03/06/2024
సర్వ శుభంకరి కొల్హాపురి లక్ష్మి
ఐశ్వర్యప్రదాతయైన శక్తిని మహాలక్ష్మిగా కొలుస్తారు. ఈ మహాలక్ష్మి జగత్ప్రభువైన శ్రీమన్నారాయణునికి ఇల్లాలు, వైకుంఠనివాసిని. శ్రీలక్ష్మీ హృదయం మహాలక్ష్మి వైభవాన్ని వేన్నోళ్ళలా కీర్తిస్తోంది. విష్ణుపురాణం లక్ష్మిదేవి యొక్క జగద్వ్యాపకాన్ని చెప్తుంది. పురుషార్థాలను ప్రసాదించే ఈ తల్లిని శ్రావణమాసంలో పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు పూజిస్తే సర్వసౌభాగ్యాలు సమకూరుతాయని పరమశివుడు పార్వతికి చెప్పాడు.
తన సేవకజనుల హృదయమాలిన్యాన్ని పోగొట్టే మహాలక్ష్మి మంగళప్రదయై సౌభాగ్య లక్ష్మిగా, ధైర్య, స్థైర్య, స్థిరబుద్ధులను మానవాళికి ప్రసాదిస్తుంది. ఈ తల్లే ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములుగా అష్టమూర్తులలో విరాజిల్లుతోంది. అందుకే లక్ష్మి దేవి సంపదకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, తుష్టికి, పుష్టికి, యశస్సులకు మూలకారణంగా భావించి, సర్వులచేత పూజించబడుతోంది. కష్టసమయాలలో స్థిరచిత్తాన్ని ఇచ్చి విజయాన్ని చేకూర్చేటపుడు ధైర్య విజయలక్ష్మిగా కొనయాడబడే ఈ తల్లి అష్టదళపద్మంలో ఆసీనురాలై చిన్మయ రూపిణిగా వెలుగొందుతుంది. ఈ తల్లే ఒకసారి వైకుంఠాన్ని వదిలి భూలోకం విచ్చేసి మహారాష్టల్రోని కొల్హాపురిలో కొలువైంది. అక్కడ శ్రీమహాలక్ష్మిని కరవీర్ మాత అని పిలవడం జరుగుతోంది. కొల్హాపూర్‌ను పూర్వం కరవీర్ నగరమని పిలిచేవారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పేర్గాంచిన ‘కొల్హాపూర్’ లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి మహత్తు గొప్పది.
ప్రకృతి అందాల నడుమ అలరారే ‘కరవీర్ నగరం’ అతి ప్రాచీనమైనది. అతి పురాతనమైన ఈ నగరం ‘108’ కల్పాలకు పూర్వం నాటిదంటారు. ‘కరవీర్ నగరం’ గురించి కాశీఖండం, పద్మపురాణం, దేవీ భాగవతం, స్కంద, మార్కండేయ పురాణాలు ప్రసావిస్తున్నాయ. పంచగంగా నది ఒడ్డున అలరారుతున్న ఈ ప్రాచీన నగరాన్ని కొంకణరాజు కర్ణదేవ, వౌర్యుడు, చాళుక్యుడు, రాష్టక్రూటులు, ఇతర యాదవ రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయ. ఈ నగరాన్ని కొలతాపూర్, కళ్ళ, కోల్‌గిరి, కొలదగిరి పట్టణం అనే పేర్లతో ఇంత కు పూర్వం పిలిచేవాళ్లట. ‘కొళ్ళ’ అంటే వ్యాలీ (లోయ) అని అర్థం. ‘పూర్’ అంటే పట్టణమని అర్థం. అంటే ఈ పట్టణ ప్రాశస్త్యాన్ని బట్టి కర్‌వీర్ నగరమే రానురాను కొల్హపూర్‌గా మారిఉంటుందని ఇక్కడివారు అంటారు. కొల్హాపూర్‌లో ఉన్న శ్రీమహాలక్ష్మి ఆలయచరిత్ర ఎన్నో వేల సంవత్సరాల పూర్వంది. ఎందుకంటే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించిందీ తెలియడానికి ఇతమిత్థమైన ఆధారాలు ఇప్పటికీ లభించడం లేదు. అయితే ఈ ఆలయం క్రీ.పూ. 4, 5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించి ఉండవచ్చని ఇక్కడి శాసనాలు చెప్తున్నాయ. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ, 18వ శతాబ్దంలో శంభాజీ మహారాజులు, ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తోంది. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దర్శించారట. ఆయన ఇక్కడ అమ్మవారి లీలా విశేషాలను స్వయంగా వీక్షించి, ఇక్కడ మఠం ఏర్పాటుచేశారు. ప్రధానాలయంలో ఉన్న ‘శ్రీచక్రం’ ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టింబడిందంటారు.
ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కలశం, మరో చేతిలో పుష్పం, ఇంకో చేతిలో పానపాత్రలతో చతుర్భుజాలతో దర్శనమిస్తారు. ఈ మహాలక్ష్మి అమ్మవారు కిరీటి ధారిణి, అమ్మవారికి గొడుగు పడ్తున్నట్టుగా ఆదిశేషుడు కనిపిస్తాడు. అమ్మవారి ఆలయానికి సమీపంలో ఒకపక్క శారదామాత, మరోపక్క కాళికామాత మందిరాలున్నాయి.
శ్రీచక్రానికి దగ్గరగా సూర్యదేవుడు, విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణ భగవానునుని చిన్ని మందిరాలున్నాయి. ప్రధానాలయ ప్రాకారంపై ‘సటువాభాయి’ శిలా ప్రతిమ ఉంది. ఈ తల్లి మహిమ గొప్పదని మహారాష్ట్ర ప్రజల నమ్మకం. ఆ కారణంగానే తమ శిశువులను ‘సటువాభాయి’ మూర్తికి కింద భాగంలో ఉంచి, పూజలు నిర్వహిస్తారు. అలా చేయడం వల్ల తమ పిల్లల భవిష్యత్‌ను లోక మాత సటువాభాయి తీర్చిదిద్దుతుందని నమ్ముతారు. ఆలయానికి ముందు భాగంలో నిత్య అగ్నిహోత్రి గుండం ఉంది. ఇది నిరంతరాయంగా మండుతూనే ఉంటుంది. ఆలయంలోకి వచ్చిన భక్తులు తమతో తెచ్చిన సుగంధ ద్రవ్యాలను ఈ గుండంలో వేసి, ఆలయంలోకి ప్రవేశించడం ఇక్కడి సంప్రదాయం. ఆలయంలో మరోపక్క ఉమా మహేశ్వరస్వామి, శనీశ్వరుడు, దత్తాత్రేయుడు, గరుడ మండపం, దీప్తస్తంభం, వీరభద్రస్వామి, నాగేంద్రుడు, భైరవమూర్తులున్నాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి తెల్లవారుజామున 4:30 గంటలకు హారతినిస్తారు. దీనిని ‘కాకడ హారతి’ అంటారు. ఈ సమయంలో భూపాల రాగాన్ని ఆలపిస్తారు. ఉదయం 8:30 గంటలకు మంగళహారతి, ఉదయం 11:30 గంటలకు కుంకుమ, పుష్పాలతో అమ్మవారికి అర్చన, అనంతరం మధ్యాహ్నం రెండు గంటల వరకూ పంచామృతాలతో అభిషేకం, అర్చనలు నిర్వహిస్తారు. రాత్రి 7:30 గంటలకు ఇచ్చే హారతిని ‘బోగ్-హారతి’ అని వ్యవహరిస్తారు. ప్రతి శుక్రవారం రాత్రిపూట అమ్మవారికి నైవేద్యం పెడతారు. రాత్రి 10 గంటలకు శేష హారతినిచ్చి అమ్మవారికి పవళింపచేస్తారు.
ఇంతటి మహిమాన్వితమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లీలా విశేషాలతో పునీతమైన ఈ ఆలయం కొల్హాపూర్ పట్టణ నడిబొడ్డున ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్ళు ఈ పట్టణానికి అందుబాటులో వున్నాయి. కొల్హాపూర్ పట్టణానికి ముంబాయి, బెంగుళూరు, పుణెల నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉంది.