11/02/2023
*ప్రశ్నలోంచిపుట్టిన ఆధునిక భావ పరంపర*
డా. రాయదుర్గం విజయలక్ష్మి
“పోనియ్! ఈ బ్రతుకు బ్రతికినదానికంటే చావడమే మేలు... ప్రాణం మీది తీపి వల్ల ఏదో ఒక పని చెయ్య డానికి నేను మనిషిని కాదుగదా...!” అంటూ మనిషిలో లేని ఏదో ఔన్నత్యాన్ని ప్రకృతిలో అన్వేషించే ప్రయ త్నం చేసిన మహా సాధకుడు గోపీచంద్.
తెలుగు సాహిత్యంలో నవ్యతా వీచికలు ప్రసరించిన, 1910 వ సంవత్సరం సెప్టెంబర్, 8 వ తేదీ వినాయక చవితినాడు జన్మించిన గోపీచంద్, జీవితాంతం సాహితీ అన్వేషణ సాగించిన మహా తపస్వి.
న్యాయవాదిగా జీవితంలో అడుగు పెట్టిన గోపీచంద్ సాహిత్య రంగంలో ప్రవేశించే నాటికి సమాజం ఎన్నో ఔన్నత్యాలతో, వైషమ్యాలతో, అధర్మాలతో నిండి ఉంది. ఈ నేపథ్యంలోనే, పరిష్కారాన్ని అన్వేషించే ప్రయత్నం ఆయన రచనల్లో కనిపిస్తుంది.
ఎమ్. ఎన్. రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో కొంతకాలం ఉన్నా, ఆయనలోని వ్యక్తి, సంకుచితమైన రాజకీయ రంగం కన్నా విశాలంగా పరిణతి పొందడంతో, ఆయన కలం నుండి ఎన్నో విభిన్న ఇతివృత్తాలు సాహిత్యంలో చోటుచేసుకున్నాయి. ఒకవైపు నవ్యమానవ, హేతువాదాలు, మరో వైపు ఠాగూరు, చెకోవ్, మపాసా వంటివారి రచనలు, వేరొకవైపు సినీ పరిశ్రమ, ఇంకొకవైపు ఆకాశవాణిలో ఉద్యోగం .... ఇన్నింటితో బాటు గోపీచంద్ లో సహజంగానున్న ఆలోచనాశీలత అన్నీ కలిసి, ఆయననొక సంపూర్ణ వ్యక్తిగా మలిచాయి. ఈ క్రమ పరిణామ మే ఆయన రచనల్లో కూడా కనిపిస్తుంది. కథకుడిగా, నవలా కారునిగా, వ్యాసకర్తగా, నాటికా రచయితగా ఏ ప్రక్రియను చేపట్టినా ఆ ప్రక్రియలో చక్కని ఇతివృత్తవైవిధ్యాలతో, జీవితాన్ని కాచి వడబోసిన మేధావి, సత్యాన్వేషి గోపీచంద్. అద్దంలో ప్రతిబింబాలు కనిపించినంత సహజంగా, సమాజం లోని మనుషుల్ని తన రచనల్లో ప్రతిబింబింప జేసిన వాడు. అందుకే గోపీచంద్ రచనలు, పాఠకుడుకి ఒక ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అనుభూతిని మిగల్చగలుగుతాయి.
అట్టడుగు జీవితాలనుండి, జీవితంలో భేషజాలదాకా, మనిషిని గూర్చి మాత్రమే గాక, నోరులేని జీవాల మనసుల దాకా మనల్ని ఆలోచింప జేసేలా చేయగలిగిన ప్రతిభాశీలి ఆయన. “ఎందుకు?” అన్న ప్రశ్నను నేర్పినందుకు, ‘అసమర్థుని జీవయాత్ర’ను తన తండ్రికి అంకితమిచ్చిన గోపీచంద్, ఎందుకు అని ప్రశ్నించడంతో ఆగిపోక, ఆ ‘ఎందుకు’ యొక్క కారణాల్ని అన్వేషించడం ప్రారంభించారు. అందుకే ఆయన తొలినాటి రచనాలకన్నా, మలినాటి రచనల్లో అంత పరిణతి!
అంతర్మథనం, మనిషిని నిగ్గుదేర్చి, ప్రకాశింపజేసే అద్భుతసాధనం. ‘నాలోనివాడు’ అన్న కథలో మనిషి లోని సంఘర్షణలకు అద్దంపట్టారు రచయిత. “ఈ ప్రపంచం ఒక బందిఖానా” అంటూ... జీవితంలోని సంఘర్షణ ననుభవిస్తూ, చివరికా సంఘర్షణ గొంతు నొక్కి ముందుకెళ్ళగానే, “ఓహ్! నాలో ఏదో పగిలి ముక్కలయింది, నాలోనివాడు మరణించాడా?” అని గుర్తించారు గోపీచంద్. ఈ కథే విస్తరిల్లి, రచయిత అంతర్ముఖత్వానికి ఫలితంగా “అసమర్థుని జీవయాత్ర” గా రూపు దిద్దుకుని, తెలుగు సాహితీ ప్రపంచానికి సీతారామారావును అందించింది. ప్రపంచాని కనుగుణంగా తాను మారలేక, ప్రపంచాన్ని తనకనుగుణంగా మార్చుకోలేక, తన మనస్సు లోని సంఘర్షణకొక సమన్వయ మార్గాన్ని కనుగొనలేక, ఆ సంఘర్షణ యొక్క రెండు రూపాలు తానే అయి, తన్ను తానే హత్యచేసుకున్నవాడు సీతారామారావు!
సీతారామారావు పాత్రతో ప్రారంభం అయిన ఈ ఆత్మధర్మాన్వేషణ, ఒక స్థితిలో సమాజ ధర్మాన్ని సయితం ధిక్కరించే స్థాయిలో, కొనసాగిందనవచ్చు. ఫలితంగా, ‘పిల్లతెమ్మెర’ లోని శమంతకమణి, జీవితంలో ఏ మార్గాన్ని నిర్దుష్టంగా, ఏర్పరచు కోలేక విఫలురాలుకాగా, ‘గడియపడని తలుపులు’ లోని కోటేశ్వరమ్మ స్వేచ్ఛాఫలితంగా లభ్యమైన ఒంటరితనంలో ఆనందాన్ని పొందలేక సాంప్రదాయికమైన జీవితంలోకే మళ్ళీ ప్రవేశించగా, ‘మెరపుల మరకలు’ లోని ఉషారాణి, ఆత్మధర్మాన్వేషణలో స్వేచ్ఛ జీవితానికి ముగింపుగా, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకుంది. వీరికి భిన్నంగా, జీవితంలో సంపూర్ణతకు ప్రతీకగా అంతర్ముఖత్వాన్ని సాధించి, కర్మయోగిని అయింది, ‘చీకటి గదులు’ లోని అరుంధతి.
వ్యష్టినుండి సమిష్టికి సాగిన, గోపీచంద్ జీవితాన్వేషణ, అతని రచనల్లో కనిపిస్తుంది. సీతారామారావు వ్యక్తిత్వ చిత్రణ పరిమిత పరిధి లో సాగగా, ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’లో జరిగిన భౌతిక, ఆధ్యాత్మిక వాద సమన్వయ మధనం ఫలితంగా, ‘చీకటి గదులు’ లోని గోపాలం, వ్యక్తిగా ఉన్నతశిఖరాలనధిరోహించ గలిగాడు.
'ప్రపంచంలో మమతలు పెంచుకోవలసిందే. కాని ఆ మమతలు జీవితాన్ని దుఃఖభూయిష్టం చేయకూడదు’అని నమ్మారు కనుకే, గోపీచంద్, చలం దర్శించలేని మరో చివరకు తన చూపులను నిగిడించ గలిగారు. “వంకటాచలం పాత్ర” అన్న కథలో, చలం సృష్టించిన అందమైన పాత్రలు, కలల్ని ఒదిలి, వాస్తవంలో జీవించ వలసివస్తే, ఆకలి ఇత్యాది ఈతిబాధలకు ఎలా స్పందిస్తాయోనని పరిశీలించాడు. ప్రతి మనిషికీ ఆలోచనను నేర్పించగలిగిన కథ ఇది!
ఆతనరచనల్లో నిరంతరాన్వేషణ చేయగలిగిన గోపీచంద్, ‘చీకటి గదులు’ నవలలో ఒకతరం నాటి సంపూర్ణ సమాజాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కాని ఆ నవల అసంపూర్ణ నవల గావడం, తెలుగువారి దురదృష్టం.
'మానవకోటి, విభిన్న దృక్కులతో ప్రయాణం చేస్తున్నా, సత్యం తెలుసుకోవాలనే కోర్కె కలిగిన నాడు, ఎక్కడో ఒకచోట కలవకపోదు. అంతా ఒక చోటకే చేరతారు, అంటూ, 'అందుకే జీవితంలో సమన్వయ పద్ధతి చాలా అవసరమ’నే సత్యాన్ని చాలాచోట్ల చాటారు గోపీచంద్.
తమ నవల, చీకటిగదుల్లో, రెండు విబ్భిన్న సిద్ధాంతాలకు మూల రూపాలైనవారు, కృష్ణస్వామి, శివకామయ్య గారు… వీరిని గురించి చెప్తూ, వీరిద్దరూ, ఒకే సిద్ధాంతం యొక్క రెండు రూపాలని, ఆ రెండు రూపాల సమన్వ యమే జీవితమని అంటారు రచయిత. “బాగానే అన్నావోయ్, కృష్ణస్వామీ!... నా దగ్గర బయలుదేరినవారు, నీ దగ్గరికి, నీ దగ్గర బయలు దేరినవాడు నా దగ్గరకు రావడమే ఈ ప్రపంచపు స్వభావం. ఈ అనంత ప్రయాణం స్వభావమే అది. మనిద్దరినీ చేరటంతో, ఈ భౌతిక లోకంలోని, ప్రయాణం ముగుస్తుంది. తరువాత వారి వారి స్వబుద్ధితో, ఇతర లోకాలలో పయనిస్తూ ఉంటారు” అని తన పాత్ర శివకామయ్య ద్వారా ఈ విషయాన్ని సూటిగా చెప్పించారు (పు.447), రచయిత.
మనస్సుని కల్మష రహితం చేసుకొని, బుద్ధిబలం, హేతువాదం మొదలైనవి, సృష్టించిన అవధులను అధిగమించి, యదార్థంతో తాదాత్మ్యం పొందటం అనేదే భక్తిభావం. ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువులతోను, అటువంటి తాదాత్మ్యాన్ని పొందగలిగిన స్థాయిని మానవుడు సంపాదించ గలిగినపుడే, ప్రపంచంలో నేడున్న విచ్ఛిన్నకర శక్తుల కల్లోలానికి నివృత్తి కలుతుందంటారు గోపీచంద్.
జీవితాన్వేషణే ఆయన ప్రతి రచనలోను కనిపిస్తుంది. తత్వవేత్తలు వ్రాసినా, పోస్టు చెయ్యని ఊఉత్తరాలయినా, వందలకొద్ది కథలయినా, పదులకొలది నవలలయినా, ఏ ప్రక్రియలోనైనా ఈ సత్యాన్వేషణను కొనసాగించి, నవంబర్, 2న, పందొమ్మిదివందల అరవై రెండులో, భౌతికంగా మనకు దూరమైనా, తన ప్రతి రచన ద్వారా మనలోనే జీవించి ఉన్న అమరుడు త్రిపురనేని గోపీచంద్.