29/06/2020
“ తడి యారని స్వప్నంలో తన మూలాల అస్థిత్వాన్ని వెదుక్కొంటున్న లోసారి సుధాకర్ “
“తడియారని స్వప్నం” కవి లోసారి సుధాకర్ కవితాంతరంగం ఈ వారం.
- కవి సంగమ సభ్యుల కోసం –
~
రాజారామ్ .
ఒక్కో జ్ఞాపకం వంద గాయాలై గుచ్చుకుంటే,,దుఃఖపు సుడి గుండాలలో ఇరుక్కున్నప్పుడు,కలల దోసిళ్లలో కాలం ప్రవాహమై జీవితాన్నినడిపినప్పుడు
కవిత్వం రాసే కవి లోసారి సుధాకర్.
“వాడు కాగితాల్ని కవిత్వాన్ని
నమ్ముకున్న వాడు
కలాల్ని హలాల్ని
పచ్చని పొలాల్ని
కలగంటున్న వాడు
అలుపెరుగని యోధుడు
ఒక్కోసారీ నీకు నాకే కాదు
ఎవరికి అర్థం కాడు”
ఎవరికీ అర్థం కానీ కవి కాదు ఇతడు.చూపు ముందుకు పెట్టి గతాన్ని కవిత్వం చేస్తాడు కాలాన్ని వెనక్కి నెట్టి మున్ముందును కవిత్వం చేస్తాడు ఇతడు.ఇతడు ఎవరంటే మైనపు బొమ్మలు సుధాకర్.పోలీసు శాఖలో ఉద్యోగి ఇతడు. మొగ్గల జడై ఊగాలనుకున్న పూలమ్మాయి కోరిక కమ్మని పరిమళాన్నితన గుండె తడి గుడ్డను కప్పి కవిత్వం చేసే కారుణ్యమున్న కవి సుధాకర్.
కారుణ్యముంది కాబట్టే కడప కోటిరెడ్డి సర్కిల్ లో రెండు చేతుల్లేని యాచకుని చేతిలోని పాత్రలో అతని ఆకలిని తీర్చే మెతుకుగా కవిత్వమయ్యాడు సుధాకర్.
కారుణ్యముంది కాబట్టే ఉదయాన్నే దినపత్రిక వేసే పేపర్ బాయ్ ని బతుకు వేటలో ఏకలవ్యున్ని,బాధ్యతలు మోయడంలో శ్రావణ కుమారున్ని చేశాడు.కారుణ్యం
ఉంది కాబట్టే కర్నూల్ జిల్లా దేవరగట్టలో బన్ని ఉత్సవంలో తొక్కిసలాటలో ఒక బాలుడు మరణించి నప్పుడు వెచ్చని కన్నీళ్ళ కవిత్వం బండరాళ్ళు కరిగేటట్టు రాశాడు. అందుకే లోసారి సుధాకర్ ని ఖాకీ చొక్క మాటున కారుణ్యపు గుండె వున్న కవి అంటాను నేను.
ఖాకీ చొక్క కింద వున్న క్రౌర్యాన్ని కూడా కారుణ్యంగా కవిత్వం మార్చగలదు అన్నదానికి మరో నిదర్శనం లోసారి సుధాకరే.దైనందిన చర్యలతో పాటూ తన ఉద్యోగ ధర్మాన్ని,విధుల్ని నిర్వవర్తిస్తూ,తన పంచేంద్రియాలు తన మాట వినని సమయాన కవిత్వాన్ని ఆరో ఇంద్రియంగా చేసుకొని లోసారి సుధాకర్ కన్నకవిత్వ కలనే ఈ “తడియారని స్వప్నం “.
తన ఊరి గుండె మంటల్ని,కండల్ని కరగించుకొని పంటలు పండించే సామాన్య రైతు బిడ్డల కడగండ్లని,పచ్చని కొమ్మలా వున్న ఊరు రెక్కలు తెగిన పక్షిలా మారడాన్ని,వాన లేని తనాన్ని,దగ్ధ నెలవంకల్ని,అంతర్ధానమవుతున్న మనిషిని,గాయాలతో గేయాలు పాడే వేణువుని అంతర్వేదనతో మనో నేత్రంలాంటి కవిత్వంలోకలగన్నాడు సుధాకర్. ఆ కలే ఈ ‘తడియారని స్వప్నం.’
