Sir Arthur cotton dora Biopic

  • Home
  • Sir Arthur cotton dora Biopic

Sir Arthur cotton dora Biopic Sir Arthur cotton dora Biopic ... This is a film. childrens film. pan india film.

గోదావరిపిలిచింది🌅〰〰〰〰〰〰🌅కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింద...
03/06/2023

గోదావరిపిలిచింది
🌅〰〰〰〰〰〰🌅

కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయిన కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం.

కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు.

తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు- మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు.

అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు వియ్యంకుడితో అనేశాడు ‘‘మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ’’ అని.
‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పన్జేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి.

1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడే. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళొనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.

కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు.

ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా?
మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా?
వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?

‘‘కడియంలో కాసేపు ఆపాలయ్యా’’ డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు. వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం. వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు... ఎరుపూ, నలుపూ, పసుపూ, నీలం, తెలుపు గులాబీలూ, చామంతులూ... అదొక పూల సామ్రాజ్యం.

కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది. ‘‘నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం’’ దక్షిణామూర్తి కూతురు అంది.

‘‘సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా’’ అంది దక్షిణామూర్తి భార్య హైమ.

‘‘అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని’’ కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు.

బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- ‘‘అది ఎవరి విగ్రహం మామయ్యగారూ’’ అని.

హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పన్జేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా!
చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.
దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.

అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి.

మ్యూజియం ముందుభాగంలో 1840 లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు.
కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్.
ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు.

‘‘ఆ రోజుల్లో అంటే 160 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం... ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి.
అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం.
ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే. కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572 లతో పని పూర్తిచేసి చూపించాడు’’... దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.

‘‘మన వూళ్ళొ పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు... అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ’’ అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి.

ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.
మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.
‘‘వెళ్ళొస్తాం మామయ్యగారూ’’ అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.
‘‘సరే, జాగ్రత్త! హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి’’ కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.
ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.

దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, వూరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.
సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు ‘‘ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...’’
దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.
‘‘నాన్నా, బావున్నారా?’’
‘‘బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?’’
‘‘ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...’’
ఫోన్‌ అల్లుడికిచ్చింది.

‘‘మామయ్యగారూ బావున్నారా?’’
‘‘బావున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?’’
‘‘అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా’’ మాటల్లో ఏదో తటపటాయింపు.
‘‘చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు’’
‘‘నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...’’ కిరణ్‌ చెబుతున్నాడు.
దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది.
‘‘అలాగే అల్లుడూ.
మన వూరు వచ్చి, మన వూళ్ళొ బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది. నేనేం కావాలన్నా చేస్తాను’’ సంతోషంగా అన్నాడు.
‘‘థాంక్స్‌ మామయ్యా’’

‘‘సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే’’ దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు.

‘‘మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా!.
మీరు మీ వూరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా!"

దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు. గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ.
‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు...
నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా!
కాటన్‌ దొరా... నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.

దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా.
🌷🙏🌷🙏🌷🙏🌷🙏

అతివృష్టి, తుఫాను, ఆనావృష్టి జనాలను కరువులోకి నెట్టేసాయి అప్పట్లో______________________________________________దాదాపు రె...
13/04/2023

అతివృష్టి, తుఫాను, ఆనావృష్టి జనాలను కరువులోకి నెట్టేసాయి అప్పట్లో
______________________________________________

దాదాపు రెండువందల ఏళ్ళ క్రితం 1831లో భారీగా వర్షాలు కురిసాయి. వర్షాల సమయంలో వున్నగింజలు తినడానికి అయిపోయాయి. ప్రత్యేకంగా పంటలకోసం పెద్దగా దాచలేదు. ఈలోగా 1832లో తుఫాను వచ్చింది. ఏదో కొంత వేసారులే అనుకున్న పంటలను కాస్తా అది నాశనం చేసింది. 1833 నాటికి తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేకంగా గుంటూరు ప్రాంతంలోని ఐదు లక్షల జనాభాలో తిండిదొరకని అటువంటి దుర్భర పరిస్తితుల్లో రెండులక్షలమంది చనిపోయారట. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. ఇక బ్రతికి వున్న వారు శరీరం అంతా శుష్కించి ఎముకలకు చర్మానికీ మధ్య కనీసం కండరమన్నదే కానరాక ఎండుపుల్లల్లా డొక్కలు కనిపించేలా మారిపోయారట. అటువంటి పరిస్థితినే వాడుకలో డొక్కల కరువు అని పిలిచారు. నందన సంవత్సరంలో సంభవించిన కరువు కాబట్టి నందన కరువు అన్నారు.

ఇటువంటిదే తెలుగు నేలపై అంతకు ముప్పయి నలబై ఏళ్ళ క్రితమే 1791-95 లలో వచ్చింది. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి.

1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది.

==================

అటువంటి తీవ్ర వ్యతిరేఖ పరిస్థితుల్లో చాలా మంది మనసున్న మారాజులు ప్రజలను ఈ కరువునుంచి కాపాడేందుకు వారి చేతనైనంత సాయం చేసుకుంటూ వచ్చారు.

