06/07/2025
అమాయకత్వానికి .. కేర్ ఆఫ్ అడ్రెస్స్ కావొద్దు !
అప్పుల అప్పారావు !
బెట్టింగ్ , పేకాట , గంజాయి , డ్రగ్స్ , పొందు , విందు, మందు లాంటి జల్సాలకు బానిసలయ్యి ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్న సీరియల్ అప్పులగాళ్లు .. నేడు ఎక్కువయి పోయారు .
భూమి , వాహనం లాంటి ఆస్తుల కొనుగోలు.. వ్యాపారం లాంటి ఉత్పాదక వ్యయానికి అప్పులివ్వడానికి ఎలాగూ బ్యాంకు లున్నాయి .
తినితాగడానికి అప్పులు తీసుకొనే వారు దాన్ని తిరిగీ ఎలా కడుతారు ?
కట్టలేరు .
ఫామిలీ ని ముంచేస్తారు .
నమ్మి అప్పు ఇచ్చినందుకు మిమ్మల్ని కూడా
"పూర్వీకుల ఆస్తి వుంది కదా ? ఎక్కడికి పోతాడు ?" అని అనుకోవద్దు!
ఆ ఆస్తి పై ఇప్పటికే ఎంత అప్పు చేసాడో మీకు తెలుసా ?
చెబుతాడా ?
మీరేమైనా వడ్డీ వ్యాపారస్తుడా ?
అప్పు వసూలు చెయ్యడానికి మీ దగ్గర గూండాలు లేరు .
అప్పిచ్చారే.. చచ్చారే !
మొగమాటానికి పోయి అప్పు ఇస్తే .. మీరు నిండా మునగడం ఖాయం .
చివరకు మిగిలేది మనస్పర్థలు .
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మిన్న .
ఎవడైనా అప్పు అడిగితే.. వాడు ఎంత దగ్గరి స్నేహితుడైనా బంధువయినా మొగమాటం లేకుండా .. మొఖం పై కొట్టినట్టు " నేనేమైయినా బ్యాంకా? ఇవ్వను . చచ్చినా అప్పు ఇవ్వను " అని చెప్పేయండి .{ మీ దగ్గర డబ్బుంటే .. అవతలి వ్యక్తి కి నిజంగా అవసరం ఉంటే డబ్బు సాయం చెయ్యండి . అప్పు కాదు . తిరిగీ ఆశించకుండా ఇవ్వండి. సాయం వేరు . అప్పు వేరు . అప్పు ముప్పు . సాయం చేసేటప్పుడు ఆ వ్యక్తి అందుకు అర్హుడా? అని చూడండి . జల్సా రాయుళ్లకు బెట్టింగ్ బాబూ రావులకు సాయం చెయ్యొద్దు . }
అప్పు ఇవ్వను అని మీరు ఎంత గట్టిగా చెప్పాలంటే ... మళ్ళీ వాడు మీ దగ్గరికి రాకూడదు . మాట్లాడకూడదు .
పీడా వదిలిపోతుంది .
మొగమాటానికి వారసుడిలా .. " అయ్యో .. ఇప్పుడు డబ్బు లేదు అంటే " ... ఇలాంటి పేకాట పాపారావు లు తిరిగీ వస్తారు .
" ఎన్ని సార్లు లేదంటాము" అని మీరు ఎప్పుడో ఒక్క సారి డబ్బు ఇస్తారు .
ఆ డబ్బు తిరిగి రాదు .
పైగా ఆ వ్యక్తితో వైరం మిగులుతుంది .
ఫార్మాసురుల ముష్టి యాపారం !
ఇటీవల కార్పొరేట్ ఆసుపత్రుల మార్గదర్శకత్వం లో బెగ్గింగ్ ఎక్కువవుతోంది !
తస్మాత్ జాగ్రత్త !
మనం మనుషులం .
జాలి.. దయ.. మెండుగా ఉన్నవారం.
దీన్ని అడ్డుపెట్టుకొని కార్పొరేట్ ఆసుపత్రుల వారు గొరవ బెగ్గింగ్ కు పాలుపడుతున్నారు .