“అన్నమూ- ఆకలి “ గురించి ఏ ప్రాంతపు కవైనా రాయోచ్చు.కానీ “పూటకో ఇంటి మనిషిని “ మింగేసే బకాసురుడిలా కమ్ముకున్న కరువును కరువు ప్రాంతపు కవే రాయగలడు.నేల దిగని వానలు ,అన్నం ముద్ద నోటి కందని పల్లెలు ,పొట్ట చేత పట్టుకొని పట్నాలకై వలసలు ఇవన్నీ అనంతపురం జిల్లా చిత్రపటంలోనిత్యం కనిపించే సత్యాలే.అనంతపురం జిల్లా కవి లోసారి సుధాకర్.సుధాకర్ కు తానెరిగిన పరిసరం తన జిల్లానే కాదు రాయల సీమ అంతా తెలుసు చిత్తూరుతప్పఉద్యోగరీత్యా.ఆయాప్రాంతాలలోనెలకొన్నపరిస్థితులకుస్పందించి“తనఆశయాలను,ఆదర్శాలను,ఆక్రోశాలను,కలలను,జీవన సమరంలోని ఎగుడు దిగుళ్ళను కవిత్వం చేశాడు.
మగ దురహాంకారాన్ని వదిలేసి స్త్రీ సహానుభూతి కవిత్వం రాస్తాడు.ఆ సహానుభూతిలోంచి జారిన కవితే “సగ జీవనం”.
“ నా సగ జీవనమా
నా జీవన సంగీతమా
నా నుంచి నీవు
నీ నుంచి నేను
విడగొట్టుకున్నప్పుడు
విడిపోయినప్పుడు
కన్నీటి చుక్కైనా
రాల్చలేదనే కదా అన్నావు”
భావ సారూప్యత లేని ఇరువురు ఒకే చూరుకింద కాపురం సాగించలేక,ఎవరి మొండితనాన్ని వాళ్ళు సమర్థించుకొని తార్కింగా ఆత్మవంచన చేసుకొని సగ జీవన్నాన్ని కోరుకుంటున్న సందర్భాన్ని ఈ కవిత ఒక దీర్ఘ దుఃఖంతో ప్రస్తావిస్తుంది.
“ఇరువురిలో ఏ వొక్కరైనా
ఉబికివొచ్చే కన్నీటినీ ఆపకుండా
మొలకెత్తే ప్రేమను
గొంతునులమకుంటే
ఎంత బాగుణ్ణు
పచ్చని నులివెచ్చని
రెండు జీవితాలు
ఎడారులు కాకుండా
మిగులును కదా “
అనవసర అపోహలతో అర్థాంతరంగా సగ జీవనమైన కాపురాలలోని వేదనను చెప్పడమే కాదు ఇంకా కొన్ని వాక్యాల్లో సుధాకర్ ఇలా చెబుతాడు.
“ఓ నా సహచరీ
మరో జన్మలో మనం
రెండూ దేహాలుగా గాక
ఒకే ఊపిరిగా మొలకెత్తుదాం “
ఇక్కడ మరో జన్మ అంటే మరో జన్మలో అని కాదు కవి భావన.గడ్డ కట్టిన కన్నీటి పైన కాలం భారంగా దూరంగా మరెంతో జరిగిపోయింది.ఇప్పటికైనా మళ్ళీ తిరిగి మనిద్దరం కలసి కొత్త జన్మలా జీవిద్దాం అని చెప్పడం.స్త్రీపురుష సమానత్వం పట్ల
గొప్ప స్పృహ వుంది ఈ కవిలో.
“ప్రియ సఖీ
సదా నన్ను క్షమించుదువు గాక
సదా నన్ను ప్రేమింతువు గాక”
అని ముగింపు వాక్యాలతో వున్న కవిత “ఓ ఆదాము కథ “ అనేది. ప్రేమించలేని సఖుడు కాదిక్కడ క్షమించమని అడుగుతున్నది తన సఖిని “ బుద్ధి చాపల్యం మనస్సు చాంచల్యం ఏదో కలిగి పోగులుపోగులుగా చీలిన కాలంలో రంగుదారుల వెంట” పరుగెడుతున్న సఖుడు . ఆదాము అవ్వ లను ప్రతీకలు చేసి ఇప్పటి వాళ్ళ జీవనంలో ఏర్పడే ఏదో ఒక సంఘటన కారణంగా ఏర్పడే పరిణామాలను పురుషుడి దృక్కోణంలో చిత్రించాడు.జ్ఞాన వృక్ష ఫలాన్ని తిన్న అవ్వ సైతాను ప్రలోభానికి గురయినట్టు ఇప్పుడు పురుషుడైన ఆదాము గీటురాళ్లను అతిలోక సౌందర్యాలుగా చూసి భ్రమిస్తూ చివర్లో స్త్రీ ప్రతీక అయిన అవ్వను క్షమించమని ప్రేమించమని ప్రార్థిస్తాడు.ఈ కవిత పురుషునిలోని బలహీనతను కవి బహిర్గత పరుస్తాడు.ఆదాము అవ్వ కథలో స్త్రీ అయిన అవ్వను ప్రలోభాలకు గురయిన దానికి చిత్రిస్తే ఈ కవి స్త్రీ కాదు ప్రలోభాలకు గురయ్యేది పురుషుడనే భావనను వ్యక్త పరిచాడు.స్త్రీ సానుకూల దృక్పథం వున్న కవి సుధాకర్.