అప్పటి బ్రిటీష్ పాలనలో సిపి బ్రౌన్ అధికారిగా చేస్తున్నారు ఆయనను ఆనాటి కరువు పరిస్థితుల గురించి రిపోర్టులో రాసేప్పుడు కేవలం కొరతగా మాత్రమే పేర్కొనమంటే ఆయన కాదని దాన్ని కరువుగా తీవ్ర దుర్భిక్షం(drought) గా పేర్కొని ఉన్నత అధికారుల అసంతృప్తిని ఎదుర్కొన్నారు.

యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు, వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన ఏనుగుల వీరాస్వామయ్య నందన కరువులో స్వయంగా పూనుకుని వేర్వేరు చోట్ల సేకరించి మరీ చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.
చెన్నపట్టణంలో సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన
కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. నేను ఇంకా కొందరి పేర్లు ప్రస్తావించకపోయి వుండొచ్చు.
ఎందరో చేయూత నిచ్చారు.

==================

ఈ కరువు పరిస్థితుల గురించి జానపదులు పాడుకున్న ఒక పాట

ఎంత మంచి దాత కరువన్నా
భువిలోన జనులకు ఏమి కష్టముకలిగేరోరన్నా || ఎంత ||

మూడు రూపాయలిచ్చామంటే ముప్పావు కొర్రాలివ్వరూ
పది రూపాయిలిచ్చామంటే పావు జొన్నాలివ్వన్నా || ఎంత ||

సేరు బంగారిచ్చామంటే సేరు రాగూలిచ్చారన్నా
సేరు యెండి ఇస్తామంటే సేరు జొన్నలిచ్చారన్నా || ఎంత ||

సేరు గింజాలిసురూకోని అంబలైనా గాసుకుంటే
మనిసిమనిసికి వంతులేస్తే గంటేడైనా రాదురన్నా || ఎంత ||

సేసుకున్నే పెళ్ళాలను సెట్టుకిందా పండబెట్టీ
సెప్పకుండా పారిపోయే సెడ్డకాలామొచ్చేనన్నా || ఎంత ||

కలిగినమ్మా కనికరీంచి పిడికెడన్నం పిలకు బెడితే
కన్నబిడ్డల డొక్కజించే కాని కాలమొచ్చేనన్నా || ఎంత ||

యెంత మంచి ధాత కరువన్నా
భూవిలో జనులకు ఏమి కష్టము కలిగేరోరన్నా.

ఎంతటిది ఈ ధాత నామ సంవత్సరంలో (1876 మార్చి 25 ఉగాది నుంచి) వచ్చిన కరువు భూమి మీద వున్న జనాలకు ఎంత కష్టం కలిగింది అని ఈ జానపదుడు వాపోతూ అప్పటి కొన్ని విషయాలను చెప్తున్నారు. మూడు రూపాయిలు అంటే అప్పట్లో చాలా పెద్ద మొత్తమే ఇస్తే ముప్పావు కొర్రలు ఇవ్వట్లేదట. పది రూపాయిలు ఇచ్చినా పావు (కిలో) జొన్నలు ఇవ్వట్లేదు. ఇక వెండి బంగారాల పరిస్థితి కూడా అలాగే దిగజారిందట. సేరు బంగారం ఇస్తే సేరు రాగులు ఇస్తున్నారు. సేరు వెండి ఇస్తే సేరు జొన్నలు ఇస్తున్నారు. సరే ఏదో రకంగా ఒక సేరు గింజలు తెచ్చుకుని ఇసుర్రాయి మీద ఇసురు కుని దానితో అన్నం వండుకుని తినేంత ఎక్కువ లేదు కాబట్టి బాగా నీళ్ళు పోసి కాగబెట్టి అంబలిలాగా కాస్తే అది కూడా మనిషి మనిషికీ కుటుంబంలో పంచుకుంటూ వచ్చే సరికి ఆకలి తీరకుండా కేవలం గంటెడు అయినా రాలేదుగా అని దీనంగా చెప్తున్నారు.

పెళ్ళాం బిడ్డల పరిస్థితిమీద చెపుతూ చేసుకున్న భార్యను చెట్టు క్రింద పడుకోబెట్టి (సేటు కాకపోవచ్చు) సెప్పకుండా పారిపోయే రోజులు వచ్చాయంటున్నారు. ఇక చివరిది మరీ నమ్మశక్యం కానంత అతిశయోక్తి కలిసినట్లు అనిపిస్తొంది. కలిగిన వారు ఎవరన్నా పిల్లల మీద దయదలచి వాళ్ళు వుండగనే పిల్లలు తినడం కోసం ఏమన్నా పెడితే వారు అటువెల్లగానే పిల్ల డొక్కలు చించి దానిని తీసుకుని పంచుకునే రోజులు వచ్చాయి అని పాటలో చెపుతున్నారు. డొక్కల కరువు అనగానే ఈ జానపదులు డొక్కచించడం వంటి సమాసాల ప్రభావంతో పరిస్థితిని కొంచెం ఎక్కువ చేసి చూపాలనుకున్నారేమో.

దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. బ్రిటిషు ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై ఆనకట్టను ప్రతిపాదించారు. సరే ఆ తర్వాత కాటన్ దొర పుణ్యమా అని గోదావరి ఆనకట్ట నిర్మాణం అనేక వేల ఎకరాలు సాగులోకి రావడం. ఆధునిక పద్దతులు వ్యవసాయాన్ని తక్కువ నీళ్ళతో చేయగలగటం, పరిపాలనలోని ముందు చూపుతో ఎగుమతి దిగుమతుల ఏర్పాట్లుం వుండటం లాంటివి. ఎలాంటి వ్యతిరేఖ వాతావరణంలోనూ కరువు అంత తీవ్రంగా ఏర్పడక పోవడం మనకి తెలుసు.
================================
ఏదేమైనా మనకు పాత అనుభవాలు చెపుతున్నది, మన సాధారణ అవగాహనకు అర్దం అయ్యేది ఏమిటంటే.మనిషి బ్రతకాలంటే ముందు తప్పని సరిగా ప్రాధమిక అవసరాలు తీరాలి. బంగారం వెంటి వంటి లోహాలకంటే , బహుళ అంతస్తుల మేడలకంటే ముందు తినడానికి ఇంత దొరకాలి.

కరోనా కష్ట కాలం ప్రపంచాన్ని గదిలో పెట్టి తాళం వేసినా సరే మనం మరింత జాగ్రత్తగా చూసుకోవలసిన కొన్ని రంగాలు వున్నాయి.

వైద్యం చేస్తూ చేస్తూ అలా చేసినందుకు తగిన రక్షణ పరికరాలు లేక వైద్య సిబ్బంది అనారోగ్యం పాలవ్వకూడదు. సమాజపు అనాదరణ వల్ల వారు నిరాసక్తతకు గురికాకూడదు. అలాగే ఇటువంటి వ్యతిరేఖ పరిస్థితుల్లో రక్షక భటులు పారిశుధ్య సిబ్బందిని జాగ్రత్తగా చూసుకునే భాద్యత సమాజానిదే.

రేపటి కష్టం రాకూడదు అంటే....
రైతును కాపాడుకోవాలి.

పండి చేతికి వచ్చిన పంటను తగిన రేటుతో కొనుగోలు చేయడం పాడవ్వకుండా నిల్వచేయడం, బ్లాక్ మార్కెట్ భయపెట్టకుండా రేపటి పంపిణీలకు ఏర్పాట్లు చేయడం వంటివి నిపుణుల ముందున్న సవాళ్ళు.

అదే విధంగా వైద్యులు తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలతో ( personal protection Equipme) తగిన సమయంలో తమ విధులు నిర్వహించడం ఎంత అవసరమో. వ్యాధికి గురికాని వాతావరణం ఏర్పాట్లతో రైతుకు పనిచేసుకునే వాతావరణం అందజేయటమూ అంతే అవసరం. ఆహార వ్యవసాయం ఇప్పుడు మొక్కల రూపంలోనూ పౌల్ట్రీ లాంటి పరిశ్రమల్లో జంతురూపం లోనూ సాగుతోంది.

నిజానికి పట్టణాలలో భవన నిర్మాణం లాంటి పనులు చేసుకునే అనేకమంది కూలీలు వారి వారి స్వంత గ్రామాలకు తిరిగి వెళ్లారు. వారు ఉపాధిని అక్కడే వెతుక్కుంటారు. వీరికి కూడా ఉపాది లేకపోతే వారి వారి కుటుంబాలు గడవటమూ కష్టమే. ఇటువంటి ఉపాదులు ప్రాధమిక రంగంలో ఏర్పాటయ్యేలా చూడగలిగితే. ఉత్పత్తులు ఆగిన ప్రపచానికి సమశీతోష్ణ మండలంలోని భారతదేశం ఆదుకునే ఆపన్న హస్తం కూడా కాగలుగుతుంది.

యుద్ద విద్యల్లో ఒక ముఖ్య సూత్రం చెపుతుంటారు.
ప్రస్తుతం వచ్చిన పంచ్ వరకూ డిఫెన్స్ చేసి ఊరుకుంటే చాలదు.
రాబోయే దెబ్బను ఊహించి ఎలా ఎదుర్కొవాలో ముందే ఆలోచించాలి.
మరింత ముందుకు వెళ్ళాలంటే థ్రెట్ ని ఆపర్చునిటీగా మార్చుకోవాలి.
విసిరే రాళ్ళనే పేర్చుకుంటూ ప్రహారీ నిర్మించుకోగలగాలి,.

ఆధారాలు

ఆండ్ర శేషగిరిరావు గారు తమ ‘ఆంధ్రభూమి’ సాహిత్య సామాజిక సాంస్కృతిక మాసపత్రికలో (1938 ఏప్రిల్‌ సంచికలో) ఈ కరువు గురించి వివరాలు

http://sobhanaachala.blogspot.com

https://www.researchgate.net/publication/330593945_Drought_and_Famine_in_India_1870-2016

https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-183356

Haribabu Maddukuri గారి వాల్ నుండి..వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం.. తుని దాటిందగ్గర్నుంచి పచ్చకార్పెట...
15/05/2022

Haribabu Maddukuri గారి వాల్ నుండి..

వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం.. తుని దాటిందగ్గర్నుంచి పచ్చకార్పెట్ కప్పినట్టున్న పొలాల మధ్యలోంచి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట లాంటి స్టేషన్లు దాటుకుంటా 4 గంటల జర్నీ తర్వాత రాజమండ్రి స్టేషనొస్తుంది..

"అప్పుడే రాజమండ్రి వొచ్చేశామా " అంటారెవరో అటుపక్క సీట్లో కూర్చున్న పెద్దాయన.. "ఆ.. అవునండీ" అని సమాధానమిస్తాడు పూతరేకులు అమ్ముకోడానికి వచ్చిన బక్కపలచని కుర్రాడు..

అప్పుడు మొదలవ్వుద్ది అందరిలో ఒకలాంటి హడావిడి..

అయిదు నిముషాలాగి తిరిగి ట్రైన్ స్టార్ట్అవ్వగానే..

రిజర్వేషన్ దొరక్క గుమ్మం దగ్గర మెట్ల దగ్గర కూర్చునోళ్లు ఎందుకైనా మంచిదని లోపలికొచ్చేస్తారు..
కుర్రోల్లాంటోళ్లు వాళ్ళు చేసుకుంటున్న చాటింగులాపేసి మెల్లగా గుమ్మం దగ్గర జేరతారు.. పెద్దోళ్ళులాంటోళ్ళు వాళ్ళ వెనకాల నిలబడతారు..
అప్పటిదాకా ఒక సౌండుతో ఊగుతూ వచ్చిన రైలు అప్పట్నుంచి మరో సౌండుతో దడదడలాడుతూ లోపల కూర్చునోళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది..

ట్రైనంతా నిశ్శబ్దమైపోద్ది..

అన్ని తలలు కిటికీలవైపు తిరుగుతాయి...

సీట్లో కూర్చున్న లేడీస్ నిద్రపోతున్న పిల్లల్ని లేపి మరీ కిటికీలోంచి చూపిస్తారు. అదే.. ..

"అదిగో చూడు.. గోదావరి.. గోదావరి.. బ్రిడ్జదిగో.. ఎంత పెద్దదో చూడు.. ఇదిగో, విండోలోంచి డబ్బులెయ్యి.." అని కనుచూపు మేరంతా నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నదిని కంపార్ట్మెంట్ కిటికీలోంచే సర్దుకుని చూపిస్తూ తనివితీరా మురిసిపోతారు...

ట్రైను బ్రిడ్జి మీద నడిచిన ఆ అయిదు నిముషాలు గుమ్మం దగ్గర నిల్చునోళ్లల్లో రకరకాల ఆలోచనలు..

కోట్లాదిమంది కడుపు నింపుతున్న గోదావరి మాతని కళ్లారా ఆస్వాదించి, కడుపు నిండా గోదారి గాలి పీల్చి, వీలైనన్ని సెల్ఫీలు తీస్కుని, ఘనంగా వెనక్కొచ్చి సీట్లలో కూర్చుని, కుర్రోళ్ళు డీపీలు మార్చుకున్నాక తృప్తిగా డిన్నర్ పార్సెల్ విప్పుతారు... @గోదావరి రివర్ అని...

ఆల్మోస్ట్ రాజమండ్రికి ట్రైన్లో వచ్చే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఇది.. ఫ్లయిట్లో వచ్చినా, ట్రైనెక్కి వచ్చినా, బస్సెక్కి వచ్చినా గోదావరినదిని, దాని చుట్టూ పులుముకున్న పచ్చదనాన్ని ఆస్వాదించకుండా ఉండటం కష్టం.. ఆ పచ్చదనం చూసినోళ్లు "గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా" అని కుళ్ళుకుంటారు.. చరిత్ర తెల్సినోళ్లు మాత్రం మనసులో కాటన్ దొరకి దణ్ణమెట్టుకుంటారు.. ఇవేమి తెలీని కుర్రోళ్ళు మాత్రం సెల్ఫీలు తీసుకుంటారు..

అలాంటి అపురూపాన్ని అందంగా అందించిన మహానుభావుడి పుట్టినరోజు ఈరోజు.. ఆయనే సర్ ఆర్ధర్ కాటన్ గారు.. ఎప్పుడో దోచుకెళ్లిన బ్రిటీషోళ్ళని అందరు బండబూతులు తిట్టుకుంటే ఒక్క కాటన్ దొరగార్ని మటుకు విగ్రహాలెట్టుకుని మరీ పూజిస్తారు మా గోదావరోళ్ళు.. 🙏🙏

సేవకు దేశానితో సంబంధం లేదని తెలిపిన మహనుభావులలో తెలుగువాళ్ల గొంతులు తడిపిన కాటన్ మహాశయుడు నిజంగా నాన్నలాంటివాడు..

ఇప్పుడంటే మా గోదావరోళ్ళం సంవత్సరానికి మూడు పంటలు పండించుకుంటా, ఏ ఏటికాయేడు భూముల రేట్లు పెంచుకుంటా, ఇలా ఎటకారాలాడుకుంటా గడిపేస్తన్నాంగానీ ఒక రెండొందలేళ్ళ ఎనక్కి వెళ్తే మాత్రం పరిస్థితులే వేరంటండీ..

