23/08/2023
*అనుదిన ధ్యానములు*
దేవుడు నిన్ను కనానులో ఉండుటకు పిలిచినయెడల ఐగుప్తునకు వెళ్ళవద్దు
**దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన నిన్ను కుడా పరీక్షిస్తాడు**. ఈసారి పరీక్ష దేశములో ఉన్న కరువు ద్వారా వచ్చింది(ఆదికాండము 12:10). దేవుడు నిన్ను వెళ్లమన్న కానాను దేశములో కరవు వస్తే నీవేమి చేస్తావు? **నీవు నీ ఇంద్రియాలు చెప్తున్న దానిని బట్టి జీవించవచ్చు లేక దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పిన దానినిబట్టి జీవించవచ్చు.**
యేసు గురించి, **"కంటిచూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదానిని బట్టి విమర్శచేయడు"** (యెషయా 11:3,4) అని ఒక చక్కటి మాట ఉన్నది. కాని మనిషి ఆ విధముగా జీవించడు. మనము కానానులో కరవు గురించి విన్నా, దాన్ని చూచినా మనం వెంటనే మన కళ్ళు, చెవులు మన తెలివైన మెదడు చెప్పే దానిని బట్టి వెంటనే నిర్ణయం తీసుకుంటాము.
ఇప్పుడు మనం ఉండవలసినది ఖచ్చితంగా కానానులోకాదు అని మనం నిర్ణయించుకుంటాము. మనం ముందుకు వెళ్లాలనుకుంటాము. దేవుణ్ణి అడుగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంద్రియాలను బట్టి మనం జీవిస్తున్నాము. అబ్రాహాము చేసింది కూడా అదే. **"అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను"** (ఆదికాండము 12:10).
ఐగుప్తు వెళ్లమని అతనికి ఎవరు చెప్పారు? దేవుడు కాదు అతని ఇంద్రియాలు. కరవు కాలములో దేవుడు ఒక వ్యక్తిని సంరక్షించలేడా? ఖచ్చితంగా, **"యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. వర్షములేని సంవత్సరమున చింతనొందడు కాపుమానదు"**(యిర్మీయా 17:5-8). ప్రభువును నమ్మువాడు దేవుడు చెప్పువరకు కదలడు. ప్రభువు అరణ్యములో శోధింపబడినప్పుడు సాతానుతో అదే చెప్పాడు.
రాళ్లను రొట్టెగా మార్చమని సాతాను యేసుతో చెప్పాడు. అక్కడ అరణ్యములో కరువుండెను మరియు దగ్గరలో ఆహారము అమ్మే కొట్లు లేవు. కాని యేసు, **"మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలన జీవించును"** అని సమాధానమిచ్చెను(మత్తయి 4:4).
కాని అబ్రాహాము అలా జీవించలేదు. అతడు రొట్టె వలన మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఐగుప్తులో రొట్టె ఉన్నది గనుక అక్కడకు వెళ్లాడు. ఈరోజు కూడా ఎంతో క్రైస్తవపని అలాగే జరుగుతుంది. ఎక్కువమంది క్రైస్తవపరిచారకులు ప్రభువు చెప్పిన చోటకు వెళ్లరు. వారికి మంచి జీతం వచ్చే చోటకు, రొట్టె సమృద్ధిగా దొరికే చోటుకు వెళ్తారు.
డబ్బు కరువుగా లేని సంస్థలలో చేరతారు. కరువు కాలంలో నివసించడానికి ఐగుప్తు సౌకర్యవంతమైన ప్రదేశం కావచ్చు. కాని దేవుడు నీవు ఉండాలని కోరుకుంటున్న ప్రదేశమదేనా అన్నది ప్రశ్న. దేవుడు నిన్ను **"కానాను"**లో ఉండాలని కోరుకుంటుంటే నీవు **"ఐగుప్తు"**కు వెళ్లకూడదు. దేవుడు నీతో ఏమి చెప్తున్నాడో ఇప్పుడే వినకపోతే నీవు పరీక్షింపబడినప్పుడు నీవు కూడా అదే పని చేస్తావు.
**యేసువలె దేవుని నోటనుండి వచ్చే మాటలవలన జీవించుము. ఆయన వైఖరి "అవును, జీవించడానికి రొట్టె అవసరమే. కాని జీవించడానికి దేవునికి లోబడుట ఎక్కువ అవసరం" అన్నదిగా ఉండెను.**
సాతాను యేసునే ఇలా శోధిస్తే అతడు నిన్ను కూడా విస్తారమైన రొట్టె దొరికే ప్రదేశమునకు వెళ్లుటకు నిన్ను కూడా శోధించునని నీవనుకోవడం లేదా? నీవు పూర్తికాల క్రైస్తవపరిచర్యలో ఉన్నప్పుడు ఒక ఆర్ధికపరమైన క్లిష్టపరిస్థితిని ఎదుర్కొనప్పుడు నీవు మరొక సంస్థలోనో మరొక సంఘములోనో ఎక్కువ డబ్బు పొందవచ్చని సాతాను నీతో చెప్పి అక్కడకు వెళ్లమని నీతో చెప్తాడు. అట్టి సమయనందు నీవు సాతాను మాటవిని నీ జీవితాన్ని పాడుచేసుకోకుండునట్లు దేవుడు నిన్ను కనికరించునుగాక.
అబ్రాహాము ఐగుప్తుకు వెళ్లడం యొక్క ఫలితమేంటి? తన భార్య తన చెల్లియని అతడు అక్కడ ఒక అబద్ధం చెప్పవలసి వచ్చింది. నీవు ’ఐగుప్తు’కు వెళ్తే అనేక ఇబ్బందులలో ఇరుక్కుపోవచ్చు. నీవు అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. అబద్ధ నివేదికలను సమర్పించవలసి వస్తుంది. నూటికి నూరు శాతం నిజము కాని విషయాలను చెప్పవలసి వస్తుంది.
నీ మనస్సాక్షి విషయంలో రాజీపడవలసి వస్తుంది. శారాకు 65 లేక 70 ఏళ్లు ఉండియుండవచ్చు. కాని ఆమె అప్పటికి కూడా చాలా ఆకర్షణీయమైన స్త్రీగా యుండియుండును. ఎందుకంటే ఐగుప్తు రాజైన ఫరో ఆమెను తన అంతఃపురములోనికి తీసుకున్నాడు. విషాదకరమైన విషయమేమిటంటే తన భార్య అంతఃపురములోనికి పాడుచేయబడుటకు కొనిపోబడినప్పుడు కూడా అబ్రాహాము తన స్వంత ప్రాణమును ఎంత ప్రేమించాడంటే అతడు ఫరోకు నిజం చెప్పలేదు. **మనం క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడే మనం సత్యమును ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకోగలము.**
ఇప్పుడు నేను ఇంకా తీవ్రమైన విషయాన్నొకటి చెప్తాను. తరువాత 4000 సంవత్సరాల పాటు పర్యవసానాలను కలిగించిన విషయమొకటి ఐగుప్తులో జరిగింది. అబ్రాహాము ఐగుప్తుకు వెళ్లి అక్కడున్న ధనవంతులు తమ ఇళ్లలో దాసీలను (ఆడ పనివాళ్ళను) కలిగియుండుట చూచినప్పుడు తను కూడా ఒకరిని కావాలనుకున్నాడు. గనుక హాగరనే ఒకదాసీని వెట్టుకొని ఐగుప్తు నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమెను తనతో పాటు తెచ్చుకున్నాడు. ఇప్పుడిక శారానే గుడారములో పనంతా చేయవలసిన అవసరంలేదు.
ఆమెకు సహాయం చేయడానికి హాగరుండెను. తర్వాత శారాకు పిల్లలు పుట్టనప్పుడు ఆ సమస్యలో కూడా ఆమెకు సహాయపడడానికి హాగరుండెను. హాగరు ద్వారా ఇష్మాయేలు వచ్చెను. అతని సంతానము 4000 సంవత్సరాలుగా ఇశ్రాయేలు సంతతితో ఘర్షణపడుతూ ఉన్నారు. కాని ఇదంతా ఒక మనిషి దేవునిమాటను ఒక్కసారి వినకపోవడం వలన జరిగెను.
**"నేను చాలా వరకు దేవుని మాట వింటాను" అని నీవు చెప్పవచ్చు. మంచిదే. కాని ఒక్కసారి మాత్రమే దేవునిమాట వినకపోవడం యొక్క పర్యవసానాన్ని మనము ఇక్కడ చూస్తాము**. ఆ సందేశము మనము తీవ్రంగా తీసుకుంటామని నేను ఆశిస్తున్నాను.