ఒక వ్యక్తికి ఆరోగ్యం దారుణంగా దెబ్బతిని ఉంటే .. "దీనికి జస్ట్ ఓకే కోటి ఖర్చు పెడితే నయం అయిపోతుంది" అని ఆ వ్యక్తి బంధువుల కు చెబుతారు . "అయ్యో మా దగ్గర అంత డబ్బులు లేవు!" అంటే సోషల్ మీడియా/ మీడియా ద్వారా డబ్బులు ఎలా అడుక్కోవాలో చెప్పడమే కాకుండా ఆ పని చేసి పెడుతారు .
జాలి గుండె కలిగిన మనం కష్టార్జితం దానం చేస్తే అది కాస్తా ఈ నక్కల పాలవుతుంది .
పోనీ ఆ వ్యక్తి బతికేది ఉందా అంటే లక్షల్లో ఒక పాలు అవకాశం .
పుట్టి మూడు నెలలు కానీ బిడ్డ కు గుండె ఆపరేషన్ లేదా అరుదయిన జెనెటిక్ డిసార్డర్ .
ఆ బిడ్డ ఒక వేళా బతికినా జీవిత కాల రోగి .
ఒక వ్యక్తి రేయి పగలు తెగతాగి కిడ్నీ లు పాడు చేసుకొంటే .. ఆరోగ్యవంతుడయిన వ్యక్తి పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కిడ్నీ కొట్టేయాలి . దాని కోసం జాలి గుండె అమాయక చక్రవర్తుల సాయం చెయ్యాలి . కిడ్నీ ఇచ్చినోడి ఆరోగ్యం ఏమయ్యి పోవాలి ? కిడ్నీ మార్చుకొంటే ఈ వ్యక్తి బతికేది ఎన్నాళ్లు ?
ఎవడెక్కడ చచ్చినా ఫార్మాసురుల వ్యాపారం దినదినాభివృద్ధి .
ఇదో సెంటిమెంటల్ గేమ్ !
బలి కావొద్దు !
ముష్టి మాఫియా !
ఆమధ్యలో వచ్చిన ఒక సినిమా లో బిక్షగాళ్లను చాలా సెంటిమెంటల్ గా చూపారు . చాలామంది జాలి గుండెలు కరిగిపోయాయి .
కఠోర నిజం ఏమిటంటే బిక్షగాళ్లలో తొంబై శాతం మాఫియా .
నాలుగు రోడ్ల కూడలి లో... కాలువంకర/ కన్ను వంకర ఉన్న ఒక బిడ్డ ను చూసి జాలి పడి బిక్షం వేస్తె ఎక్కడో ఆడుకొంటున్న అన్నెం పున్నెం తెలియని బిడ్డ కిడ్నప్ కు మీరు పరోక్షం కారణం అవుతారు .
ఆ పాపం... మిమ్మల్ని వదలదు .
నా జీవితం లో ఇప్పటి దాక ఒక్క పైసా కూడా ఏ బిచ్చగాడికీ వేయలేదు .
వేయను .
ముష్టి .. మహాపాపం !
మీకు తెలియదేమో . బిచ్చగాళ్లను చాలా సార్లు ప్రభుత్వాలు రెస్క్యూ హోమ్స్ తీసుకొని వెళితే.. అధికారులను .. బూతులు తిట్టి పారి పోయారు . బషీర్ బాగ్ కూడలి లో అడుక్కునే ఒక బిచ్చగాడు లక్షల్లో వడ్డీ వ్యాపారం చేస్తాడు . సరైన సమయానికి వడ్డీ కట్టకపోతే కాళ్ళు తీస్తాడు .
అదో మాఫియా సామ్రాజ్యం .
నిజంగా ఎవరైనా దయనీయ పరిస్థితుల్లో అడుక్కోవడానికి వెళితే ఆ ఏరియా బెగ్గింగ్ కింగ్ ఒప్పుకోడు.
ఇదో చీకటి ప్రపంచం .
గుర్తు పెట్టుకోండి .
మంచితనం అంటే అమాయకత్వం కాదు.
అపాత్ర దానం వద్దు .
"నమ్మించి మోసం చేస్తారా?" అని అమాయక మాటలొద్దు .
నమ్మితేనే కదా మోసం .
నమ్మడం మీ బలహీనత .
శుభోదయం !