28/05/2023
పాపులారిటీని ఇన్ స్టా ఫాలోవర్లలో ... ఫాలోయింగును ఫేసుబుక్ లైకుల్లో కొలుస్తున్న ఇంటర్నెట్ యువతకు.. ఆయన ఆకర్షణను అంచనా వేయడం అంత ఈజీ కాకపోవచ్చు..
రెండు మూడు తరాలు.. నిరంతరం కొలుస్తున్న తారకరాముని తేజోరూపం గురించి నేటి కొత్తతరానికి పూర్తిగా తెలిసుండకపోచ్చు...
గ్రాఫిక్ ఫైట్లతో... నేటి హీరోలు చేసే ఫీట్లనే సాహసాలు అని ఫీలయ్యే యూత్ కు ... హీరోగా వెలుగుతున్నప్పుడే... యాంటీ హీరోగా చేయడం... వికలాంగుడిగా కనిపించడం... కోడె వయసులో ముసలిగా మెప్పించడం వంటివి అసలైన సాహసాలుగా అనిపించకపోవచ్చు.
అడ్డగోలు మాటలతో.. అసభ్యంగా ప్రవర్తించే రాజకీయనాయకులను "దమ్మున్నోడు.." అంటూ నెత్తిన పెట్టుకుంటున్న పొలిటికల్ పిల్లకాయలు.. ఢిల్లీకి ఎదురుగా రొమ్ము చూపి... దమ్ముగా నిలుచున్న తెలుగు మొనగాడిని చూసి ఉండకపోవచ్చు...
తరాలుగా.. తరగని... చెరగని ఆ తెలుగు సంతకం
నందమూరి తారకరామారావు...!
Nన్నటికీ
Tరగని
Raజసం
NTR అంటే.. !
యన్.టి.రామారావు- ఒక చరిత్ర...
చిత్రజగతిని.. ఏలిన చక్రవర్తి..... రాజకీయ రణస్థలిని గెలిచిన రారాజు..
నటుడు,నిర్మాత, దర్శకుడు,నాయకుడు, ప్రతినాయకుడు, ప్రతిపక్షనాయకుడు, మహానాయకుడు... ఇలా తెలుగు తెరపై... రాజకీయ యవనికపై ఆ స్థాయిలో ముద్రవేసిన వాడు.. లేడు..! ఇక ముందు రాడు...!!
నిండు తెలుగుతనానికి నిలువెత్తు రూపం...
"అన్న" అన్న పిలుపుకి పర్యాయపదం...
ఢిల్లీ గద్దెను గడగడలాడించిన తెలుగుపౌరుషం...
నందమూరి తారక రామారావు....!
ఆ రూపం అపురూపం..
ఆ పలుకు ఉత్తుంగ తరంగం..
ఆ పిలుపు ప్రభంజనం.. !
ఆయన...కనిపించిన తెరలకు.. పాలాభిషేకాలు జరిగాయి.. ఆ థియేటర్లలో కాసుల వర్షాలు కురిశాయి. ఆయన చైతన్య రథంపై తిరిగిన రదారులు.. బంతిపూల వనాలయ్యాయి.. సినిమాలైనా.. రాజకీయాలైనా .. ఆయన రూటే సపరేటు.. ఆ స్థాయిలో ప్రభావం చూపించడం ఆయనేకే చెల్లింది. అది మరెవరకికీ సాధ్యం కానిది. ధీర గంభీర స్వరంతో పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసిన నటలు.. కళ్లలో క్రూరత్వంతో.. విలనిజాన్ని పండించిన వాళ్లూ అప్పుడూ ఉన్నారు. అయితే ఇవన్నీ చూపించగల హీరో "మెటీరియల్" అన్నగారు మాత్రమే.. ! అద్భుతమైన నటలు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటుడు.. హీరో ... వన్ అండ్ ఓన్లీ.... ఎన్టీఆర్..
ఆజానుబాహం.. అరవింద నేత్రం అంటూ... రామమంద్రుని తలుచుకుంటే కనిపించేది ఆ ముఖారవిందమే..
బావా ఎప్పుడు వచ్చితీవి అంటూ సరసంగా పలకరించేది. ఆ నగుమోమే...!
పాంచాలీ.. పంచభద్రుక... అంటూ.. కళ్లల్లోనే నిప్పులు కురిపించగలిగేది... ఆ వదనమే...!
ఆ రూపం ఆయనకే ఉంది.. ఆ నటకు ఆయనకు 'మాత్రమే' సాధ్యమైంది. ఆయన కళ్లూ.. ఒళ్లూ.. గొంతూ ఏకకాలంలో నటించేస్తాయి.
మందగమనంతో... చిరుదరహాసంతో... సాత్వికంగా సంభాషించే శిఖపింఛమౌళిని.. వజ్ర వైఢూర్య, రత్న మణిమయ కచిత ఆభరణాలతో.. గధాయుధంతో సింహాసనంపై రౌద్ర, భీకరంగా కనిపించే రారాజును... ఒకే ఫ్రేములో తెచ్చినప్పుడు.. వారిద్దరూ ఒక్కరే అని ఏ తెల్లోడికైనా చెప్పిచూడండి.. తెల్లబోతాడు. అసలు రారాజు నటనను తూచే తరాజు... ఆయన స్టామినాను కొలిచే ఇనిస్ట్ర్యూమెంటూ ఉందా..?
