావిడిగా వెళ్ళిపోయారు. ఆ క్షణం నేనుపడ్డ నిరాశ నాకిప్పటికీ కళ్ళలోనే ఉంది.శృతీ, నువ్వు నా కడుపున పడ్డప్పుడు, నా బాల్యపు అనుభవాల వల్ల, ‘మీకు తల్లిగా ఎప్పుడూ అందుబాటులో ఉండాలనీ ఆ ఐటీ ఉద్యోగం వదిలేసి, ఇంటిపట్టున ఉంటాననీ’ మీ నాన్నతో అన్నప్పుడు- నేనే నిర్ణయం తీసుకున్నా, అందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. తనతోపాటు సమానంగా సంపాదించగలిగే ఉద్యోగం వదిలేస్తానన్నప్పుడు, నాకు నచ్చింది చెయ్యమని, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్త దొరకటం ఈరోజుల్లో అదృష్టమనే చెప్పాలి. అలా మీ నాన్న సహకారంతో పూర్తి స్థాయి గృహిణిగా స్థిరపడ్డాను.
తల్లిగా మా అమ్మ నా కోసం ఏం చేయాలని ఆశపడిందో- వర్కింగ్ ఉమన్‌గా అది ఆవిడకి కుదరక, నేనెంత బాధపడ్డానో... ఆ బాధ మీకు లేదని ఆనందించాను. నేను పొందలేకపోయాననుకున్న ప్రేమా ఆప్యాయతా గారాబమూ అన్నీ మీకు తల్లిగా ఇవ్వగలిగాను-ఒక గృహిణిగా ఉంటూ. మీతో ఆటలు ఆడాను, పాటలు పాడాను. ఆ సమయాన్ని నేనెంతో ఆస్వాదించాను. మీ తొలి అడుగులు, తొలి మాటలు- ఇలా మీ ప్రతి మైలురాయీ నా కళ్ళముందే జరిగింది. కుదిరినవాటన్నిటినీ వీడియోలు కూడా తీశాను- మన తీపి జ్ఞాపకాలుగా. ఇక తర్వాత్తర్వాత అమేయ కూడా బడికెళుతుండటంతో, మీరిద్దరూ బడి నుండి సాయంత్రం తిరిగొచ్చేదాకా ఖాళీగా ఉండటం వెలితిగా అనిపించింది.
సహజంగా చిన్నపిల్లలంటే ఇష్టపడే నేను, వాళ్ళ టీచర్ అయితే బావుంటుందని ప్రయత్నించి సాధించాను. ఆ చిన్నచిన్న పిల్లలు నాకు మీ చిన్నతనాన్ని గుర్తుచేస్తారు. వాళ్ళ ముద్దు మాటలూ, అమాయకత్వం, నాపై వాళ్ళు చూపించే అభిమానం... ఇవన్నీ నాకు ఎనలేని తృప్తినీ సంతోషాన్నీ ఇస్తాయి. అందుకే జీతం తక్కువైనా కూడా, కిండర్ గార్టన్ టీచర్‌గానే వెళ్ళాను. ‘ఇంజినీరింగ్ చదివి, నువ్వు వెలగబెట్టేది ఈ టీచర్‌గిరీనా, దానికేమొస్తుంది చిల్లర?’ అని అయినవాళ్ళంతా తక్కువ చేసి మాట్లాడినా, జీవితంలో ప్రతీదీ డబ్బుతో తూచలేమని తెలిసిన నేను అవేమీ పట్టించుకోలేదు. కుటుంబాన్నీ పనినీ సమన్వయం చేసుకోగలిగేలా, నాకంటూ సమాజంలో ఒక మంచి పేరూ గుర్తింపూ ఇచ్చిన ఈ టీచరు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఇదీ ఇంజినీరు నుండి టీచరుగా సాగిన నా ప్రస్థానం’’ చిరునవ్వుతో ముగించాను.
‘‘అమ్మా, మా కోసం ఎంత చేశావు? నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఐ యాం సో ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. అలా అని మొత్తంగా నీ జీవితాన్ని మా కోసం త్యాగం చెయ్యకుండా, నీకు నచ్చిన ఉద్యోగం కూడా చేస్తున్నావు. హ్యాపీ ఫర్ యూ’’ మనస్ఫూర్తిగా అంది శృతి.
శ్రీవారి సేవకు కోటి రూపాయల టికెట్!
‘‘కానీ త్వరలో నేను ఈ టీచరు ఉద్యోగం కూడా మానెయ్యాలనుకుంటున్నాను శృతీ’’ సూటిగా సుత్తిలేకుండా అన్నాను.‘‘వాట్! ఎందుకు? ఇప్పుడు అంతా బానే ఉందిగా, ఇప్పుడేమయ్యింది?’’ నెత్తిన పిడుగు పడ్డట్టు చూస్తూ అడిగింది శృతి.ఓ పట్టాన నమ్మశక్యంగా లేదు తనకి. జోక్ చేస్తున్నానేమో అనుకుంది కానీ నా ముఖంలోని స్థిరత్వం, శాంతం నేనన్నది నిజమేనని నిర్ధారించాయి తనకి. అయోమయంగా చూస్తోంది.
‘‘చూడు శృతీ, పిల్లలు ఎదిగే వయసులో తల్లి పాత్ర అత్యంత కీలకం, ముఖ్యంగా ఆడపిల్లలకి. మీరంతా ఎంత నాన్నకూచిలైనా, అన్నీ నాన్నతో ఫ్రీగా చెప్పుకోలేరు. ఎన్నో అనుమానాలూ భయాలూ అభద్రతలూ ఉంటాయి.
ఆ సమయంలో తల్లి అందుబాటులో లేకపోతే, ఎంతో ఒంటరిగా, ఆందోళనగా ఉంటుంది. ఒక ఆడపిల్లగా అవన్నీ అనుభవించి, దాటి వచ్చినదాన్ని నేను. అందుకే ఆ పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్త పడుతున్నాను.అంతే కాకుండా త్వరలో నువ్వు హైస్కూలుకి వెళ్ళబోతున్నావు. ఇప్పటిదాకా చదువు ఒక ఎత్తు, హైస్కూలు చదువు మరో ఎత్తు. ఇప్పటిదాకా ఆడుతూ, పాడుతూ చదివినా, ఇకనుంచీ మరింత భాద్యతగా చదవాలి. చాలా ప్రాజెక్ట్స్, అసైన్‌మెంట్స్ ఉంటాయి. అవసరమైతే కోచింగ్ క్లాసులకి వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. తల్లిదండ్రుల సహాయం లేకుండా, ఈ దశ పిల్లలని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దానికితోడు కొత్త స్నేహాలూ అలవాట్లూ ఆకర్షిస్తాయి.
ఏమరుపాటుగా ఉంటే, తెలీకుండానే పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎక్కువమంది పిల్లలు హైస్కూల్ డ్రాపవుట్లుగా మిగిలిపోతుంటారు. లేదా తక్కువ మార్కులతో- మంచి కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోతారు. కళ్ళు తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నీకుగాని అలాంటి పరిస్థితే వస్తే, తల్లిగా నేను ఫెయిల్ అయినట్టే. అప్పుడు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అందుకే నీకు సాయంగా ఉండి, నీకు అన్ని విధాలుగా సహకరించటానికి వీలుగా ఉండే విధంగా మళ్ళీ గృహిణిగా మారాలనుకుంటున్నాను’’ శాంతంగానే అయినా స్థిరంగా చెప్పాను.‘‘అమ్మా, ఇప్పటికే ఒకసారి నా గురించి నీ జీవన గమనాన్ని మార్చుకున్నావు. మళ్ళీ ఇన్నేళ్ళకి నీకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉన్నావు. దీన్ని కూడా నా గురించే మళ్ళీ నువ్వు వదులుకోవటం నాకు ఇష్టం లేదు. నిజమే, అమ్మగా నువ్వు మాకు ఎంతో అవసరం. కానీ దానికి నువ్వు నీ ఆనందాన్ని వదులుకోనక్కర్లేదు. నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ కూడా మాకు తోడ్పాటు అందించగలిగేలా మనం మ్యానేజ్ చేసుకుందాం. ఎవరితోనూ మాట రాకుండా, ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా, నీకూ నాన్నకీ మంచి పేరు తెచ్చేలా నేను చదువుకుంటాను. ప్రతి విషయం- భయం, అనుమానం అన్నీ నీతో పంచుకుంటాను. అసలు ఇవాళ్టి నుండి నా ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లూ డిలీట్ చేసేస్తాను. ఫ్రెండ్స్‌తో అనవసర చాటింగులన్నీ బంద్. అప్పుడు నాకు బోలెడంత సమయం మిగులుతుంది. దాన్ని నీకు ఇంటి పనుల్లో సహాయం చెయ్యటానికో, చెల్లి చదువు బాధ్యత చూడటానికో వాడతాను. అప్పుడు నీకు కాస్త విశ్రాంతిగా, మా గురించి ఏ భయం లేకుండా ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నువ్వేం చెప్తే, ఎలా చెప్తే అలా ఉంటాను. నువ్వూ నాన్నా
గర్వపడేలా చదువుకుంటాను. మీకు ఏ చెడ్డ పేరూ రానివ్వను. ప్రామిస్. నీ జాబ్ మానొద్దు, ప్లీజ్’’ వర్షించటానికి సిద్ధంగా ఉన్న కళ్ళతో అంది శృతి.ఇంత నిజాయతీగా తను అభయమిచ్చాక, తనపై నమ్మకముంచి తను చెప్పిన దానికి సరేనన్నాను. నవ్వుతూ ఆనందంగా నన్ను గట్టిగా హత్తుకుంది.
శృతి తన ఫోన్‌లో ఈమధ్య గంటలు గంటలు ఇన్‌స్టాగ్రామ్, చాటింగు అని గడుపుతూ, చదువుని నిర్లక్ష్యం చేస్తున్న సంగతి నేను గమనించానన్న విషయం ఇక అప్రస్తుతం. తనలో వచ్చిన మార్పు చూసి, ‘నేనూ అక్కలా బాగా చదువుతా’ అని ముద్దుముద్దుగా పలికిన అమేయ మాటలకు హాయిగా నవ్వేశాం.
👉 Collected by : Nagothu
👉 Credits: Eenadu Sunday magazine
👉 This is an unofficial page of Eenadu magazine