27/11/2023
Good Morning! Wars and armed conflicts not only claim human lives but also inflict substantial harm on the environment. Water, soil, and other natural resources suffer severe damage, jeopardizing the secure livelihood of future generations.
Read my article in today’s Eenadu: https://www.eenadu.net/telugu-news/vyakyanam/general/1302/123219593
భద్రమైన జీవనం... యుద్ధాలతో ఛిద్రం
By Srinivas Ganjivarapu
యుద్ధాలు, సాయుధ ఘర్షణలు ప్రజల ఆయువులను హరించడంతో పాటు ప్రకృతికీ తీరని నష్టం కలిగిస్తున్నాయి. నీరు, నేల, ఇతర సహజ వనరులు వాటివల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా, భవిష్యత్తు తరాల భద్రమైన జీవనం ప్రమాదంలో పడుతోంది. నవ చరిత్రలో వివిధ తెగలు, సమూహాలు, ప్రాంతాలు, దేశాల మధ్య యుద్ధాలు, అంతర్గత సాయుధ మిగిల్చాయి. నిరుడు మొదలైన రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి తోడు, ఇజ్రాయెల్-హమాస్ పోరు సైతం వాటిని కళ్లకు కడుతున్నాయి. యుద్ధాల వల్ల పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనోపాధులు ఛిన్నాభిన్నమై ఎందరో నిరాశ్రయులుగా మిగులుతున్నారు. యుద్ధాలు, సాయుధ ఘర్షణల వల్ల ప్రకృతి వనరులకు, జీవవైవిధ్యానికీ అపార నష్టం వాటిల్లుతోంది.
ఆహార భద్రతకు తూట్లు
భూభాగం, నీరు, చమురు, బంగారం, వజ్రాలు, కలప వంటి అతి విలువైన సహజ వనరులపై ఆధిపత్యం, హక్కుల చుట్టూనే అత్యధిక వివాదాలు ముడివడి ఉంటాయి. ఇవి ఘర్షణలు, సాయుధ తిరుగు బాట్లు, యుద్ధాలకు దారితీస్తున్నాయి. వాటివల్ల స్థానిక ప్రకృతి వనరులు పెద్దయెత్తున నాశనమవుతున్నాయి. యుద్ధాల్లో ఆయా దేశాలు ప్రత్యర్ధి భూభాగంపై భారీగా ఆయుధాలు ప్రయోగిస్తాయి. ఇలాంటి వాటిలో పేలని మందుపాతరలు, ఇతర ఆయుధాలు అనంతర కాలంలోనూ మనుషులతో పాటు వన్యప్రాణులను బలితీసు కుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2010-2020 మధ్య కాలంలో ఉష్ణమండల అరణ్యాలు అంతరించిన ప్రదేశాల్లోని 43శాతం అటవీ భూములు యుద్ధ ప్రభావ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సాయుధ పోరాటాల వల్ల చాలాచోట్ల తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయి. దానివల్ల నీటి సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రపంచంలో విలువైన జీవవైవిధ్య సంపద ఉన్న 200 ప్రదేశాల్లోని 90శాతం ప్రాంతాలపై యుద్ధాలు, సాయుధ ఘర్షణలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాల వల్ల చాలా చోట్ల ఆహార పంటలు, దాన్యం నిల్వలు నాశనం అవుతున్నాయి. మందుగుండు దాడుల వల్ల భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. ఫలితంగా ఆహారం అభద్రత ముమ్మరిస్తోంది. ఐరాస నిర్వాసితుల విభాగం అంచనాలు ప్రకారం సాయుధ ఘర్షణల మూలంగా 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.24 కోట్ల మంది నిర్వాసితులయ్యారు. ప్రపంచ దేశాల మద్య తలెత్తే యుద్ధ విద్వంసం వాటి సన్నాహక దశ నుంచి ముగిసే వరకు కొనసాగుతూనే ఉంటుంది. సైనిక వాహనాలు, విమానాలు, నౌకలు, భవనాల నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ చమురు, ఖనిజ వనరులు అవసరం. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 5.5శాతానికి సైనిక కార్యకలాపాలే కారణమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. యుద్ధ ప్రాంతాల్లో సైన్యాల మోహరింపు, వారి కోసం ఏర్పాట్లు, ఆయుధాలు పేలుళ్లు, దాడులు.. ఇలా అన్ని దశల్లో అడవులు, నీరు వంటి సహజ వనరులు తీవ్ర విధ్వంసానికి గురవుతాయి. దాడుల మూలంగా ఏర్పడే వాయు కాలుష్యం. కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పుల దుష్పరిణామాలను పెంచు తున్నాయి.
పొరుగు దేశంతో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, దాని నుంచి దాడులు, యుద్ధం ముప్పును ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు పెద్దయెత్తున ఆయుధ సంపత్తిని కూడబెట్టుకుంటున్నాయి. సైనిక శక్తిని పెంచు కుంటున్నాయి. కేవలం యుద్ధ సందర్భాల్లోనే కాకుండా మిగిలిన సమయాల్లోనూ సైనికుల రవాణా, వారికి శిక్షణ, మారణాయుధాల తయారీ, పరీక్షల దశల్లోనూ మితిమీరిన పర్యావరణ నష్టం వాటిల్లు తోంది. ముడిపదార్థాల తవ్వకు, ఆయుధాల తయారీ, వాటి పరీక్షల మూలంగా ప్రకృతి వ్యవస్థలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. అణ్వా యుధాల తయారీలో ఈ నష్ట ప్రభావం రెట్టింపు ఉంటుంది. రసాయన, జీవ ఆయుధాల మూలంగా తలెత్తే కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువ! ఇటువంటి పర్యావరణ నష్టాలను ఆయా దేశాలు అంతగా పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ పరి రక్షణ నిబంధనల పటిష్ట అమలులో అనేక దేశాలు చిత్తశుద్ధి కనబర చడం లేదు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో వివిధ పర్యావరణ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పాలకుల చెవికెక్కడం లేదు
పటిష్ఠ చర్యలు కీలకం
ఇజ్రాయెల్-హమాస్ పోరు వల్ల గాజులోని 95 శాతం తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అనేక పరిశ్రమలు నాశనమై ప్రమాదకర రసాయనాలు భూగర్భ జలాల్లో కలిశాయి. ఏడున్నర దశాబ్దాల క్రితం హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబుల దాడి ఘటనల నుంచి నేటికీ ప్రపంచ దేశాలు పాఠాలు నేర్చుకోలేదు. దేశాలు సుస్థిరాభివృద్ధి సాధించాలంటే యుద్ధాలకు స్వస్తి పలకాలి. సాయుధ ఘర్షణలను నిరోధించాలి. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు నడుంకట్టాలి. సమాజ పురోగతిలో ప్రకృతి వనరుల సుస్థిర యాజమాన్యం కీలకమైన అంశం ఈ క్రమంలో పర్యావరణ వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాల్సిన బాధ్యతలను ఆయా దేశాలు గుర్తెరగాలి. తద్వారా భవి ష్యతు తరాల ఆశలు చిదిమేయకుండా మసలుకోవాలి.