06/03/2020
అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఈ రోజు రెండు కమిటీలతో బాబు సమావేశం కానున్నారు. ఎన్నికల కసరత్తు కోసం కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, లోకేష్, సబ్బంహరి, టీడీ జనార్దన్, సాయిబాబా, కుటుంబరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసింది. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కో ఎమ్మెల్సీ నియామించాలని బాబు కసరత్తు చేస్తున్నారు.
కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో, ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్‌కుమార్ తెలిపారు. నోటిఫికేషన్ ముందుగా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం పరిపాటని.. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు గుర్తింపుపొందిన పార్టీల నేతలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకుంటామని వెల్లడించారు. పరిస్థితులన్నీ అంచనా వేసుకున్న తర్వాత నోటిఫికేషన్ విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.