24/06/2023
ఎందుకు నేను బీజేపీపైనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను? ముఖం చూపించలేని వాళ్లు, సొంత పేర్లు చెప్పుకోలేని ఫేక్ అకౌంట్స్ నుంచి ఘోరమైన కామెంట్స్, ఇన్ బాక్స్ మెసేజస్ వస్తున్నా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఎక్కువ వీడియోలు బీజేపీని ప్రశ్నిస్తూ ఎందుకు చేస్తున్నాను?
నేను చేసిన వీడియోలు మీరు చూశారా ఎంఐఎం బీజేపీ ఒక్కటే అని చాలా సార్లు చెప్పాను. బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తానో కూడా చెప్పాను. మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటేనే ప్రజల్ని సమానంగా చూడట్లేదు అని అర్థం. బీజేపీ=ఎంఐఎం రెండింటి డీఎన్ఏ ఒకటి. ఒకటి పెద్ద పార్టీ రెండోది తోకపార్టీ అంతే తేడా.
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికీ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు. రాజ్యాంగం సాక్షిగా పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వచ్చినప్పట్నుంచి మెజారిటీ మతం వాళ్లను మైనారిటీ మతాలపైకి ఎగదోయడం కూడా విశాలమైన ఛాతీ ఉన్న రాజకీయాలేనా. వాజ్ పేయ్ ఇలా చెయ్యలేదే. మత మార్పిడులు జరగకుండా హిందూ మతంలో కులాన్ని పాతరెయ్యొచ్చు. మరి కుల నిర్మూలనకు తీసుకున్న చర్యలేంటి? గిరిజన రాష్ట్రపతి, బహుజన ప్రధాని ఉన్న దేశంలో మత రాజకీయాలు ఎందుకు? ఒక్క రాష్ట్రంలో అయినా మతం పేరు చెప్పకుండా ఎందుకు గెలవలేకపోతున్నారు..?
అధికారంలో ఉన్నదే హిందూ పార్టీ యినప్పుడు.. 80 కోట్ల మంది హిందువుల్ని ఎవరు ఈ రోజు అభద్రతలోకి నెట్టేశారు? 75 ఏళ్లుగా లేని అభత్రత ఇప్పుడే వచ్చిందా. ఢిల్లీలో ఓ హిందు అమ్మాయిని ముస్లిం చంపేస్తే దాన్ని ఒక క్రైంగా చూడట్లేదు హిందువులపై దాడి అంటున్నారు. అదే హిందూ అమ్మాయిల్ని రోజూ వందల మందిని భర్తలూ, తండ్రులు, అన్నలూ, ప్రియుడు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తోంటే ఎందుకు మాట్లాడరు? దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు. అలాగని మీ స్నేహితున్నో, నా పక్కింట్లో ఉన్న సాధారణ ముస్లింలనో దోషులుగా చూపవచ్చా? ఇతర దేశాల్లో మనవాళ్లు ఉన్నారు, అక్కడొక హిందువులు క్రైం చేస్తే మొత్తం అందరినీ ఒకే గాటన కడితే మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏం జరిగినా మతం కోణం ఎందుకు వస్తోంది? చివరికి బాలాసోర్లో రైలు ప్రమాదం జరిగిదే పక్కన మసీదు వల్లే, ఆ రోజు శుక్రవారం కాబట్టి అనేది తెరపైకి వచ్చింది. తీరా చూస్తే అది మసీదు కాదు ఇస్కాన్ టెంపుల్. తర్వాత స్టేషన్ మాస్టర్ ముస్లిం కావడం వల్లే ప్రమాదం అన్నారు తీరా చూస్తే ఆ స్టేషన్ మాస్టర్ మహంతి ఒక హిందువు. తర్వాత ఇప్పుడు ఇంజినీర్ అమీర్ అన్నారు.. ఇది కూడా తప్పుడు ప్రచారమే అని చివరికి రైల్వే డిపార్టెంట్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక ప్రమాదాన్ని ఇన్ని సార్లు మతం కోణంలో చూసి తప్పుడు ప్రచారాలు చేసి నాలుకు కరుచుకుంటున్నారు అంటే ఎంత ద్వేషం నింపేసి ఉండాలి సామాన్యుల బుర్రల్లోకి. చిన్న పిల్లలు కూడా ఇవాళ మతం గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ పరిస్థితిలోకి ఎవరు నెట్టేశారు అంటే కారణం ఎవరు? మతాల పేరుతో కొట్టుకుచావనీనా భవిష్యత్తు తరాలు. ఇప్పటి ఈ విద్వేషం కాల్చేసేది మన పిల్లల్ని కాదా? సిరియా, ఆఫ్గనిస్థాన్ పాకిస్థాన్ ఈ దేశాల పక్కనా మనకు స్థానం కావాల్సింది? కుటుంబాల్లో, పిల్లల మనసుల్లో నాటుతున్న విష బీజాలు పెరిగి పెద్దయ్యాక ఎలాంటి ఫలితాలు ఇస్తాయో పాలకులు ఆలోచిస్తున్నారా? ఇప్పటి విద్వేషం రేపు ఎన్ని ఓట్లు తెస్తుంది అనే దగ్గరే వాళ్ల ఆలోచనలు ఆగిపోతున్నాయ్.. మర్నాడు మరో ఎన్నిక.. ఇంతే కదా నడుస్తోంది.. !?
