09/10/2021
రఘురామ సెటైర్లతో జగన్ ఉక్కిరిబిక్కిరి
వైసీపీ రెబల్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా ముందుకు వచ్చారంటే.. జగన్ సర్కారు చెవులు రిక్కించి మరీ వినాల్సిన పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశాన్ని నిరసించిన రఘురామ.. ఆ తర్వాత జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా తనదైన శైలి విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా సినిమా ఆన్‌లైన్ టికెట్లు, మటన్ మార్టులంటూ జగన్ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాలపైనా రఘురామ తాజాగాసెటైర్ల వర్షం కురిపించారు. ఈ మేరకు గురువారం నాడు ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన రఘురామ.. జగన్ సర్కారు పరువును నిజంగానే బజారుకు ఈడ్చేశారు. ఒక్కొక్క అంశాన్నే ప్రస్తావిస్తూ సాగిన రఘురామ.. జగన్ సర్కారుకు ఊపిరి సలపకుండా చేశారనే చెప్పారు.
సినిమా టికెట్లతో మీకేం పని..?
సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని వస్తే.. ఏకంగా సినిమా ఇండస్ట్రీనే తన చెప్పు చేతల్లోకి తీసుకునేలా సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన రఘురామ.. జగన్ సర్కారుపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రఘురామ ఏమన్నారంటే.. ‘‘సినిమా టికెట్ల అమ్మకాలతో ప్రభుత్వానికేం పని? సినీ పరిశ్రమ, థియేటర్ల వ్యాపారంలో ప్రభుత్వ జోక్యం ఏమిటి? ఏపీ సినీ పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ద్వారా సినిమా టికెట్లు అమ్మడం సమంజసం కాదు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా ప్రభుత్వానికి వచ్చే డబ్బుకే ఏపీలో భద్రత లేదు. అలాంటప్పుడు సినిమా టికెట్ల ఆదాయానికి భద్రత ఏముంటుంది? వినోద పన్నులు చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎలాగూ ఉన్నప్పుడు, టికెట్లను ప్రభుత్వమే అమ్ముకోవడమేంటి? ఈ దిక్కుమాలిన విధానమేంటి? విచిత్రంగా ఉంది. సినిమాల గురించి ముఖ్యమంత్రికి ఏం తెలుసు? సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనం ఎంతవరకు సమంజసం? ఇంత జరుగుతున్నా సినీ పరిశ్రమ పెద్దలెవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదు. గతంలో ఘట్టమనేని కృష్ణ వంటి హీరోలు పట్టించుకునే వారు. ఇపుడు చిరంజీవి, మహేష్ బాబు, పవన్‌కల్యాణ్ కూడా పట్టించుకోకపోవడం న్యాయం కాదు. సినీ పరిశ్రమపై ఆధారపడుతున్న పవన్ కల్యాణ్ కూడా పట్టించుకోకపోతే ఎలా? ఇప్పటికైనా సినీ పరిశ్రమంతా ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలి’ అని రఘురామ పిలుపునిచ్చారు.