Kota_Articles

Kota_Articles Kota_Articles

26/01/2024

మా ఊరి జ్ఞాపకాలు:

మా ఊరు గుమ్మడవెల్లి. ఊరు చుట్టూ చూడచక్కని పచ్చని పంటపొలాలు. ఊరినడుమ ఊట బావులు, ఊరి చివరన చెలిమ భావి. ఊరి నట్టనడుమ రాములవారి గుడి, చిట్ట చివరణ ముత్యాలమ్మ గుడి, ఊరి మొదట పెద్ద బడి, ఊరి నడుమ చిన్న బడి, ఐక్యమత్యంతో మెలిగే ఊరి జనం, పండుగ సంబరాల కోలాహలం. నా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. జన్మనిచ్చిన తల్లి, పుట్టిన ఊరు ఎవరికైనా ప్రత్యేకమే. ఈ రెండూ ఎవరికైనా గొప్పవే. మనం పుట్టిన ఊరు, బాల్యం అంతా గడిపిన ఊరు, జ్ఞాపకాలు అన్నీ మనకు ప్రత్యేకమే అనడంలో సందేహం లేదు.

నా చదువు అంతా మా ఊరి పాఠశాలలోనే కొనసాగింది. నా చిన్నప్పటి కొన్ని జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి. ఏది ఏమైనా మన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు, సంఘటనలను నెమరు వేసుకోవడం, ఆనందించడం సహజం. ఇది భగవంతుడు మనకు అందించిన అద్భుతమైన జ్ఞాపకం. అందుకే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు. జన్మనిచ్చిన తల్లిని మనం మరచి పోలేము. అలాగే ఊరిని కూడా మరువలేము.

కనుమరుగౌతున్న ఆటలు:

మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని విషయాలు అదృశ్యం కావడం మరియు వాటి స్థానంలో కొత్తవి ఆవిష్కృతం కావడం సహజం.
ఆనాటి ఆటలు పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో ఆరోగ్యానికి మేలు చేసేవి. కాలం గడిచేకొద్దీ పాత ఆటలు అంతరించిపోయి వాటి స్థానంలో కొత్త కంప్యూటర్ సంబంధిత గేమ్స్ పిల్లలపై చెడు ప్రభావం చూపడం విచారకరం. ఇప్పటి తరానికి అప్పటి ఆటలు తెలియకపోవడం బాధాకరం.

ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.

* ఖాళీ అగ్గిపెట్టెలను చించి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.

* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది.

*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.

* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడుమూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,
ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.

ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.

* వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం
ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.

* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో ...ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి (మా శెట్టి కేదరీ) షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటల్లో చెప్పలేము అని అనుభవిస్తే గానీ తెలియదు.

* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.

* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.

* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.

* గుమ్మడవెల్లిలో ఎక్కడా లేనివిధంగా ప్రజల్లో ప్రేమ, ఆప్యాయతలు, సాయంత్రం వేళల్లో అందరూ ఇంటి ముందు కూర్చుని పలకరించుకుంటారు. బొడ్రాయి బజార్‌లో ఇప్పటికీ ఈ సంస్కృతి కొనసాగడం గర్వించదగ్గ విషయం.

* పక్కింటివారితోను, ఊరి జనాలతోను ప్రతిఒక్కరు స్నేహబందంగా మెలిగేవారు
ఈరోజుల్లో పక్కింటోడి పేరు తెల్వని మహానుభావులు ఎంతోమంది ఉన్నారు.
ఆ రోజుల్లో పక్కింటి ఆమె ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వాళ్ళు వచ్చి ఓదార్చే వాళ్ళు ఈ రోజుల్లో పక్కింటోడు ఉరి పెట్టుకున్న కాపాడే దిక్కులేదు, ఆ రోజులే బాగున్నాయి ..

* ఊరిలో ఒక నారాయరెడ్డి దొరకె టీవీ ఉండేది అప్పట్లో, తర్వాత క్రమేపి పోస్ట్ ఆఫీస్ సత్యనారాణ, రుద్ర మురళి, అమ్మగారింట్లో టీవీ వచ్చింది .
ఆదివారం ఒక సినిమా కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగాఉండేది మా మిత్ర బృందం, జనాలు కూడా నానా కష్టాలు పడేది అల సినిమా చూసి ఎంతగానో సంతోషించేది . కొందరైతే సినిమా చూసినపుడు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు: మాతృదేవోభవ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాధ పడనివారు ఏడవని వారు ఉండరు. అంత బాధాకరమైన సినిమా ఇప్పటికి చూడలేదు. అప్పటి సినిమాలు చూస్తుంటే ఆ పాత్రలో లీనమైయే స్వభావం ఉండేది కథకి (ఆ పాత్ర కి). అప్పటి సినిమాలకు ఖర్చు తక్కువ, కథ సారాంశం ఎక్కువ. ఇప్పటి సినిమాల్లో ఖర్చెక్కువ, కథ సారాంశం తక్కువ.
ఆదివారం సినిమా చూసిన మరుసటి రోజునుండి ఒక వారం రోజుల వరకు ఆ సినిమా ముచ్చట్లు మా మిత్ర బృందానికి.

మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసేది. ఇప్పుడు అందరిళ్ళలో టీవీలు రోజు సినిమాలు అయినా చూసే తీరిక లేదు .

* గుమ్మడవెల్లి లో ప్రజలు ప్రతి పండుగ చాలా ఘనంగా జరిపేవారు.
ముఖ్యమైనటువంటి పండుగలలో
* వినాయక చవితి అప్పట్లో దాబా సోమయ్య (అనబతుల సోమయ్య ) ఇంటి పక్కన స్టేజీమీద గణేషుడిని పెట్టి సాయంకాలం ప్రజలందరూ భక్తి శ్రద్దలతో, భజనలతో, VCD లతో సినిమాలు వేసేవారు అప్పుడు అక్కడ సినిమా చూడటం అంటే IMAX లో చూసినట్లే, గణేష్ నిమజ్జనం నాడు పిల్లలందరూ కేరింతలు, డాన్స్ లతో పవిత్రీకృతమైన భక్తితో ఆ దేవుడిని నిమజ్జనం మా ఊరి చెరువులో చేసేవాళ్ళం.

* శ్రీరామనవమి నాడు శ్రీరాముడి భక్తులైనటువంటి మాశెట్టి కేధరీ, రాధమ్మ, ఊరి నాయకులు తదితరులు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించేది.
శ్రీరామనవమికి రైతులు, ఎడ్లబండి ఉన్నవారు ఎడ్లని, బండిని ప్రశాంతగా, పరిశుభ్రతగా, పవిత్రీకృతంగా కడిగి కుంకుమ పసుపు లేదా ఇతరత్రమైన రంగులతో అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండి ఊరుచుట్టు తిప్పేవారు.లు ఎంతైనా ఆ రోజులు వేరు ఈ రోజుల్లో ఊరు చుట్టూ బెంజ్ కారులో తిరిగిన అంత ఆనందం రాదు .

* ఆరోజుల్లో సంవత్సరానికి ఒకసారి సాధనాసురులు వచ్చి వాళ్ళ ఆటని ప్రదర్శించేవారు ఆ ఆట ఒక పెద్ద మ్యాజిక్ షో లాగా ఉండేది ఊరు జనాలందరూ వచ్చి చూసి ఇది పెద్ద కనికట్టు మంత్రం అని గొప్పగా సాధనా సురుల ను పొగిడే ది.

అప్పటికిప్పటికీ ఊళ్ళో ఘనంగా జరుపుతున్న పీర్ల పండగ అంటే నాకు గమ్మత్తుగా అనిపించేది.

* సాయంకాలం గుండం చుట్టూ సరిగత్హు ఆట వింత వింత వేషాలతో గుండం చుట్టూ కట్టెలతో కాలుస్తూ డప్పు చప్పుళ్ళతో డాన్స్ వేసేవాళ్ళు ఆ సరిగత్హు చూడటానికి ఊరు జనం అర్ధరాత్రి వరకు చూసి ఆనందించేది. ఈ రోజుల్లో డాన్స్ వేసే ఓపిక లేకపోయే కూర్చొని చూసే తీరిక లేకపోయే.

* పీర్ల పండగ ఆఖరిరోజు బహు ప్రజ్ఞాశాలి, అనన్యప్రతిభ కలిగిన ఐతరాజు బుచ్చయ్య (కుక్కడం) బేతాళుడి వేషంతో అందరిని భయపెట్టేది,
నిజంగా చెప్పాలంటే అస్సలైన బేతాళుడు కూడా ఐతరాజు బుచ్చయ్య వేసిన వేషధారణ చూసి భయపడాల్సిందే.
అంత గంభీరంగా ఉండేది వేషం నోట్లో కత్తి ఒంటిమీద కోడి రక్తం చేతిలో వేపమండలు తాళ్లతో కట్టేసి పట్టిన ఆగని కోపంతో ముందుకు ఉరుకుతూ జనాలని బయపెట్టేవాడు జనాలందరూ తలుపు వేసుకొని కిటికీల నుండి చూసేవాళ్ళం. అంత గొప్ప నటుడు ఐతరాజు బుచ్చయ్య. బుచ్చయ్య చనిపోయిన వార్త అత్యంత బాధాకరమైన విషయం.

* పండుగలల్లో ఉట్ల పండగ కూడా గమ్ముతుగా ఉండేది ఉట్టికొట్టిన తర్వాత ఒక పైప్ భూమిలో పాతి దానికి రేగడి మట్టి మరియు కలబంద పూసి పైకి ఎక్కే వాళ్ళు యాదవులు అప్పుడు కింద ఉన్న వాళ్లంతా పైకి నీళ్లు చల్లేది పైకి ఎక్కకుండా కిందకి జారడానికి అప్పుడు గంటల తరబడి జనాలు కేరింతలు ఆ ఎంజాయ్ చెప్పలేము.

* ఇక పెద్ద పండుగలల్లో దసరా పండుగ నాడు బతుకమ్మ పేర్చటానికి తంగేడు పువ్వులు, టేకు పువ్వుతో బతుకమ్మ పేర్చి ఆడపడుచులు కొత్త బట్టలు ధరించి ఊరు చివరన చెరువు కట్ట కాడ బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో జరుపుకొనేది, అక్కడ ఊరు జనం అంత టపాకాయలు కాలుస్తూ దోస్తులందరం కట్టమీదే కలిసేవాళ్ళం అప్పుడు మొబైల్స్ లేవు వాట్సాప్ లేవు ఎప్పుడైనా దోస్తులందరం కలవాలంటే ఒక దసరా పండుగకు కట్టమీద కలిసే వాళ్ళు. మరుసటి రోజు దసరా పండుగ ఉండేది ఆ రోజు జమ్మి చెట్టు కొమ్మ తెచ్చి స్కూల్ ఆవరణలో పెట్టి రాజారామ్ శాస్త్రి గారితో (అయ్యగారు) అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత జమ్మి ఆకు కోసం జనాలందరూ ఎగబడి తీసుకునేది. తర్వాత జనాలందరూ పాలపిట్టను చూసేది ఊరి చివరన.

* ఇక కామునిపున్నమి (కోలాల పండుగ) ఇంటింటికి కోలాలు పట్టుకొనిపోయి రింగ్ రింగ్ బిళ్ళ రూపాయి దండ, దండ కాదురా దామెర మొగ్గ , మొగ్గా కాదు రో మోదుగు నీడ, నీడ కాదురా నిమ్మల బాయి, బాయి కాదురా బచ్చలికూర అనే పాట పాడితే ఇంటింటికి బియ్యం ఇచ్చే వాళ్ళు ఏదో ఒక సహాయం చేసేవారు , చివరిరోజున కోలలన్నీకలిపి కాముని బండ దగ్గర కాలేసేది మరుసటి రోజు హోలీ పండుగ ఉండేది దోస్తులందరు కలిసి, కోలలు ఆడే సందర్భంలో కాగడాలు తయారుచేసి నైట్ టైం లో కోలంకాలే కొట్టం కాలే మోడెమ్ ముత్తయ్య - - - కాలే అనే పాట పాడుతూ కాగడాలు తిప్పేవాళ్ళం ఆనాటి సంస్కృతి ఈనాడు జనాలకి గుర్తే లేకపోయే.

* ఈకాగడాలు తిప్పేవాళ్ళం దానికి చాల పెద్ద కథ ఉండే, మనం పేరే మర్చిపోయిన కథ గుర్తున్నదా ?

* ఎడ్లబండి చక్రాలలో నల్లని బండీఅందేం తో అందరికి పూసి ఎంతో ఆనందంతో అందరం కలిసి మంగలి నారాయణ భావికాడ స్థానం చేసేవాళ్ళం అల హోలీ పండుగ జరుపుకొనేది అది ఈనాటికి ఉన్నపటికీ అప్పట్లో ఉన్నంత ఆనందం లేదు.

