08/04/2020
తక్షణ కర్తవ్యం ఏమిటి
ప్రభుత్వం ఏం చేయ్యాలి. ప్రజలు ఎలా ఉండాలి.
మరి మన ఇండియాలో పరిస్థితి ఏంటి....
మనది చిత్ర, విచిత్రమైన దేశం. ఇక్కడ ఏం చేయాలన్నా, ఏం జరగాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కష్ఠమే. కానీ కరోనా విషయంలో అందరూ ఏక తాటిపైకి వచ్చారు. ప్రభుత్వానికి సహకరించారు. లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.
మరి ప్రభుత్వ చర్యలు నిజంగా అనుకున్న స్థాయిలో ఉన్నాయా. అంటే ఎవరి భాష్యం వారు చెబుతున్నారు.
ఇజాలు పక్కన పెట్టి నిజాలు గుర్తించాల్సిన ప్రమాదకర పరిస్థితిలో మనం ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెయ్యాలి. 130 కోట్లకు పైగా ఉన్న దేశంలో, అందులోనూ ఆర్థిక పరంగా అంతంత మాత్రంగా ఉండే దేశంలో బహుజన ప్రయోజనకరమైన నిర్ణయాలు అవసరం.
లక్షా డెభ్బై వేల కోట్ల ప్యాకేజీ అంటూ కేంద్రం ప్రకటించింది. ఇది నిరుపేదలకు, ఉపాది కోల్పోయిన వారికోసమే అంటూ ప్రకటించింది. నిజంగా అది నెరవేరుతుందా... అంటే మౌనమే సమాధానం.
వలస కార్మికులు ఎందుకు లక్షల సంఖ్యల్లో ఆందోళన బాట పట్టారు. వారికి ఇప్పటికైనా భరోసా కల్పించే విస్ఫష్ట ప్రకటన చేశారా.
మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో పప్పు బెల్లాలు, చిల్లర డబ్బుల పంపణీ పథకాల ప్రకటనలు ఎంతవరకూ మేలు చేస్తాయో ఏలికలే ఆలోచించుకోవాలి.
కేంద్రం ఇస్తామంటూ... ఇస్తున్నామంటూ చెబుతోన్న ఆర్ధిక సాయాలు నిజంగా ప్రయోజనకరమేనా. ఓ పక్క ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయంటూ బేల ప్రకటనలు చేస్తునే ఆదుకునేందుకు గొప్ప ప్యాకేజీలు ఇస్తున్నామంటూ చెప్పడం విరుద్ద స్టేట్ మెంట్లుగా అనిపించడం లేదా.
మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోన్న మధ్య తరగతి సుమారు 40 నుంచి 50 కోట్ల మంది ఉంటారు. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఉపాది కోల్పోయారు . ఉద్యోగ భద్రత, ఆర్ధిక భరోసాలు తర్వాత ముందు వారికి బతుకు భరోసా కల్పించేలా ప్రకటనైనా చేయ్యాలిగా... చేశారా..
అంతెందుకు ఈ.ఎం.ఐ. ల విషయంలో కేంద్రం గొప్పగా ప్రకటించిన వెసులుబాటు కనీసం ఉపయోగపడేదిగా ఉందా.
కష్టమైనా, కొంతమందికి నేరుగా ఇబ్బంది కలిగినా ఎక్కువమందికి ప్రయోజనకరమైన నిర్ణయాలు అవసరం.
ఓపక్క వైద్యం లేని జబ్బు వచ్చింది. ఉపసమన మార్గాలే తప్ప పూర్తి వైద్యం లేదనేది తేట తెల్లమైంది. కనీసం ఆ ఉపసమన మార్గాలైనే అందరికీ అందేలా చూడాలి. అందుబాటులో ఉన్న ప్రతి పైసాను అత్యవసర వైద్య సదుపాయాలపైనే వెచ్చించాలి.
కరోనా కనిపించిన నాటి నుంచి నేటి వరకూ ఎక్కడెక్కడ ఎలాంటి వైద్య సదుపాయాల్ని కల్పించారు, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఐసీయూలు ఎన్ని, ఎన్నింటిని పెంచారు, ఏఏ రాష్ట్రాల్లో సహాయక చర్యలు బాగున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న వైద్య సదుపాయాల్లో మెరుగౌతున్న పరిస్థితుల వివరాలు ఎక్కడ. వాటి లెక్కలేంటి. ఇవి అవసరం.
చేసే ప్రతి ప్రయోజనకర పనిని ప్రజలకు ప్రధాని బహిర్గతం చెయ్యాలి. ఎందుకంటే యావత్ భారతావని అతనిపై భరోసా ఉంచింది. ఆయన చెప్పే ప్రతి మాటలో విలువతో పాటు భరోసా దాగి ఉంటుంది.
చిన్న ఉదాహరణ.... యుద్ధ సమయంలో రాజుగారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి... ఎప్పుడు ఎక్కడ ఎలాంటి యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నది సైనికులకు తెలియకపోతే పరాజయమే ఎదరౌతుంది. ఇప్పుడు జరుగుతోన్న యుద్ధంలో మోదీ రాజు స్థానంలో ఉన్నాడు. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు ఆయన స్థాయిలోనే ప్రతి పౌరుడికి తెలియడం వల్ల కలిగే ప్రయోజనం చాలా పెద్దది.
ప్రజల బాధ్యత ఎంత... విపత్కర పరిస్థిలో ఎలా వ్యవహరించాలి.
దేశమంటే మట్టికాదోయ్. దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. నిజం. దేశం అంటే మ్యాపులో కనిపించే భారత చిత్రం కాదు. కోట్లాదిమంది ప్రజలు. ఇప్పుడు ప్రజలదే ఎక్కువ బాధ్యత. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రకటనను ఫాలో అవ్వాలి.
ప్రభుత్వం ప్రతి ఒక్కరి కడుపును నింపలేని పరిస్థితి. మన చుట్టూ ఆకలితో కేకలు వేసే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
ఆకలితీర్చే బాధను ప్రజలు పంచుకోగలిగితే....అవసరమైన వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వానికి సులువౌతుంది.
ఇజాలు, సిద్ధాంతాలు, పార్టీలు, జెండాలు, ఎజెండాలు, మూఢనమ్మకాలు, మూర్ఖపు ఆలోచనల్ని పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే వేరే మార్గం లేదు. బతకాలంటే. ఇంతకు మించిన మార్గం లేదు.
కొసమెరుపేంటంటే.... భరోసా కల్పించడంలో, తాను ప్రజలకు ఏమేమి చేస్తున్నానో చెప్పడంలో అందరికీ సరిగా కమ్యూనికేట్ చెయ్యగలుగుతున్నాడు కాబట్టే కేసీఆర్ ప్రెస్ మీట్లకు ఆంధ్రాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
నమస్కారాలు.
MNR.