16/04/2024
ఆంధ్రప్రదేశ్ రాజకీయం- ఎన్నికల ఫలితాలపై ఒక అంచనా-విశ్లేషణ -1
=========================================
దీక్షితుల సుబ్రహ్మణ్యం, సీనియర్ జర్నలిస్ట్, రాజమహేంద్రవరం, ఫోన్ - 9440451836
======================================
రాష్ట్రంలో జగన్ ఒకవైపు, టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఇంకోవైపు, కాంగ్రెస్ మరోవైపు పోటీ చేస్తున్నాయి.
ఇది ప్రధానంగా ద్విముఖ పోటీ అవుతుంది. కానీ కాంగ్రెస్ లాక్కునే కొన్ని ఓట్లు ప్రబలంగా ఫలితాన్ని నిర్దేశించే అవకాశం కూడా కనిపిస్తోంది.
జగన్ అనుకూలత, జగన్ వ్యతిరేకత - బాబు అనుకూలత, బాబు వ్యతిరేకత ఈ రెండే ఎన్నికల్ని నిర్దేశించే అసలు అంశాలు. మిగతావి ఎన్ని ఉన్నా అవి ఉపాంశాలే.
చంద్రబాబు నాయుడికి 2019 లో పరమ గడ్డు పరిస్థితుల్లో సుమారు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇవి ఈసారి ఇంతకంటే తగ్గిపోయే అవకాశం ఉందని YSRCP నమ్ముతోంది. కానీ అది జరగకపోవచ్చు. కాస్త పెరిగి 42 శాతం వచ్చినా రావచ్చని కొందరి అంచనా.
YSRCP అంచనా ప్రకారం బాబు గ్రాఫ్ ఇంకా తగ్గిపోయి ఈ ఓట్లు పడిపోతాయని అనుకోవడానికి చాన్సు లేదు. జగన్ మీద అసంతృప్తి ఉన్నవాళ్ళకి ఎదురుగా కనిపించే ఏకైక ప్రత్యామ్నాయం బాబు కాబట్టి స్వతహాగానే ఓటు బ్యాంకు నిలబడుతుంది. అందులోనూ బాబుని అరెస్టు చేయడం ద్వారా గ్రాఫ్ ని కొంత జగన్ పెంచారు.
జగన్ గెలవాలంటే వైఎస్సార్సీపీ కి కిందటిసారికంటే తప్పకుండా ఈసారి ఎక్కువ ఓట్లు రావాలి. ఇదొక లెక్క. అయితే గత ఎన్నికల్లో వచ్చిన 50 శాతం ఓట్లు అత్యధికంగానే లెక్కేసుకోవాలి. కొన్నిసార్లు శాచ్యురేషన్ పాయింటు కూడా అనుకోవాలి. అయితే 50 శాతం ఓట్లు ఈసారి మళ్ళీ వస్తే జగన్ రారాజు అవుతాడు అనడంలో సందేహం లేదు.
ఇంకో లెక్క ప్రకారం చెప్పాలంటే.. గతంలో వచ్చిన ఓట్లు (సుమారు 50 శాతం) వస్తే జగన్ కి చాలు.
కానీ కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి, జనసేనకు పోయే ఓట్లు తమ ఖాతానుంచి కాకుండా వైఎస్సార్సీపీ చూసుకోవాలి. అలాగైతేనే 50 శాతం ఓట్లు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు రావడం సాధ్యం.
NDA కూటమి గెలవాలంటే అందులోని మూడు పార్టీలు టిడిపి, జనసేన, బిజెపిలకి కిందటిసారి వచ్చిన ఓట్లు యథాతథంగా వచ్చినా (మూడూ కలిపి సుమారు 49 శాతం) చాలు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు వైఎస్సార్సీపీ నుంచి వెళ్లడం వలన ఆమేరకు జగన్ ఓట్లు తగ్గుతాయి కాబట్టి.
కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 1.17 శాతం ఓట్లని సాధించింది. విభజన వ్యతిరేకత, నాయకత్వ లేమితో ఉన్న సమయంలో వచ్చిన ఓట్లు ఇవి. ఈసారి బలమైన నాయకత్వం (గతంలోకంటే) ఉంది కాబట్టి ఇంతకంటే పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం లేదు. అవి కూడా YSRCP ఓట్ల నుంచే కాంగ్రెస్ కి ఓట్ ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి కనీసం 3-5 శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉందని ఒక అంచనా.
2019 లో టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసాయి.
కిందటిసారితో పోలిస్తే ఈ నాలుగు పార్టీలు కూడా ఈసారి ఎంతో కొంత బలపడ్డాయి. ఈసారి ఈ పార్టీలకి కనీసం బూత్ కి ఓ పది ఓట్లయినా ఎక్కువ వస్తాయి తప్ప తక్కువ రావు అని ఒక అంచనా.
కిందటి ఎన్నికల్లో TDP ఓడిపోయిన దాదాపు 40 నియోజకవర్గాల్లో జనసేన, టిడిపి ఓట్లు కలిస్తే వైస్సార్సీపీ కంటే ఎక్కువ వచ్చాయి. అలాగే జనసేనం టిడిపి, బిజెపి ఓట్లు కలుపుకుంటే మూడు వంతుల సీట్లలో YSRCP కంటే ఎక్కువే వచ్చాయి.