* ప్రతి ఏటా ఒక్కసారి దృష్టశక్తులు ఊళ్లోకి రాకుండా ఊరు జనాల ఆరోగ్యాంగా ఉండడానికి బోనాల పండుగ అందరూ భక్తితో జరుపుకునేది ప్రతి ఒక్కరు ముత్యాలమ్మ గుడి దగ్గర కోడిని కోసుకొని వచ్చేది బోనం చెల్లించి. ఇంకా శివరాత్రి, ఉగాది, రాఖి , ఇలా అన్ని పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకొనేది.

* కులాల అతీతంగా కొన్ని పండగలు ఉండేవి యాదవులకు గంగదేవమ్మ పండుగ,
గౌడన్నలకు కాటమయ్య పండుగ,
sc కాలనీ వాళ్ళకి సవర్లచ్చమ్మ పండుగ,

* వనభోజనాలు నారాయణరెడ్డి దొర మామిడి తోటలో పద్మశాలీయులు అన్ని కుటుంబాలు కలిసి వనభోజనాలు గొప్పగా జరుపుకునేది అల అన్ని కులాల వాళ్ళు అనుకూల ప్రాంతాల్లో వనభోజనాలు జరుపుకునేది అది ఒక మంచి సంప్రదాయం అది ఈనాటికి కనుమరుగైనది అని చెప్పొచ్చు .
అప్పట్లో అన్ని కుటుంబాలు కలిసి తినేది ఇప్పుడు ఒక్క కుటుంబంలోనే కలిసి తినలేని అహంకారాలు పెరిగి తనకుతానే గొప్ప అనుకునే రోజులు వచ్చాయి ...

* అప్పుడప్పుడు సర్కస్ ఆటలు అందులో ట్యూబలైట్లు నమిలితినటం, భూమిలోపట జీవసమాధి అవ్వటం ఇలా ఎన్నో అద్భుతమైన విన్యాసాలతో ప్రదర్శనలు ఇచ్చేవారు ఈ రోజుల్లో అవి అంతరించాయి.

*రికార్డింగ్ డాన్సులు కూడా అంతరించాయనే చెప్పొచ్చు , బుర్ర కథలు, హరికథలు ఊరిలో అప్పటి బుర్రకథ కళాకారులూ
ముత్యం వెంకటయ్య,
దూదేకుల అంజయ్య,
దూదేకుల షర్బద్దిన్ తదితరులు ఉండేవారు.

* దొర గడీల పరదా సినిమాలు (లంకేశ్వరుడు, ఖైదీ, ఠింగురంగడు, ది జెంటిల్‌మన్ ) దోస్తులతో కలిసి చూసినపుడు మాలో ఆనందానికి అవధులు లేనట్లుండె అయిదు రూపాయలకి అంత మంచి సినిమా చూశామా అన్నట్లుండే,
ఇప్పుడు అయిదువందలు పెట్టిన అందులో అసలైన స్టోరీ లేకపాయె అస్సలైన ఫైట్స్ లేకపోయే..
అప్పటి పాటలు ఎంత అర్ధవంతంగా, వినసొంపుగా ఉండేవి.

* ఎండాకాలం ప్రతి ఏటా ఊరు చెరువులో ఊరిజనం చేపలు పట్టేవారు నీళ్లలో చేపలు పట్టే క్షణం అంతులేని ఆనందం ఏదో సముద్రంలో తిమింగలం పట్టినట్లు ఆనందం.

* ఆ రోజుల్లో బోరునీళ్ళు లేక ఊట బావిలాల్లో బకెట్ చేంతాడుతో చేదుకొని నీళ్లు వాడే వాళ్ళం దానివల్ల వ్యాయామం చేయవలిసిన పని లేకుండా, ఈ రోజుల్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ నీళ్ల ట్యాప్ ఒంటినిండా రోగాలు. మాకు దగ్గరలో తీగల వారి బావి ఉండే అదేమాకు దాహాన్ని తీర్చింది .. అత్యవసరాలకు, నిత్యావసరాలకు ఆ బావి నీరు వాడేవాళ్ళం..ఊరు లో అప్పట్లో తాగునీరు అందించే బావులు ఎలమంచిలి బావి, మెతుకు లచ్చమ్మ బావి, ఆంజనేయ గుడి బావి, చెరువు దగ్గర చెలిమ బావి, మోడెమ్ ఉప్పలయ్య ఇంటి దగ్గర షేర్ బావి, మేరోళ్ల బావి, బస్టాండ్ దగ్గర బోరింగ్ , ఎరుకల వారి బోరింగ్ అల చాలా ఉండేవి.