అందుకే... భాగవద్గీత చదువుతుంటే.. నాకు కృష్ణుడిగా మీ రూపమే కనిపిస్తోందని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటి వారూ ఎన్టీఆర్ తో అన్నారు. జస్టిస్ చౌదరి హిందీలో రీమేక్ చేసినప్పుడు.... ఎన్టీఆర్ చూపించిన ఇంటెన్సిటీ ఇవ్వలేక.. ఆయనలా నేనెక్కడ చేయగలను అని ... దిలీప్ కుమార్ అంతటి వాడు వాపోయాడు...
హీరోగా శిఖరంపైకి చేరుతున్న సమయంలో రావణుడిగా ఎంట్రీ ఇవ్వడం.. కోడె వయసులోనే పండుముసలి భీష్ముడిగా రాణించడం.. నడివయసులో బడిపంతులుగా మెప్పించడం.... ఆయనకు మాత్రమే సాధ్యమైంది.
రాముడంటే.. ఇలా ఉంటాడు.... కృష్ణుడంటే అలా ఉంటాడు.. అని తెలియని జనాలకు వాళ్లెలా ఉంటారో చెప్పాలనే ఈయన పుట్టాడా అనిపిస్తుంటుంది... ఒక్కోసారి. యాభై ఏళ్లపాటు.. తెలుగు చిత్ర జగతిని ఏకచత్రాధిపత్యంగా ఏలాడు ఆయన...! సాంఘిక, చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో జీవించాడు.. ఆయన పౌరాణిక సినిమాల్లో ఒక్కో సీన్ గురించే.. ఒక్కో పుస్తకం రాయెచ్చు.. అలాంటిది ఆ సినిమాల గురించి.. ఈ పోస్టులో చర్చించడం సాధ్యం కాని పని...
ఇంతవాణ్నయ్యాను... ఇంతటి వాణ్నయ్యాను.. అంటూ... తన మొదటి సినిమా మనదేశంలో అన్నగారు పలికిన డైలాగ్ అచ్చంగా ఆయన్ను అంతటి వాడినే చేసింది. వెండితెర తెరవేల్పు... రాజకీయనాయకుడిగా లక్షల కుటుంబాలకు ఇలవేల్పుగా మారాడు. సినిమా జీవితంలోనే కాదు.. రాజకీయాల్లోనూ తిరుగులేని విజయమే... ! ఢిల్లీ గద్దెను ధిక్కరిస్తూ తెలుగుగడ్డపై విడుదలైన 'తెలుగుదేశం సూపర్‌హిట్ ' అయింది. పేదలకు పట్టెడన్నం పెట్టడం దగ్గర నుంచి.. ప్రతిబంధకాలుగా మారిన వ్యవస్థలను మార్చడం వరకూ ప్రతీదీ సంచలనమే..! ఆయన ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా... అది ధర్మాగ్రహమే.. కానీ .... ప్రతీకారం కాదు. రెండు రూపాయలకు కిలోబియ్యం, పటేల్ పట్వారీ రద్దు, మండలాల ఏర్పాటు, తెలుగువర్సిటీ, మహిళా వర్సిటీ, ఆడబిడ్డలకు ఆస్థిహక్కు, ఇవన్నీ ఆయన సంస్కరణలు.. మండలిరద్దు, కేబినెట్ రద్దు చేయడం.. ఇవీ ఆయన సంచలనాలు. తెలుగుదేశాన్ని జాతీయ ప్రతిపక్షంగా నిలబెట్టారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ను నిర్మించి.. వీపీ సింగును ఢిల్లీ గద్దెపై కూర్చుండబెట్టారు. రాజకీయాల్లో ఉంది 14 ఏళ్లే అయినా.. తరగని.. చెరగని ముద్ర వేశారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పతాకస్థాయిలో నిలబెట్టారు. శిఖరాయమానంగా వెలుగొందిన ఆయన సినీ, రాజకీయ జీవితం..చరమాంకంలో ఆ రీతిలో ముగియడం విషాదాంతం..!
ఇవాళ NTR శత జయంతి.. ! ఆయన దూరమై కూడా పాతికేళ్ళు..! NTR కు ముందు ... ఆ తర్వాత కూడా ఎంతో మంది లీడర్ల ను తెలుగు నేల చూసింది. కానీ ఆ స్థాయి ప్రభావం...చరిష్మా.. మరొకరికి లేవు. ఇక ముందు వస్తుందన్నది కూడా అనుమానమే. తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం. NTR గురించి చెప్పుకుంటారు అనుకుంటా... అయినా ఆయన లేనిదెక్కడ...!? మరణం లేని జననం అది.. ! భౌతికంగా ఎన్టీఆర్ లేరు అంతే... తెలుగు మాటలో, పాటలో, పసుపులో, పేదోడికి ఇచ్చే బియ్యంలో.. ముసలోళ్లకు పంచే... ఫించనులో అన్నింటికీ మించి.. అన్నా అన్న పిలుపులో ...అన్నింటిలో ఎన్టీఆర్ ఉన్నాడు.
Nagesh GV