ఇప్పుడు మనకు కావాల్సింది అమెరికాతో చైనాతో పోటీ పడే భారతదేశం కాదు... హిందూరాష్ట్రంగా ప్రకటించడమే మనక్కావాలి? పోనీ ఏమౌతుంది ప్రకటిస్తే.. ఏం మారుతుంది? విదేశాల్లో సెటిలైపోయిన ఒక్క నాయకుడి బిడ్డైనా తిరిగొచ్చేస్తుందా? ఒక్క సామాన్యుడి పరిస్థితి మారుతుందా..? మహా అయితే పుస్తకాల్లో సిలబస్ మారిపోతుంది. ఇంగ్లీష్ మినిమం అయ్యి హిందీ, సంస్కృతం వస్తుంది. అదే జరిగిదే చిన్న చిన్న చదువులకోసం కూడా విదేశాల బాట పట్టరా? అదా మనక్కావాల్సింది?
రాను రాను మతాలు, కులాలు లేని భారతదేశాన్ని నిర్మించాలా లేదా కొకర్నొకరు ద్వేషిస్తూ కొట్టుకునే దేశం కావాలా? కేరళలో 32 వేల మంది అమ్మాయిలు ఐసిస్ లో చేరారా? మరి అన్ని మిస్సింగ్ కేసులు ఉండాలి కదా.. గుజరాత్ లో 40 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. తెలంగాణలో ఏపీలో అన్ని రాష్ట్రాల్లో వేలాది మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు వీళ్లంతా ఏమైపోతున్నట్లు? కేరళలో 3 కేసుల్లో ఇప్పటిదాకా కేసులు ఫైల్ అయ్యాయి, తల్లిదండ్రులు బయటికొచ్చారు, బాధితులు ఉన్నారు. మరి మిగతా 31వేల 997 కేసులు ఏవీ.. అంత మంది ఉగ్రవాద సంస్థల్లో చేరిపోతో ఎన్ని లక్షల మంది వాళ్ల తల్లిదండ్రులు, బంధువులు రోడ్లపైకి రావాలి.. వచ్చారా? మరి ఎందుకీ ప్రచారం? ఆజాదీ కాశ్మీర్ సమస్య కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో సాధారణ హిందువులు,సాధారణ ముస్లింలు కొట్టుకోవట్లేదు.. ఉగ్రవాదులు వేరు సాధారణ వ్యక్తులు వేరు. హిందువుల్లో క్రైస్తవుల్లో కూడా మతాన్ని అతిగా తీసుకొని ఇతరుల్ని ద్వేషించే వాళ్లు ఉంటారు. ఇది వ్యక్తుల సమస్య ఇక్కడికి రాజకీయం ఎందుకు తెస్తున్నారు.. సరే ఇదే బీజేపీ నార్త్ ఈస్ట్ లో క్రిస్టియన్ అనుకూల విధానాలు, హామీలు ప్రకటనలు చేసి గెలిచింది. అంటే ఎక్కడ ఏ మతం మెజారిటీ అయితే వాళ్లను పోలరైజ్ చేసి ఓట్లు దండుకొని అధాకరంలోకి రావడం ఇదేనా కావాల్సింది?
మణిపూర్ ఆహుతి అయిపోతోంటే.. కనీసం ప్రధాని నుంచి శాంతి ప్రకటన కూడా ఎందుకు రావట్లేదు? కరోనా కష్టకాలంలో టీవీల్లో కనిపించి చెప్పిన మాట కనీసం మన్ కీ బాత్ లో అయినా చెప్పొచ్చు కదా.. నేనున్నాను.. మీ సమస్య పరిష్కరిస్తాను అని.. ఎందుకు చెప్పట్లేదు? చనిపోతున్న వాళ్లంతా మతం మారిన క్రైస్తవులే కాదు.. హిందువులూ చనిపోతున్నారు.. హిందువులైన మెయిటీల ఆస్తులూ ధ్వంసమౌతున్నాయ్.. మరి హిందువు కోణంలో అయినా ఒక ప్రకటన చెయ్యాలి కదా కేంద్రం. పోనీ గిరిజన మహిళ అయిన రాష్ట్రపతితో అయిన ప్రకటింపజేయవచ్చు కదా.. ఇవేవీ ఎందుకు జరగట్లేదు. నేను ఇది అడిగినా మీ దృష్టిలో దేశద్రోహి, హిందూ వ్యతిరేకి అయిపోతున్నాను. చేవ చచ్చిన కాంగ్రెస్ పార్టీని ఏమని అడుగుతాం ఈ దేశం గురించి..? అధికారంలో ఉన్న వాళ్లనే కదా అడగాలి..?
పోనీ దేశంలో ఉన్న మెజారిటీ మతానికి ఏం మేలు చేసినట్లు? ఏ సామాన్యుడినైనా పిలిచి మతం చూసి ఓటు వేశావు కదా.. నీకు జరిగిన 3 గొప్ప మేళ్లు చెప్పు అంటే ఏం చెప్తాడు?
పెట్రోల్ గ్యాస్ ధరలే కాదు.. టాక్స్ పరిధిలోకి రాని వస్తువులు ఎన్ని ఉన్నాయ్ ఇప్పుడు?
రైళ్లలో సామాన్యులు కిక్కిరిసి కూర్చునే జనరల్ బోగీలను నిలువునా కోసేస్తున్నారు.. వృద్ధులకుండే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేశారు.
పెన్షన్ల నుంచి కూడా రకరకాల కోతలతో నేరుగా వసూళ్లు చేస్తున్నారు.
పరిశ్రమలు పెట్టక్కర్లేదు.. ఉన్న వాటిని సొంత ఆస్తిలా అమ్మేస్తున్నా అడగకూడదా? కనీసం ఒక పౌరురాలిగా అయినా అడిగే హక్కు ఉంటుంది కదా.. మీరు అడగరు.. నేను అడిగితే హిందూ వ్యతిరేకినా?
బీజేపీని అధికారంలోకి తెచ్చింది గుజరాత్ మోడల్ చూసేగానీ మతాన్ని చూసి కాదు. మతం పేరుతోనే అయితే అద్వానీని చూపించే వాళ్లు 2014లో. గుజరాత్ వెలిగిపోతోంది.. భారత్ కూడా వెలిగిపోవాలి అంటే మోదీ రావాలి అని..
మోదీ వచ్చారు నల్లధనం వచ్చిందా, నోట్ల రద్దు తర్వాత గుర్తించిన నల్లధనం ఏమీ లేదు.. ఏదైనా చేశారు అంటే మళ్లీ రెండు వేల నోట్లు రద్దు చెయ్యడం. మరి అకౌంట్లలో వేస్తాం అన్న రూ. 15 లక్షల మాటేంటి? ఇది ఎవరూ అడగకూడదు కదా..? అడిగితే దేశ ద్రోహి, ధర్మ ద్రోహి హిందూ వ్యతిరేకి.
జీఎస్టీ వల్ల కేంద్రానికి రెవెన్యూ పెరిగింది. కానీ పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న చిన్న వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లాయి. హోటల్లో ఇడ్లీ తిన్నా జీఎస్టీ వేస్తున్నారు..
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అన్నారు..ఏవీ ప్రతి ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్.. మన దేశంలో ఉండే సహజమైన అధిక జనాభా అనే పొటెన్షియాలిటీని బేస్ చేసుకొని, మనం చదువులకు ఇస్తున్న ప్రాముఖ్యతను క్యాష్ చేసుకునేందుకు చీప్ లేబర్ కోసం ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ప్రైవేట్ జాబ్స్ పెరిగాయ్.. మరి ప్రభుత్వ ఉద్యోగాలేవీ..? మేము నిరుద్యోగులం అని 29 కోట్ల మంది ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్నారు..? నమోదు చేసుకోని వాళ్లనూ కలిపితే..?
కొంత మంది పారిశ్రామిక వేత్తల్నే ప్రోత్సహించడం వల్ల మార్కెట్లో మొనో పొలి పెరిగిపోయింది. ఇప్పుడు దేశం అంత భారీ స్థాయికి చేరుకున్న ఆ ఒకరిద్దురు పారిశ్రామిక వేత్తలకు ఏదైనా అయితే దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే స్థితికి ఎవరు కారణం?
గ్యాస్, పెట్రోల్ ధరల ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడింది. గ్రామాల్లో మళ్లీ కట్టెపొయ్యలు ఎందుకు పెరిగాయో మీరు ఊరెళ్లినప్పుడు అడగండి ఆడవాళ్లు చెప్తారు.
మీ ఫోన్ చెక్ చేసుకోండి మీకు బీజేపీ ఐటీ సెల్ నుంచి వండి వార్చిన మెసేజీలు మోడీ వల్ల దేశం వెలిగిపోతోంది అన్న మెసేజీలు, ఇతర మతాలపై ద్వేషం కలిగించే మెసేజీలు ఎన్ని వచ్చాయో చూసుకోండి.
కొత్తగా ఆఫీసులో చేరిన వాళ్లు ఇప్పుడు వాళ్ల క్వాలిఫికేషన్స్ గురించి చూడట్లేదు, పక్కవాడి ఐడియాలజీ ఏంటి, వాడి మతం ఏంటి అని చూస్తున్నారు. క్రిస్టియనో, ముస్లిమో అయితే కొందరు హిందువులు ద్వేషిస్తున్నారు. నుదుటున కుంకం బొట్టుపెట్టుకున్న ఫ్రెండును చూస్తే ముస్లిం లేదా క్రిస్టియన్ ఉలిక్కిపడుతున్నారు. మన ఫ్రెండ్స్ లో ఆ అభద్రతకు కారణం ఎవరు? అంత అవసరం ఏంటి?
పోనీ ఆలయాలకు ఏం చేశారు? అయోధ్యలోని రామమందిరమే కాదు అంతే విశిష్ఠత ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం ఉంది, భద్రాద్రి రాముల వారి ఆలయం ఉంది.. వాటికి ఏం చేశారు? ఏమీ లేదు.. ఒక్క టెంపుల్ చూపించి దేశంలోని మొత్తం దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్నది ఎవరు?
ఈ రోజు అందరికంటే దయనీయ పరిస్థితి సగటు సామాన్య హిందువులది, గతంలో ప్రభుత్వాలపై కోపమొస్తే గట్టిగా రోడ్లపైకి వచ్చి నిలదీసే వాళ్లు. కానీ ఇప్పుడు ఎవరైనా కడుపుకాలి నోరెత్తితే.. హిందువై ఉండి హిందువుల్ని ప్రశ్నిస్తావా నువ్వు దేశద్రోహివీ, హిందూ ద్రోహివీ.. నీ మొగుడు/పెళ్లాం ముస్లిమా, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియనా అంటున్నారు..
సామాన్య యువత(బడా బాబుల పిల్లలు కాదు) మెదళ్లు ఈ రోజు గొప్ప భవిష్యత్తు గురించో, శాస్త్రీయ దృక్పథం వైపో లేవు.. కేవలం తాము నమ్మిన మతాన్ని తమను రెచ్చగొడుతున్న మతాన్ని డిఫెండే చేసే స్థాయికి పడిపోయాయి.. ఇన్ని కోట్ల మెదళ్లు మతం చుట్టూ ఉన్నప్పుడు... నా లాంటి ఒక్కరో ఇద్దరో ఇలా చేస్తున్న మతోన్మాద పార్టీలను ప్రశ్నిస్తే మీకు చాలా కష్టం కలుగుతోంది. నాకు తెలుసు నాది ప్రమాదకరమైన ప్రయాణం.. ఎప్పుడో ఏ అమాయక యువకుడో నా మీద తను ప్రేమించే పార్టీ నింపిన విద్వేషాన్ని కత్తిగానో బుల్లెట్టుగానో మార్చి దాడి చేస్తాడని.. అలాగని కోట్లాది మంది యువత కళ్లముందు మతం మత్తులోకి జారుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకనే నా పరిధిలో నేను చెప్పాల్సినవి చెప్తున్నాను. మత విద్వేషాలు మాత్రమే ఏ దేశయువతకైనా అత్యంత ప్రమాదకరం అని నేను చెప్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు.. నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కానివ్వండి.. నన్ను డిఫెండ్ చె్యయడానికి ఏ పార్టీ ముందుకు రాదు నేను ఏ పార్టీ మద్దతుదారూ కాదు కాబట్టి.. ఏ కుల సంఘమూ రాదు.. నా కులమేంటో ఎవరికీ తెలీదు కాబట్టి.. ఏ గ్రూపూ నా కోసం నిలబడదు.. నాకు ప్రభుత్వం ఇచ్చే జర్నలిస్టు గుర్తింపు కార్డు సహా ఏ గుర్తింపూ లేదు కాబట్టి..
ఇలా ఒకరిద్దరికి నాకు తోచినప్పుడు వివరణ ఇవ్వడం కంటే ఇంకేమీ చెయ్యలేని అశక్తురాలిని.. ఏదో ఒక రోజు రాలిపోతాను, బలైపోతాను.. నా బిడ్డలకు, భర్తకూ అన్యాయం చేసినదాన్నవుతాను. నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేని నా తల్లికి అన్యాయం చేసినదాన్నవుతాను. కానివ్వండి.. అలా అయ్యేలోపు కనీసం నా ఆవేదనను, ఏకాకిగొంతును రికార్డు చెయ్యనివ్వండి.
Thulasi Chandu
- తులసి చందు, జూన్ 24,2023