అదే కూటమి ధైర్యం. ఓట్ ట్రాన్స్ ఫర్ పూర్తిగా జరగకపోయినా కూడా (అరవై శాతం జరిగినా కూడా) మెజారిటీ సీట్లలో గెలుస్తాం అనేది వారి ఆశాభావం.
అయితే జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం వరదలై పారిందని, అభివృద్ధి అద్భుతంగా జరిగిందని, సుపరిపాలన అందిందని, అవినీతి కుంభకోణాలు ఏవీ జరగలేదని జనం నమ్మితే గతంలో వచ్చిన 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. అలా నమ్మేవారి శాతం ఎంత ఉందన్నదానిని బట్టి ఇది డిసైడ్ అవుతుంది.
ఎన్నికల ఫలితాల్ని కమాండ్ చేసే అంశాలు
=======================
అధికార పార్టీ కాబట్టి వ్యతిరేక ఓటు సహజం.. అలా వైస్సార్సీపీ కి ఓట్లు తగ్గొచ్చు.
కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో NDA కూటమి అనే డబుల్ ఇంజిన్ సర్కారు నినాదం పనిచేస్తే కూటమికి సానుకూల ఫలితాలు రావచ్చు.
బిసి ఓటు బ్యాంకు ఎటు మొగ్గుతుందనే దానిని బట్టి, కాపుల మనోభావాన్ని బట్టి, ఎస్సీ ఓటు బ్యాంకు ఎవరిని ఆదరిస్తారనే దానిని బట్టి ఫలితాలు నిర్దేశించబడతాయి.
బీసీలలో అధికశాతం YSRCP వైపు ఉంటారని, కాపుల్లో అత్యధికం జనసేన వైపు (అంటే NDA కి) జై కొడతారని, ఎస్సీలలో ఎక్కువమంది టిడిపి, జనసేన లను ఎంచుకోవచ్చని అంచనా.
మైనారిటీలలో కూడా చీలిక కనిపిస్తోంది. క్రైస్తవ ఓట్లు అధికంగా వైఎస్సార్సీపీ కి వెళితే కొన్ని ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళుతాయి. ముస్లింల ఓట్లు ఎక్కువగా టిడిపి - వైసిపి మధ్య చీలుతాయి.
క్రితం ఎన్నికల్లో కాపులు, బిసిలు, ఎస్సీలు, మైనారిటీలు, క్షత్రియులు, బ్రాహ్మణులూ గంపగుత్తగా YSRCP కి ఓటు వేశారనేది ఈ సందర్భంగా గమనార్హమైన అంశం.
చంద్రబాబు హామీల్ని జనం ఎంతమేర విశ్వసిస్తారనేది ఓటింగ్ ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
సూపర్ సిక్స్ హామీల్ని చాలాముందు నుంచే జనంలోకి తీసుకెళ్లడం టిడిపి కి అనుకూలించే అంశం.
మహిళల ఓట్ల కోసం బాబు, జగన్, పవన్ గట్టిగా పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది.
NDA కూటమిలో ముగ్గురూ కలసి ఇంకా మేనిఫెస్టో ఇవ్వలేదు. వాటిలో ఉండే అంశాలు కూడా ప్రభావాన్ని చూపుతాయి.
జగన్ మేనిఫెస్టో పెట్టినా అది నామమాత్రమే. దానిని బట్టి ఓట్లు పెరగవు. జగన్ ఐదేళ్ల పనితీరుపై మార్కులుగానే ఓటింగ్ ఉంటుంది.
రాష్ట్రానికి రాజధాని లేకపోవడం YSRP కి ప్రధాన మైనస్ పాయింటు. అమరావతి రైతుల విషయంలో, కొన్ని కులాలను అణచివేయడంలో ఆయన శైలి ఇబ్బందిని కలిగించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో వైఫల్యం కూడా జగన్ కి మైనస్ మార్కులు వేస్తుంది.
భూముల తాకట్టు, ఇసుక, లిక్కర్, మైనింగ్ విధానాల్లో అవినీతిని జనంలో ఎక్కువమంది నమ్ముతున్నారు.
వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు YSRCP సాధించిన విజయాల్లో ప్రధానం. వీటివలన పనులు ఈజీ అయ్యాయని జనం భావిస్తున్నారు.
అయితే వలంటీర్ల వ్యవస్థని మరీ రాజకీయం చేసేయడం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోంది.
ప్రతి సంవత్సరం చెప్పిన ప్రకారం బటన్ నొక్కడం, కొన్ని పథకాల DBT నిధులు వేసేయడం జగన్ పై విశ్వసనీయతని పెంచాయి. అన్ని వర్గాలను కవర్ చేయడం ద్వారా సైలెంట్ ఓట్ పెంచుకున్నట్టు కనిపిస్తోంది.
ఒకే కుటుంబానికి ఐదారు పథకాలు అప్లై కావడం వలన మూడు నుంచి నాలుగు లక్షల లబ్ది కలిగింది.. కానీ వచ్చే ఓట్లు రెండు ముందే కావడం గమనార్హం. లబ్ధిదారులు వివిధ పథకాల్లో కామన్ గా ఉండడం వలన ఓట్ల పరంగా లబ్ది అనుకున్న స్థాయిలో చేకూరదు.
జగన్ పై వ్యతిరేకత పెద్దగా లేదు.. కానీ చాలామంది వైస్సార్సీపీ నాయకులపై ప్రజల వ్యతిరేకత జగన్ కి నష్టం తెచ్చే పరిస్థితి ఉంది.
(మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఇంకోభాగంలో)