23/10/2021
ప్రవీణ్ నిలిచి గెలిచేనా...
నేటి రాజకీయాలను దళిత, బీసీ సామాజికవర్గాలు కుల కోణంలో బాగా అర్థం చేసుకుంటున్నాయి. రాజ్యాధికారంలో తమకూ వాటా కావాలనే బలమైన కాంక్షతో ఉన్నాయి. బీఎస్పీ ఈ ఆకాంక్షను ముందుకు తీసుకుపోతుందనే నమ్మకంతోనూ ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రవీణ్‌కుమార్. అత్యంత జాగ్రత్తగా ఆ భావనను ముందుకు తీసుకువెళ్ళే బృహత్తర బాధ్యత బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం పైనే ఉంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కన్పిస్తున్నది. తెరపైకి కొత్త పార్టీలు రావడం ఒకటైతే, కొత్త గొంతుకలతో సరి కొత్త ఎజెండాలనూ తెలంగాణ సమాజం ముందుకు తీసుకురావడమే ఈ మార్పుకు కారణం. కొత్తగళాన్ని విన్పిస్తున్న వాటిలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రధానమైనది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడంతో ఆ పార్టీ ఒక కొత్త చైతన్యశక్తిగా ప్రభవిస్తోంది.
వాస్తవానికి 1990ల నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక ప్రబలశక్తిగా బీఎస్పీ వస్తుందనే చర్చ జరిగింది. నాటి పార్టీ రాష్ట్ర నాయకులు బొజ్జా తారకం, కొల్లూరు చిరంజీవి ఆ చర్చకు ప్రధాన భూమిక రచించారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరడంతో అలాంటి చర్చే జరుగుతున్నది. అయితే పాతికేళ్ల కిందటి సామాజిక, ఆర్థిక, రాజకీయాలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. అంతే కాదు, ప్రవీణ్‌కుమార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దళితుల్లోనే కాదు ఇతర సామాజికవర్గాల్లో కూడా రాష్ట్ర రాజకీయాలపై బీఎస్పీ ప్రభావం చూపించనున్నదనే అభిప్రాయమూ కలిగింది.
కారణాలు ఏవైనా బీఎస్పీ అప్పుడు అనుకున్న స్థాయిలో తన ప్రభావాన్ని చూపించ లేకపోయింది. ఆ తర్వాత కూడా పార్టీ ఉన్నది. దాని కార్యక్రమాలూ ఉన్నాయి. అయితే ఆ పార్టీ ఉన్నా లేనట్లుగానే అయింది. బొజ్జా తారకం, కొల్లూరి చిరంజీవి నాయకత్వాన పార్టీలోకి విప్లవ పార్టీల ప్రభావంతో ఉన్న నాయకులు, కార్యకర్తలు, కత్తి పద్మారావు లాంటి ఉద్యమ నాయకులు, దళిత ఉద్యమ భావజాలంతో ఉత్తేజితులైన వారు వచ్చారు. పార్టీ కూడా ఆ మేరకు ప్రజల్లోకి వెళ్లింది. ఆ తర్వాత సమర్థంగా పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. దానికి తోడు ఉన్న నాయకత్వం కూడా రాజకీయాల్లో మారిన సమీకరణాలను అర్థం చేసుకుని ఎత్తుగడలు వేయడంలో సఫలం కాలేకపోయింది. ఉన్న నిర్మాణానికి మరింత బలం చేకూర్చలేకపోయారు నాటి నాయకులు. ఈ అంశాలన్నీ కూడా దళిత ఉద్యమ నాయకుల్లోనూ, అంబేడ్కర్ తాత్వికతను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కార్యకర్తలు చేస్తున్న చర్చల్లోనివే అనడం సత్యదూరం కాదు.
ఇప్పటి పరిస్థితి వేరు. ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ అధికారిగా, సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా సాధించిన విజయాలు, ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ కూడా అద్భుతాలు చేస్తుందనే నమ్మకాన్ని సమాజంలో బలంగా కలిగించడం వల్ల ఆయనపై అంచనాలు పెరిగాయి. అందుకే బీఎస్పీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకుంటుందనే నమ్మకాలను పెంచుతున్నాయి. దానికి తోడు ఆయన వెంట ఉన్న ఈ తరం నాయకులు, కార్యకర్తలు బలమైన అంబేడ్కర్ భావజాలంతో ఉన్నారు. నల్గొండ సభకు వచ్చింది కూడా ఇలాంటి వారే. అంతే కాదు క్షేత్రస్థాయిలో పార్టీ లేకున్నా.... కార్యకర్తలు బలంగా ఉన్నట్లే. తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం లేని ఊరు లేదు. అంత బలంగా అంబేడ్కర్ భావజాలం ప్రజల్లోకి వెళ్లింది. ఇదే, పార్టీ నిర్మాణానికి విశేషంగా తోడ్పడే అవకాశం ఉంది.
మునుపటి నాయకత్వాని కంటే ప్రవీణ్‌కుమార్‌కు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలే. నేటి రాజకీయాలను దళిత, బీసీ సామాజికవర్గాలు కుల కోణంలో బాగా అర్థం చేసుకుంటున్నాయి. రాజ్యాధికారంలో తమకూ వాటా కావాలనే బలమైన కాంక్షతో ఉన్నాయి. బీఎస్పీ దీన్ని ముందుకు తీసుకుపోతుందనే నమ్మకంతోనూ ఉన్నాయి. ఈ భావనకు కారణం ప్రవీణ్‌కుమార్. అత్యంత జాగ్రత్తగా ఈ భావనను ముందుకు తీసుకు వెళ్ళే బృహత్తర బాధ్యత బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం పైనే ఉంది.
అనుకూల అంశాలే కాదు కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. నోట్ల వాన కురిస్తే తప్ప ఓట్లు పడే పరిస్థితి లేదు. అర్థబలం, మీడియా బలం కూడా దానికి తోడవ్వాలి. అంతే కాదు దళిత, గిరిజన, బీసీల కులసంఘాలు, వాటిలోని చీలికలు తదితరాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఏకతాటి పైకి తీసుకురావడం ప్రవీణ్‌కుమార్ ముందున్న సవాలు.
కొన్ని లక్షలమంది విద్యార్థులు, వేలమంది టీచర్లు ఉన్న విద్యాసంస్థలను సునాయాసంగా నడిపి మంచి పేరు తెచ్చుకున్న అధికారి... ఇప్పుడు కోట్ల మందిని నడిపించే నాయకుడిగా మారాల్సి ఉంది. దానికి తోడు బీఎస్పీ ప్రాంతీయ పార్టీ కాదు. పొత్తులు, ఎత్తులన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే నిర్ణయించాల్సి ఉంటుంది. వీటిని సమన్వయం చేసుకోవాలి. ఇంతే కాదు, కేసీఆర్ లాంటి బలమైన మాస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వేసే ఎత్తులకు అంతే బలంగా ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. ఆయన ఇప్పటికే దళితబంధు లాంటి బలమైన పథకం తీసుకొచ్చారు. దళిత జీవితాల్లోకి పరకాయప్రవేశం చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అసెంబ్లీలోకి అడుగు పెట్టని సామాజికవర్గాలను కూడా కేసీఆర్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు (సీట్లు ఇస్తామని కాదు). వారికి ఏదో రూపంలో ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చేలా పథక రచనలు చేస్తున్నారు. మరోవైపు షర్మిల, రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారు. షర్మిల పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పక్కన పెడితే రేవంత్‌రెడ్డి మాత్రం దళిత, బీసీ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీ దళితబంధు పథకం అంటుంటే కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన దండోరా సభలు నిర్వహిస్తున్నది. రాజకీయం అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీల చుట్టూనే తిరుగుతున్నది.
ఈ సామాజికవర్గాల్లోని అనైక్యతను, ప్రధాన స్రవంతి పార్టీలకు ఉన్న అన్ని శక్తియుక్తులనూ తట్టుకుని నిలబడటం అనేది అన్నింటి కంటే ప్రవీణ్‌కుమార్ ముందున్న అతి పెద్ద సవాలు. దళితుల్లోని ప్రధాన, ఉప కులాలు, వర్గీకరణ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. కృష్ణమాదిగతో సహా దళిత రాజకీయాలే ఎజెండాగా పనిచేస్తున్న పార్టీల నాయకులను ప్రవీణ్‌కుమార్ ఎట్లా కలుపుకుపోతారనేది కూడా ఓ ప్రశ్నగా ఉంది.
ఈ సందర్భంగా సిద్ధార్థ గౌతముడు చెప్పిన ఓ మాటను గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుందని భావిస్తున్నాను. ‘మనస్సుపై విజయం సాధించాలి’ అనేది ఆయన ఉపదేశం. ఇది సాధించినవారు అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటారు. ఈ మాట ప్రస్తుత సందర్భానికి సరిపోతుంది. చెల్లాచెదురుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు అధికారం సాధించుకోవాలంటే తాము ఫలానా కులం అనే మానసిక భావనను త్యజించాలి. తామంతా ఒక్కటే అనే బలమైన మానసిక భావన ఆయా సామాజికవర్గాల్లో బలంగా నెలకొనాలి. ఇందులో సగ భాగం సాధించినా ప్రవీణ్ కుమార్ విజయం సాధించినట్లే.
R.S.Praveen kumar BSPTelangana