తనలోని భావాల్ని మగ గొంతుకను వదిలేసి స్త్రీస్వరంలో ఉద్యోగ నిర్వహణలో తాను తన సహచరి సాంగత్యాన్ని కోల్పోతున్న క్రమంలో రాసిన కవిత “తడియారని స్వప్నం”.
“ఏ తెల్ల వారుజామునో
మెలుకువే లేని వేకువలో
వాగులు పాయలుగా
చీలినంత సులువుగా
పక్కకు తొలిగిపోయివుంటాడు
యశోధరను నిర్ధాక్షిణ్యంగా
వదిలి వెళ్ళిన గౌతముడిలా”
తన అంతరంగంలోని వ్యథను తన సహచరి పడిన వేదనగా చిత్రించాడు. విరహ వియోగం బుసకొట్టే సన్ని వేశాన్ని ,తన వేదనను పరివేదననుకాసింత కవిత్వం చిలకరించి సహచరిపై తనలోని ప్రేమను బహిర్గతం చేశాడు.
తన చుట్టు తిరిగే దుఃఖాన్ని,తాను దాని చుట్టు తిరుగుతూ తాను దాని కాళ్ళు పట్టుకొని,తాను దాని పాదాలు హత్తుకొని పొర్లిపొర్లి దుఃఖించే సన్నివేశాన్ని “భ్రమణం”లో చదివిన మన గుండె బరువెక్కేటట్లు రాయడమే కాదు ఒక ప్రవహించే అంతర్లీన దుఃఖాన్ని కావ్యమంతా పరిచాడు.
“తడియారని తాపంతో
నను నిలువెల్లా ముద్దాడతావనుకుంటాను
కానీ… నీవు మగాడివని మాత్రమేనని
రుజువు చేస్తావు
నేను నీ ప్రశ్నలకు
రాయని సమాధాన పత్రమౌతాను
ఇక నీవు సమాధానపడవు
నేను కూడా ప్రశ్ననై ఉదయిస్తే తప్ప.”
పూలు లాంటి స్త్రీలు కూడా తిరగబడ్తారన్న స్పృహనిస్తాడు.సొంతింట్లోనే పరాయియైన స్త్రీ అంతరంగాన్ని ఆవేదన కూడిన తిరుగుబాటుతో చిత్రించిన కవిత ఇది. ఈ కవి రాసిన “అరుగు’ కవిత వీధి అరుగు మీద ఎముకల్నిపోగేసుకున్నట్లు కుప్పగా కూర్చున్న ఒక అవ్వను తన లోపల చూపుల్తో లోసారి సుధాకర్ మన శబ్దం నిశ్శబ్దమయ్యే శిల్పంతో గీస్తాడు.కదల లేని అవ్వను మెదలలేని అరుగును మన కళ్ళకు బొమ్మ చేసి చూపెడుతాడు.
“ఓ సాయంత్రం అవ్వలేదు
అరుగును ఒంటర్ని చేసి
చీకట్లోకి వెళ్ళిపోయింది
బహుశా సూర్యుణ్ణి
తోడుగా తీసుకెళ్ళింది కావచ్చు
అవ్వలేని అరుగు దిగులుగా కూర్చుంది “
సుధాకర్ కు దృశ్యాన్ని బొమ్మ కట్టించే శిల్పవిద్యే కాదు ఒక అంశాన్ని పోలిక చేస్తూ మరో అంశన్ని స్ఫురింప చేసే భావ చిత్రం కూడా గీయగలడు.