ఇప్పుడు ఆంధ్రుల ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు కరువొస్తే ఆకలిచావులతోను, వర్షాలొస్తే పోటెత్తే వరదలతోనూ అపార ప్రాణనష్టం మిగులుస్తూ ఆఖరికి పసిపిల్లల్ని కూడా అమ్ముకునే స్థాయిలో కరువు తాండవించేదంట.. ఎందుకంటే, ఎక్కడో నాసిక్లో పుట్టి అందర్నీ పలకరిస్తా, ఎవరెవరి భారాల్నో బాధ్యతగా మోసుకుంటా 1600 కిమీ పాటు ప్రవహించొచ్చిన గోదారమ్మ పాపికొండల మధ్యలో రెండు తాడి చెట్లంత లోతుండే ఉగ్రగోదావరిగా రూపాంతరం చెంది, అదే స్పీడ్తో అంతర్వేది దగ్గర ఆవేశంగా సముద్రంతో మమేకమయ్యేది తప్పించి ఏ రకంగానూ ఆ వృధాజలాలు ఉపయోగపడేవి కావంట..

అలాంటి ప్రాంతానికి, విధినిర్వహణలో భాగంగా ఇంగ్లాండునించి వచ్చి, నరమానవుడు నడవటానికి కూడా ఆలోచించలేని ఏరియాల్లో గుర్రమేసుకుని కలతిరుగుతా, ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి రిపోర్ట్ తయారుచేసేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడంట ఈ పుణ్యాత్ముడు..

"ఒక్కరోజు సముద్రంలో కలుస్తున్న గోదావరి ప్రవాహం, సంవత్సరమంతా మన లండన్లో ప్రవహిస్తున్న థేమ్స్ నదితో సమానం" అని అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో పోట్లాడి ఒప్పించిన మహాత్ముడు..

ఎన్నోసార్లు ఎన్నో కమీషన్ల ముందు నించుని, పెర్ఫెక్ట్ ఇర్రిగేషన్ ప్లానింగుతో, సరిగ్గా నాలుగేళ్లలో, మూడున్నర కిలోమీటర్ల పొడవుతో, 175 గేట్లతో ధవళేశ్వరం బేరేజ్ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడుజేసుకుని మరీ నిర్మించి "నా పేరు జెప్పుకోకుండానే కడుపు నింపుకుని పండగ జేసుకొండోరేయ్" అని అక్షయపాత్రలా దానమిచ్చేసేడు.. ఈ డీటెయిల్స్ అన్ని ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియంకి వెళ్తే చూడొచ్చు.. ఆరోజుల్లో ఆయన ప్లానింగు, వాడిన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతాం..

ఇదంతా జరిగి అక్షరాలా నూట అరవై అయిదు సంవత్సరాలు పైనే అవుతోంది. కానీ, ఇప్పటికీ మీరెవరైనా మా గోదారి సైడొస్తే ఈయన గురించి చెప్తూ "కాటన్ దొరగారు" అంటాం తప్పించి "కాటన్" అని ఏకవచనం కూడా వాడమండీ.. బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలేటప్పుడే కాదు.. గోదావరికి పుష్కరాలొచ్చినప్పుడు కొంతమందైతే కాటన్ దొరగారికి తర్పణాలు కూడా వొదుల్తారు.. అదీ.. ఆయనగారంటే మావాళ్ళకున్న అభిమానం..

కాటన్ గార్ని తలచుకోగానే కళ్ళముందు మెదిలేది గుర్రం మీద ఠీవిగా కూర్చున్న ఆయన నిండైన విగ్రహం.. ఆయన పేరుకు ముందు ఉండాల్సిన "అపరభగీరధుడు" అన్న బిరుదు....
అఖండ గోదావరి మాతకి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి గౌతమి, వశిష్ట అనే రెండు అందమైన కన్య గోదావరులుగా మార్చి తూర్పుగోదావరికొకటి, పశ్చిమగోదావరికోటి ఇచ్చి పెళ్లిళ్లు చేసి, పచ్చని భూములతో పాటు సిరిసంపదల పుట్టుకకు కారణమైనోడు దేవుడు కాక ఇంకేమవుతాడు?? 🙏🙏

పైగా ఇప్పుడు ఏదైనా పూర్తి చెయ్యడానికి "మీ బాధ్యతంటే మీ బాధ్యతని" దెబ్బలాడుకుంటున్న మనమే ఎన్నుకున్న ప్రభుత్వాలకంటే.. రెండొందల ఏళ్ళ ముందే మనతో ఏం సంబంధం లేకపోయినా వృధాగా పోతున్న గోదావరిని డెల్టాలుగా, తెలుగు రాష్ట్రాలకి ధాన్యాగారాలుగా మార్చి, ఎన్నో కడుపులు నిండటానికి కారణమైన వారిని దేవుడితో పోల్చడం తప్పేమిటి... 🙏🙏🙏

కాటన్ దొరగారికి నమస్సులు మరియు జన్మదిన శుభాకాంక్షలు..🌹🌹

అపర భగీరధుడు సర్అర్ధర్ కాటన్ జయంతి శుభాకాంక్షలు💐💐💐🙏🙏🙏ఆనాడు 1832 -33 భయంకరమైన కరువు కాటకాలు కోస్తాజిల్లాల్ని గడగడలాడించాయ...
15/05/2021

అపర భగీరధుడు సర్అర్ధర్ కాటన్ జయంతి శుభాకాంక్షలు💐💐💐🙏🙏🙏
ఆనాడు 1832 -33 భయంకరమైన కరువు కాటకాలు కోస్తాజిల్లాల్ని గడగడలాడించాయ్.ఈ ధారుణపరిస్థితుల నుంచి తేరుకోకముందే 1835 -1836 నుంచి 1837 -39,1840-41 సంవత్సరాలల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయ్.పంటలు వేసినా పండేవి కావు.ఆకలి మరణాలతో జనాభా తగ్గిపోయింది,రెవెన్యు తగ్గిపోయింది.వీటి పరిష్కారానికి ఓ తెలివిగల మానవతావాది కావాలి.ఒకేఒక్కడు సర్ అర్ధర్ కాటన్ వల్లే ఇది సాధ్యమవుతుందని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది.
🏇అప్పుడు దేవుడిలా కాటన్ దొర కోస్తా ప్రాంతానికి వచ్చాడు.ధవళేశ్వరం బ్యారేజ్ ని నిర్మించాడు.
చావుబతుకుల నుంచి ఆప్రాంతాన్నికాపాడిన కాటన్ గురించి అపారమైన గౌరవంతో
పండితులు గోదావరిలో స్నానమాచరించేటప్పుడు
''నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం''
అని పఠించేవారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రతినిధిగా వచ్చిన కాటన్ దొర పాలకులు పక్షాన పనిచేయకుండా,పీడితుల సంక్షేమం కోసం పాటుపడ్డాడు కాబట్టే, ఈ మహానుభావుడు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు.
@కాటన్ మహానుభావుడికి జోహార్లు@

23/03/2021

కాటన్ దొర అంటున్నామే గానీ ఆయనకు సహకరించిన తొలి తెలుగు ఇంజనీర్ వీరన్న గారిని విస్మరిస్తే ఎలా.. ? కొన్ని విషయాలను గూగుల్ నుండి సేకరించాను

కింద మేటర్ చూసి సగం మందికి పైనే పూర్తిగా చదవను కూడా చదవరు ... కానీ ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఇది ...

మన గోదావరి జిల్లాల ప్రాంతాలు ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నాయంటే దానికి #ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కారణం మరి దానికి కారణం ఎవరు అంటే మనం టక్కున శ్రీ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ( #కాటన్_దొర ) గారు అని తడుముకోకుండా చెప్పేస్తాం. ఈ గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’ లా మార్చిన కాటన్‌దొర గారికి వెన్నెముకలా నిలిచిన ఇంజినీరు ఎవరు అంటే దాదాపు చాలా మందికి తెలియదు.

చరిత్ర ‘చీకట్ల’లో కలసిపోయిన ఆయన పేరే శ్రీ #వీణం_వీరన్న గారు ... ఎక్కడో బ్రిటిష్ వారు అయిన కాటన్ దొర కు తనది కాని ప్రాంతంలో, తన భాష కాని వాళ్లతో అంత పెద్ద నిర్మాణ పనిని తలకెత్తుకున్న ఆయనకు తలలో నాలుకలా నిలిచారు వీరన్న గారు ... కాటన్‌ దొర గారికి వీరన్న గారు సాయం రాకపోతే ధవళేశ్వరం ఆనకట్ట ఎప్పటికి పూర్తయ్యేదో అన్నది ప్రశ్నర్ధకం ...!!

శ్రీ వీణం వీరన్న గారు వీరరాఘవమ్మ, కొల్లయ్య దంపతులకు 1794, మార్చి 3న జన్మించారు... తండ్రి కొల్లయ్య మచిలీపట్టణంలో బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిగా చేసేవారు... దాంతో వీరన్న గారిని తల్లితోపాటు #రాజమండ్రిలో బంధువుల ఇంట్లో విడిచి ఉండేవారు... అలా వీరన్న గారి ప్రాథమిక విద్యను రాజమండ్రిలో పూర్తి చేసుకున్నారు. ధవళేశ్వరానికి చెందిన శ్రీమతి వెంకాయమ్మ గారితో వీరన్న గారికి వివాహమైంది. వారికి వెంకటరత్నం, జనార్దనస్వామి, కొల్లయ్య, సీతారామస్వామి, బాపమ్మలు సంతానం.

మచిలీపట్టణం ఆంగ్లోఇండియన్‌ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన వీరన్న గారు, తన తండ్రి సూచన మేరకు ఇంజినీరింగ్‌ చదివేందుకు బెంగాల్‌ వెళ్లారు. అప్పుడు ఆంగ్లేయుల ప్రధాన పాలన కేంద్రం కలకత్తా ... ఇంజినీరుగా ఆయన శిక్షణ మాత్రం మద్రాసులో సాగింది.

1840 నాటికి #రాజమండ్రి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే... 1844లో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన శ్రీ ఆర్థర్‌ కాటన్‌ గారితో #వీరన్న గారికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కాటన్‌ దొరకు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాటన్‌ దొర నివాస వ్యవహారాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి వీరన్న గారే చూసుకునేవారు. తనకంటే వయసులో పెద్దవాడైన వీరన్న గారిని కాటన్‌ దొర సోదర సమానుడిగా గౌరవించేవారు ....

ప్రయాణ సౌకర్యాలు అంతగాలేని ఆ కాలంలో... కాటన్‌ దొర తో పాటు గోదావరి తీరం వెంబడి కాలినడకన, గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను #వీరన్న గారు పర్యవేక్షించారు. రాజమండ్రి నుంచి అటు గోదావరి పుట్టే త్య్రంబకం., ఇటు సముద్రంలో కలిసే వరకు దాదాపు 1500 కిలోమీటర్ల ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో కాటన్‌ దొర విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో వీరన్న గారు ఆయన వెన్నంటి ఉన్నారు. భోజన సదుపాయాలు లేని మార్గాల్లో నెలల తరబడి ప్రయాణించిన వారిద్దరూ ... అరటి, మామిడి, జామపండ్లు తింటూ, గోదావరి నీళ్లు తాగుతూ ముందుకు సాగిపోయేవారు.

ఆనకట్ట నిర్మాణం సమయానికి తూర్పు- పశ్చిమ గోదావరి, #కృష్ణా_జిల్లాలు కలిసి రాజమండ్రి జిల్లాగా ఉండేవి. బ్రిటిష్‌ కాలంలో దేశాన్ని ఎన్నో కరవులు పీడించాయి. ఓ వైపు గోదావరి, కృష్ణా నదుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసేవి. మరోవైపు ప్రజలు కరవుల బారినపడి తీవ్ర ఇక్కట్ల పాలయ్యేవాళ్లు..
దానితో ఈ నదుల నీళ్లను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేలా చేయాలని సంకల్పించింది ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం. ఈ పనిని కాటన్‌ దొర గారిని నియమించింది... దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని కాటన్‌ గారితో కలిసి వీరన్న గారు మారుమూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల రైతులను చైతన్యపరిచారు.

ఆనకట్ట పనులు ప్రారంభమైన తొలినాళ్లలో గోదావరి జిల్లాల నుంచి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దానితో ఒడిశా, బెంగాల్‌ల నుంచి వందలమందిని ధవళేశ్వరానికి రప్పించారు. వీరన్న గారు వాళ్లకు కావాల్సిన శిక్షణ ఇస్తూ రోజువారీగా చెల్లించే కూలీ డబ్బుల్ని నిక్కచ్చిగా ఇచ్చేవారు . ఇది గ్రహించిన గోదావరి ప్రజలే కాకుండా కృష్ణా, గుంటూరు శ్రామికులు కూడా తమంత తాముగా ఆనకట్ట నిర్మాణానికి ముందుకువచ్చారు. వీరన్న గారు తన కుటుంబానికి ఉన్న పలుకుబడి పరిచయాలతో మన్యప్రాంతం కోయవారిని కూడా ఆనకట్ట పనులకు కూడగట్టారు. పనికి కొత్తయిన వాళ్లకు తగిన శిక్షణ ఇప్పించారు. కూలీలను ఉత్సాహపరిచేందుకు... పనిచేయని ఆదివారం కూలి సొమ్మును కూడా శనివారం సాయంత్రమే ఇచ్చేవాళ్లు. ఇది కూలీల్లో ఆనకట్ట నిర్మాణ అధికారులంటే విశ్వాసం పెరిగేలా చేసింది. వీరన్న గారు శ్రామికుల కోసం గోదావరి తీరాన నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ల ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి 1851 నాటికి పదివేల మందికి పైగా శ్రామికులను సమకూర్చి ఈ మహాయజ్ఞం పూర్తయ్యేలా చేశారాయన.

1848, 1851లలో ప్రభుత్వం నుంచి సొమ్ము రావటం ఆలస్యమైనా పనులు ఆగకుండా శ్రామికులను వీరన్న గారు ఉత్తేజపరిచారు. వారికి కూలీ సొమ్ము చెల్లించి అటు అధికారులు, ఇటు శ్రామికులు ఒకరికొకరు సహకరించుకునేలా చేశారు. అప్పట్లో గోదావరి తీరపు జమీందారుల్లో కొంతమంది అభివృద్ధి వ్యతిరేకులు ఉండేవాళ్లు. దానికితోడు ఆనకట్ట నిర్మాణానికి కంకణబద్ధులైన కాటన్ దొర, వీరన్న గారి పట్ల ఆంగ్లేయ ( బ్రిటిష్ ) అధికారులకు అసూయ ఏర్పడింది. దాంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవాళ్లు. వీటివల్ల ఒకానొక సందర్భంలో ఆనకట్ట నిర్మాణం ఆగిపోయిందనే వదంతులు కూడా వచ్చాయి. అలాంటి సమయంలోనూ వీరన్న గారు, కాటన్‌ దొరల మీద ఉన్న గౌరవం, విశ్వాసం శ్రామికులతో ఏ ఆటంకాలు లేకుండా పనిచేయించింది. ఇదంతా గమనించిన ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుని ఆనకట్ట నిర్మాణానికి కావాల్సిన డబ్బు, ముడిసరకులను ఎప్పట్లా సరఫరా చేసింది.

చివరికి 1852 మార్చి 31 నాటికి పని పూర్తయింది. ఆనకట్ట పూర్తయ్యాకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు వాడుకలోకి వచ్చాయి.

వీరన్న గారి సహకారం, కృషి, పట్టుదల, నిజాయతీ, అంకితభావం కారణంగానే తన కల నెరవేరిందని గ్రహించిన కాటన్‌ దొర ఆంగ్లంలో స్వదస్తూరితో ‘శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే, నేను అనుకున్నట్లుగా ఇంతవేగంగా గోదావరి ఆనకట్టను పూర్తిచేయలేక పోయేవాణ్ని’ అని రాసుకున్నారు. ఇంతేకాకుండా వీరన్న గారి శ్రమకు ప్రతిఫలంగా ... ఆయనకు ఇంకా ఏదైనా మేలు చేయాల్సిందిగా ఈస్టిండియా కంపెనీని, విక్టోరియా మహారాణిని అభ్యర్థించారు.

దాని ఫలితంగా కంపెనీ ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలుపరిచింది. అంతేకాదు ఆయనకు ‘ #రాయబహుదూర్‌’ బిరుదునిచ్చి సత్కరించింది... ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక పర్యాయాలు కాటన్‌ దొర అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా, లండన్‌లకు నెలల తరబడి వెళ్లేవారు. అయినా వీరన్న గారు కూలీలను సమన్వయపరుస్తూ నిర్మాణ పనులు సమర్థంగా నిర్వహించారు. నిర్మాణ సమయంలోనూ, అనంతరం కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరదలు వచ్చి... చిన్నాపెద్ద ప్రమాదాలు వచ్చి పడినా సకాలంలో ప్రభుత్వం ఆనకట్టకు తగిన మరమ్మతులు చేపట్టేలా చేశారాయన.

1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన నాటినుంచి 1867లో మరణించేవరకు ధవళేశ్వరం హెడ్‌లాక్‌ క్వార్టర్సే వీరన్న గారి చిరునామాగా ఉంది. ఆయన కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్‌లాక్‌ ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపి అస్తికలను గోదావరిలో నిమజ్జనం చేశారు. అంతేకాదు ఆయనను దహనం చేసిన ప్రాంతంలో ఉన్న రాతిగోడ మీద వీరన్న గారి పేరును ఆంగ్లంలో '‘వి.వీరన్న ,., రాయ్‌బహుదూర్,, సబ్‌ఇంజినీర్, 1867’ అని చెక్కించారు అప్పటి ఆనకట్ట ఉద్యోగులు. ఇప్పుడు ఆ ప్రదేశం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. 1940లో బులుసు సాంబమూర్తి కాటన్‌ దొర విగ్రహం దగ్గరే వీరన్న గారి వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చెక్కించారు.

1986లో వచ్చిన వరదలో కాటన్‌ దొర విగ్రహంతోపాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన ‘కాటన్‌ మ్యూజియం’లో వీరన్న గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడది మసకబారిపోయింది. తనకెంతో సాయమందించిన వీరన్న గారిని కాటన్‌ దొర మరచిపోలేదు. కానీ మనం మర్చిపోయాం.

ఇలాంటి మహానుభావుల గురించి చెప్పుకోవడం ఎంతో అదృష్టం ., అయితే భావి తరాలకు ఇలాంటి గొప్ప వారి గురించి తెలిసేలా ప్రభుత్వాలు ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి ., ఆయన జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.

అన్నం పెట్టిన మనిషిని గౌరవించడమంటే .... మనల్ని మనం గౌరవించుకోవడమే కదండి 🙏🙏

22/12/2020

Crowd funding movie

Respected sir/MadamThis is Nagaraj Undramatla. Film Writer/Director.This message is to invite you for an opportunity to ...
30/11/2020

Respected sir/Madam
This is Nagaraj Undramatla.
Film Writer/Director.

This message is to invite you for an opportunity to be a part of our Upcoming project- A periodic Film based on the Life and History of SIR ARTHUR COTTON ,a great Humanitarian, Engineer, Mass leader, who built a dam against the wishes of British Rulers in Andra Pradesh about 170 years ago.

We have been researching about him for the past 6 years. Numerous statues and a Museum were build for him all around the region of Andra Pradesh for his contribution and his character.
We have comeup with a commercial story which we worked for many years that is being liked by many industry veterans and fellow industry friends.

Having said this, we need your support to bring this Pan India film into reality as we need Freedom to make this film without any changes in the script which is not possible with regular producers. So, we have finally opted out to crowd fund the film.

The initial response is amazing with our friends and others joining us on this journey.
Many of them have
Invested their part and became a part of this project.
Hearltful Thanks for all those who joined us till now.

We are wishing more friends and well wishers would come and join us.

Having worked with some of the best directors and technicians in Tollywood for the past few years,I believe i can deliver a magum opus.

Join us and Let's make an amazing film that lasts in the history.

For more details about this project reach us on the contact details given below.

Yours

NagaRaj Undramatla
Film writer/Director:
9390002312
-------------------------------------
Haneesh Undramatla.
Co-Producer:
9030404445
---------------------
Our office address:

H.NO:8-1-284
Plot No:521/6/6
OU colony Shaikpet near Manikonda, Hyderabad.
E-Mail:[email protected]
Email: [email protected]
FB: https://www.facebook.com/rajundramatla

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Sir Arthur cotton dora Biopic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share