“కాలుతున్న కొవ్వొత్తి
కాలాన్ని లెక్కపెడుతుంది
ఆశలు ఆవిరైన మనిషి
కన్నీటి బొట్టై రాలుతున్నాడు “
కొవ్వొత్తి మండేటప్పుడు అది కరిగిపోవడమే కాదు కాలాన్ని కూడ కరగిస్తుంది.ఈ ప్రతీకతో ఆశలు ఆవిరైన మనిషిని కన్నీరు రాల్చే మనిషిని గుర్తుకు తెస్తాడు ఈ కవి.కొవ్వొత్తి మండేటప్పుడు అందులోంచి బొట్టుగా బొట్టుగా అందులోని మైనం కారుతుంది.అట్లాగే బాధల్తో మండే మనిషి కన్నీటిని బొట్లు బొట్లుగా కారుస్తాడు
ఒక అంశాన్ని అంటే కొవ్వొత్తిని గూర్చి చెబుతూ మనిషిని స్ఫురింప చేస్తూ మన ఊహలోకి ఒక భావ చిత్రాన్ని తెస్తాడు.
“అయ్యవారు “ అనే కవిత ఒక వస్తువును పాఠకుడి కళ్ళముందు నడిచే ఒక సజీవ దృశ్యంలా అక్షరాలతో పిక్చరైజ్ చేసే కవిత్వ కళకు ఉదాహరణగా చెప్పొచ్చు.
“ఆయన్ని చూసి గడియారం
కాలాన్ని సరి చూసుకొనేది
ఆయన వీధి వెంట నడిచి వెళుతుంటే
మా ఊరి రచ్చరుగు లేచి
చేతులెత్తి నమస్కరించేది “
ఇలా సాగే ఈ కవిత ఈ కవికి ఓనమాలు నేర్పిన గురువు మీద వున్న భక్తిని తెలుపడమే కాదు ఆనాడు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలే కాదు పల్లె వాసులకు బతుకు సూత్రాలు చెప్పేవాడని కూడా తెలుపుతుంది.
పోలీసు శాఖలో వున్న వారికి వేశ్యావృత్తిలో వున్నవారి పట్ల గౌరవ భావం వుండదు.కానీ పోలీసు ఉద్యోగి అయిన కవి వేశ్యావృత్తిలోకి నెట్టివేయబడుతున్న వారి గురించి ఏకంగా మైనపు బొమ్మలు అనే కావ్యమే రాశాడు.ఈ సంపుటిలో కూడా “దగ్ధనెలవంక” అనే గొప్ప పద్యం రాశాడు.ఆమె జీవితం ఓ మురికి సముద్రమని,కనిపించని కన్నీటి రంగులు ఎన్నో వున్నాయని .ఆమెలో అనుభవాల తుఫానులే కాదు చీకటి కోణాల్లో చిత్తడిగా తడిసిన గుండె కూడా వుంటుందని ఆలోచనాత్మకంగా ఇలా అంటాడు.కొన్ని మల్లె తీగల్ని,కొన్ని మందారపూలని అని అంటూ ఆ పూలు “ముఖం అరచేతిలో ముడుచుకొని మానం మోకాళ్ళ మధ్య” దాచుకొన్న వాళ్ళని చూసి గొప్ప బాధ తప్త హృదితో ఇలా అంటాడు.
“నలిగిన తెల్ల మల్లెల్లో
వెచ్చని ఎర్ర జీరలు
మౌనంగా దాగుంటాయి
ఎవరైనా మనసుతో
కరచాలనం చేస్తే తెలుస్తుంది
దుఃఖపు సుడి గుండాల లోతెంతో”
చూపుడువేలు లా సూర్యుడిలా వెలిగి నిఖార్సైన మనిషిలా జీవించిన తన నాయన గురించి చెప్పడమే కాదు అనంత రైతును కాదు కాదు యావత్ భారత రైతును తన నాయనలో ఈ కవి దర్శింప చేస్తాడు.
“పాతాళ గంగను పైకి
రప్పించే యత్నంలో
ఓడిన భగీరథుడు
అప్పుల భారతంలో చితికిపోయి
అమ్మ పుస్తెలు తాకట్టు పెట్టి
వ్యవసాయ జూదంలో ఓడిన ధర్మరాజు
మా నాయన “
“దాపుడు చీర “- అనేది తన అమ్మ దాచుకున్ననెమలి వన్నె చీరను గురించి చెప్పడమే కాదు తన నాన్న జ్ఞాపకాలతో కన్నీళ్ళై ప్రవహించే తన అమ్మ దుఃఖాన్ని కూడా చెబుతాడు సుధాకర్.ఈ సుధాకర్ లో “దుష్ట దుర్నీత దుర్మార్గుల్ని అంతమొందించ కొత్త సూర్యుళ్ళై”లేవమని చెప్పే ప్రబోధం కూడా వుంది. యువతని చైతన్య పరిచే ప్రపంచానికి సందేశం చేసే ఆలోచన వుంది.అక్షరాలని ఆయుధాలు చేయాలన్న ఆదర్శం వుంది.అరచేత్తో ఉదయించే సూర్యున్ని ఎంత కాలం ఆపుతావు మూర్ఖుడా అని అనే క్రోధం వుంది.
నేనూ – వేణువు” కవిత గురించి చెప్పకుండా ముగించడం ఒక అసంబద్దతేమో!
నేనూ వేణువూ రెండూ ఒక్కటే దేహమంతా గాయాలతో నేను గేయాలతో వేణువు
అని తనను తాను ఎట్లా తీర్చి దిద్దుకున్నాడో చెప్పే కవిత ఇది.
చూపు సూర్యుడై
గుచ్చుతుంది
మాట మంచు కత్తిలా
గుండెలో దిగింది
ఎర్రని నెత్తురు బదులు
వెచ్చని కన్నీరు కారింది
నిశ్శబ్దం మౌన శంఖమై
నిట్టూర్చింది
కళ్ళు మూసి
మనసుతో స్పర్శిస్తే
దేహమంతా గాయాలే
జీవితం వలె
ఇప్పుడు నేను వేణువు
రెండు ఒక్కటే
గాయాలతో గేయాలతో
సుధాకర్ కవిత్వాన్ని పట్టిచ్చే ఆత్మస్పర్శ వున్న కవిత కవిత.
కవిత్వాన్ని కాలక్షేపంగా చూడని వాడు,తన సహచరీ లేకపోతే మహా శూన్యంగా భావించే వాడు,నన్ను కాసేపు పక్షినవ్వనివ్వండి అనే కాంక్షను వ్యక్తపరుస్తున్న వాడు,అదృశ్యమవుతున్న తన వర్ణాన్ని ,మాయమవుతున్న ఊర్ని కవిత్వ చిత్ర పటంలో నిలిపిన వాడు,మనుషుల్లో మరణిస్తున్న మానవత్వాన్ని ప్రశ్నించే తత్వం వున్న వాడు ఎవరంటే లోసారి సుధాకరే.
ఆకలేసినప్పుడు పిడికెడన్నం కోసం దాహమేసినప్పుడు గుక్కెడు నీళ్ళ కోసం వెదికే వెతుకులాట ఎక్కువ కరువు జిల్లాల్లోనే.అధికంగా అనంతపురం జిల్లాలోనే.అందుకే ఈ అనంతపూర్ కవి సుధాకర్ తీవ్ర ధర్మాగ్రహ ఆవేశంతో ఇలా అంటున్నాడు.
“ఆకాశం గొడ్రాలా?
మేఘాల గర్భం దాల్చవేమి?
మా సీమలో కడకు కన్నీరైనా చెమర్చరేమీ? “
ప్రముఖ కవి శివారెడ్డి గారన్నట్లు ఈ కవి ఇంకా దేశ విదేశాల కవిత్వాన్ని అధ్యయనం చేయగలిగితే ఆ కాల మాన పరిస్థితుల్ని కవిత్వంతో సమన్వయం చేయగలిగితే భవిశ్యత్తులో ఒక మంచి కవిగా సుధాకర్ నిలిచిపోతాడు.
“సగ జీవనం “ అనే కవిత “అతీతం “ అనే కవిత దాదాపు ఒకే భావంతో నిర్మితమయినట్లు అనిపిస్తుంది.కొన్ని కవితలు మిగిలిన చిక్కటి కవితల ముందు పల్చబోయినట్లు అనిపిస్తాయి.ఏదమైనా ఈ కవితా సంపుటి “కాస్తంత ఆనందం –చెప్పలేని విషాదాన్ని ఇస్తుంది చదివితే.ఇక్కడ విషాదమంటే తన నేల సీమ పొందే దుఃఖమే.”తడియారని స్వప్నం”లో జీవితపు తడితో విహరించిన సుధాకర్ ని మనసారా అభినందిస్తూ.. వచ్చే వారం మరో కవి కవితాంత రంగంతో కలుద్దాం.