* అప్పట్లో ఊరి దగ్గర హాస్పిటల్ తక్కువ అయినప్పటికీ అత్యునత వైద్యసేవలంచినా ప్రముఖ వైద్యుడు స్వర్గీయ RMP DR. అడ్డ గట్ల ఆగయ్య, పెన్సిలిన్ మందు గురించి మొదటగా ఆయన దగ్గర విన్న నేను మా కుటుంబానికి వైద్యసేవలందించిన మహానుభావుడు. క్రమేపి బొలిశెట్టి బిక్షం, రవి డాక్టర్ ఇంకొంత మంది ఇప్పటికి వైద్య సేవలు అందిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

* అప్పట్లో పెళ్లి ఊరేగింపులు వాహనాలు లేవు వధూవరులను పల్లకిలో ఊరేగించేవారు ఆ పల్లకిని చాలా మంది స్వయంగా మోసేవారు. అదొక మధురమైన జ్ఞాపకం

అల చాలా వినోదకరమైన ఆటలతో ఉత్సహంతో ఉరకలేస్తూ నా బాల్యం గడిచింది .. మీరు కూడా మీ పిల్లలకి మీ బాల్యాన్ని వివరించి రాబోయే తరాలకు మన బాల్యాన్ని గుర్తుచేయగలని కోరుకుంటున్న

నేను చిన్న బడి లో చదివేటప్పుడు నా గురువులు
వరిపెల్లి యాకయ్య సార్ ,గోపయ్య సార్ , లక్ష్మయ్య సార్ , కృష్ణారెడ్డి సార్ , జగ్గయ్య సార్ ,
నాకు గుర్తున్న సార్ పేర్లు ఇవి , ఏమైనా మరిచిపోయింటే గుర్తు చేయగలరని కోరుకుంటున్నాను
వరిపెల్లి యాకయ్య సార్ చెప్పే పాటలు చాలా వినసొంపుగా ఉండేవి సార్ బోర్డు మీద గీసే బొమ్మలు చాలా అద్భుతంగా ఉండేవి సార్ గీసిన బొమ్మల సహాయంతో పిల్లలకి పాటలు అర్ధమవ్వటమే గాక మరిచిపోలేని స్థాయికి చేరుకునేది.
గోపయ్య సార్ పలకమీద పెట్టించిన అ, ఆ, . . దిద్దించి పైతరగతులకు పంపించిన మంచి గురువు .
చదువుతో పాటు ఆటలతో కూడా విద్యార్థులని ప్రోత్సహించారు.

అప్పుడున్న అటెండర్ ఐతరాజు హనుమంతు తులిశేరు బరిగెలు తెచ్చేది పిల్లలకు చదువు రాకపోతే కొట్టమని అప్పుడు అల కొట్టేది కాబట్టే హనుమంతు గుర్తుండు, మా భవిష్యత్తు కోసం బరిగెలు తెచ్చేది హనుమంతు.

బ్రేక్ టైం లో కొత్తగూడెం మల్లయ్య ఐస్క్రీమ్ అప్పుడప్పుడు తిని ఆనంద పడేవాళ్ళం , ఆ రోజుల్లో ఆ ఐస్ క్రీం తింటే ఆ ఆనందమే వేరు .

మధుర స్మృతులు:

అప్పట్లో మా ఊరికి (గుమ్మడవెల్లి) ఒకేఒక బస్సు వస్తుండేది. అది సూర్యాపేట నుండి రాత్రి 10.30 వచ్చి పొద్దున్నే 5.30 కి మళ్ళీ సూర్యాపేట కి వెళ్ళేది.
అప్పట్లో బస్సు లో ప్రయాణం అంటే అంతులేని ఆనందం ఇప్పట్లో విమానంలో ప్రయాణం చేసిన దొరకని ఆనందం అప్పట్లో దొరికేది ఇప్పట్లో అంత ఆనందం అనిపించటంలేదో అంతుచిక్కని రహస్యం..
ఎప్పుడైనా అమ్మనాన్న ఊరెళ్ళి వస్తున్నారంటే రాత్రి ఆ బస్సు ఎప్పుడొస్తుందో అని ఎదురుచూసేవాళ్ళం అమ్మనాన్న తెచ్చే అరటిపళ్లకోసం, అంగుర పళ్లకోసం అవి తిని ఎంతగానో ఆనందపడేవాళ్ళం.
ఆరోజుల్లో వారానికి ఒక సినిమా దూరదర్శన్ లో వచ్చేది.
ఆ సినిమా చూసి ఇంటికొచ్చాకా
ఒక గంటవరకూ ఆ సినిమా కబుర్లే.
మర్నాడు స్కూల్ లో కూడా...
ఆ ఆనందం ఇంకో పది రోజులుండేది..
ఆరోజుల్లో కొంతమంది ఇళ్లలోనే రేడియో ఉండేది.
ఆ రేడియో పాటల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సందర్భాలెన్నో..
అందులో పాటలు ఎలా వస్తాయో ఆశ్చర్యంగా..అమాయకంగా రేడియో ని తదేకంగా చూసి మురిసిపోయేవాళ్ళం. ఆదివారం నాడు రేడియో లో వచ్చే పాటల కోసం రేడియో ఉన్నవాళ్ళింట్లో కూర్చొని ఓపికగా వినేవాళ్ళం మనసు ప్రశాంతంగా ఉండేది.
మా ఇంట్లో కూడా రేడియో ఉంటె బాగుండు అనే ఆశ ఉండేది ..
ఇంటికి చుట్టాలొచ్చి వెళ్తో వెళ్తూ చేతిలో రూపాయో అర్ధరూపాయో పెడితే ఎంత ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే దుఃఖం తన్నుకు వచ్చేది..ఇంకా ఉంటే బాగుండు అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో.. ఇప్పుడు ఆనందం ఏమో గాని ఎప్పుడు పోతారా అన్నట్లుగా చూస్తున్నారు.
కోకాకోలా మూతలను రెండు రంద్రాలు చేసి బస్తా దారంతో ముఠాకు కట్టి గిరా గిర తిప్పుతూ ఎంతో ఆనందించేవాళ్ళము.
జాతరలో కొన్న బొమ్మలను చూసుకొని మురిసే ఆనందం
కోట్లు పెట్టిన కొనలేని ఆనందం.
అన్నంలో చింత చిగురు ఒట్టి చాపల కూర ఏమి రుచి...ఏమి ఆనందం కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయేవాళ్ళం.. ఈరోజుల్లో ఆ చింతచెట్లు అంతరించాయి.. ఆ కూరని మరిచారు ...
కాలక్షేపానికి లోటే లేదు. స్నేహితులు కబుర్లు, ఆటలు, ఈతకు పోయేవాళ్ళం ఆ ఆనందం వేరు సర్కస్ లు, దాగుడు మూతలు. చింత పిక్కలు, ముక్కు గిచ్చుడు, పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు.. ఎన్ని ఆటలో..

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ నెంబర్ : 093914 80475



మన గుమ్మడవెళ్లి
మన ఊరు మన ముచ్చట్లు
మన ఊరు

మన గుమ్మడవెళ్లిTelangana Prantha Padmashali SanghamSatyanarayana Rao Bonthuప్రపంచం మెచ్చిన ఆటగాడు "ఉసేన్ బోల్ట్".ప్రపంచం...
01/01/2024



మన గుమ్మడవెళ్లి
Telangana Prantha Padmashali Sangham
Satyanarayana Rao Bonthu

ప్రపంచం మెచ్చిన ఆటగాడు "ఉసేన్ బోల్ట్".

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్. ఓటమెరుగని ఆటగాడని పేరుగాంచిన యోధుడు. పరుగుల ఆటకు తిరుగులేని రారాజు అతనే "ఉసేన్ బోల్ట్". తన అలుపెరగని ప్రయత్నాలతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ఆటగాడు "ఉసేన్ బోల్ట్".

అతని ఆట అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. ఆయన ఆడే ప్రతి ఆట గెలుపే కానీ ఓటమి ఉండదని అభిమానుల ఆత్మవిశ్వాసం. వరుస విజయాలతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఏకైక ఆటగాడు ఉసేన్ బోల్ట్. ఒక గొప్ప క్రీడాకారుడి విజయాలను అభిమానులు సంబరాలు చేసుకోవడం సహజమే, కానీ అతని తొలి ఓటమిని కూడా సంబరాలు జరుపుకోవడం గొప్ప విషయం. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి, ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించాడు.

బోల్ట్ 21 ఆగస్టు 1986న జమైకాలోని షేర్‌వుడ్ కంటెంట్‌లో వెల్లెస్లీ బోల్ట్ మరియు జెన్నిఫర్ బోల్ట్‌లకు జన్మించాడు. 12 సంవత్సరాల వయస్సులో, ప్రాథమిక పాఠశాలలో, అతను పాఠశాల క్రీడల లో పాల్గొనడం ప్రారంభించాడు. అతని ప్రతిభను గమనించిన అతని తల్లిదండ్రులు తను ఆల్ టైమ్ గొప్ప క్రీడాకారుడు అవుతాడని అంచనా వేశారు. అతని చిన్నతనం నుండి, బోల్ట్ చదువు కంటే క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి నుంచి క్రీడల్లో రాణించాడు.బోల్ట్‌కు క్రికెట్ అంటే ఇష్టం.13 ఏళ్ల వయసులో ఒకసారి బోల్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని క్రికెట్ కోచ్ అతని పరుగును గమనించి అథ్లెటిక్స్‌లో గట్టిగా ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అతని ప్రోత్సాహం మేరకు అతను ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అలా ప్రతిరోజు పట్టుదలతో ప్రయత్నిస్తూ 16 సంవత్సరాల వయస్సులో, 2002లో, అతను ప్రపంచ జూనియర్ ఛాంపియన్ స్థాయికి ఎదిగారు. 2007 నాటికి, అతను చరిత్రలో అత్యంత వేగవంతమైన వ్యక్తి గా, అతని మొదటి 100m ప్రపంచ రికార్డు నెలకొల్పాడు మరియు ఒక సంవత్సరం తరువాత, బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడలలో, అతను అంతర్జాతీయ సూపర్ స్టార్‌డమ్‌కి ఎదిగాడు. చైనాలో, బోల్ట్ పురుషుల 100మీ స్ప్రింట్‌లో విజయం సాధించాడు, ఆపై 200మీ మరియు 4x100మీ టైటిల్‌ను జోడించి లెజెండరీ ట్రిపుల్‌ను సాధించాడు. మూడు ఈవెంట్లలో అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న బోల్ట్ అభిమానుల కోరిక మేరకు ఆఖరిసారి ఆటలో పాల్గొన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోయిన బోల్ట్ ఆట కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయన కాలు లిప్తకాలం జంకింది.

వరుస విజయాలతో అభిమానులను ఉర్రూతలూగించిన ఉసేన్ బోల్ట్ ఒకే ఒక్క సందర్భంలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పదవి ఎక్కిన ప్రతి వారికి పదవి దిగే రోజు వస్తుంది అన్నట్టుగా వరుసగా విజయాలందుకున్న వీరుడికి ఓటమి తప్పలేదు. 8 ఒలంపిక్ పథకాలు, 11 ప్రపంచ ఛాంపియన్ పథకాలు, 3 డైమండ్ లీగ్ ఫైనల్ విజేత, 2 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలుచుకుని తనని తానే జయించుకుంటూ ఎన్నో రికార్డులు సృష్టించిన ఉసేన్ బోల్ట్ తన చివరి ఆటలో ఒక మూడు సెకన్లు ఆలస్యమయ్యాడు. అది కూడా అనారోగ్య కారణాల వల్లే తప్ప వారి సామర్ధ్యాలను అందుకోలేక కాదు. ఏనాడూ తనకంటే ముందు పరుగెత్తని వారు ఆ రోజు ఇద్దరు యువకులు అతనికంటే ముందుకు పరుగెత్తారు. బోల్ట్ తిరోగమనం చూసి అభిమానులే కాదు కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. ఏంటి ఏనాడూ వెనకపడని బోల్ట్ ఈరోజు వెనకబడటం ఏంటి? ఇది కలా నిజమా అనుకున్నాడు గెలిచిన వ్యక్తి. ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ళ మీద నిలిచి మోకరిల్లాడు. ఆ దృశ్యాన్ని చూసిన బోల్ట్ అభిమానులు అతని ఓటమిని కూడా పండగలా జరుపుకున్నారు.

ఈ జమైకన్ వీరుడు ఒక దశాబ్దం పాటు ప్రపంచాన్ని శాసించాడు. 30 సార్లు అతను ప్రపంచంలోని చాలా మంది రన్నింగ్ క్రీడాకారులతో పోటీ పడ్డాడు. అందులో 9 సందర్భాల్లో మాత్రమే కొంతమంది మారక ద్రవ్యాలు పుచ్చుకొని పరుగులు తీశారు. ఆ 9 సందర్భాలలో కూడా బోల్ట్ విజయాలే. బోల్ట్ వేగంలో గాలికి పాఠం నేర్పిన గురువు.

ప్రపంచంలోని క్రీడాకారుల్లో మకుటం లేని మహారాజుగా నిలిచిన ఉసేన్ బోల్ట్ ఓటమి అనంతరం అభిమానులతో ఇలా అన్నారు "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒకరోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతివాడికి ఏదో ఒకరోజు గెలుపు తప్పదు, నేను మీలా మామూలు మనిషిని నాకు కూడా ఓటమి తప్పలేదు అని అభిమానులకు ఒక గొప్ప సందేశం అందించారు.

సాధించిన రికార్డులు:

ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లో (2008, 2012 మరియు 2016) ఒలింపిక్ 100 మీ మరియు 200 మీటర్ల టైటిళ్లను గెలుచుకున్న ఏకైక స్ప్రింటర్. అతను రెండు 4 × 100 రిలే బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. అతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సమయాల్లో డబుల్ స్ప్రింట్ విజయంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందారు, ఇది పూర్తిగా ఆటోమేటిక్ టైమింగ్ తప్పనిసరి అయిన తర్వాత రెండు రికార్డులు కలిగి ఉన్న మొదటి వ్యక్తి గా ఉసేన్ బోల్ట్ పేరు నిలిచింది.

పదకొండు సార్లు ప్రపంచ ఛాంపియన్, అతను 2009 నుండి 2015 వరకు వరుసగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ 100 m, 200 m మరియు 4 × 100 m రిలే బంగారు పతకాలను గెలుచుకున్నాడు, 2011లో 100 m ఫాల్స్ స్టార్ట్ మినహా. అతను అత్యంత విజయవంతమైన పురుష అథ్లెట్. బోల్ట్ 200 మీటర్లలో నాలుగు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి అథ్లెట్ మరియు 100 మీటర్లలో మూడు టైటిల్‌లతో అత్యంత విజయవంతమైన వారిలో ఒకరు, సబ్-9.7 మరియు సబ్-9.6 పరుగులు సాధించిన మొదటి వ్యక్తి.

ఓటమి నేర్పిన పాఠం:

9 ఏళ్ల పాటు ప్రపంచానికి మకుటం లేని రారాజుగా నిలిచిన బోల్ట్ ఎట్టకేలకు తాను మామూలు మనిషినేనని చెప్పారు. ప్రపంచాన్ని ఏలిన ఈ జమైకా వీరుడు ఎన్నో గొప్ప విజయాలు సాధించినా నేనూ మీలాంటి సామాన్యుడిని అని గర్వం లేకుండా ప్రకటించుకోవడం బోల్ట్ మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. బోల్ట్ లాంటి మామూలు మనుషులు ప్రపంచంలో కొందరు ఉంటారు. పదవిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఓటమి తప్పదని గుర్తిస్తే అందరూ సామాన్యులే. గెలుపు ఓటములు మనిషికి కొన్ని పాఠాలు నేర్పుతాయి.

యువతకు సందేశం:

సాధన చేస్తే ఈ ప్రపంచంలో మనిషి సాదించనిది ఏదీ లేదనడానికి ఉసేన్ బోల్ట్ ఒక ఉదాహరణ. ఉసేన్ బోల్ట్ కు చిన్నప్పటి నుంచి చదువు పై కాకుండా క్రీడలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. బోల్ట్ కి ఎక్కువ నచ్చిన ఆట క్రికెట్. కానీ బోల్ట్ ఒక సందర్భంలో క్రికెట్ ఆడుతుండగా అతని రన్నింగ్ గమనించిన కోచ్ బోల్ట్ కి ఒక మంచి సలహా ఇచ్చారు "నీకు క్రికెట్ కంటే రన్నింగ్ క్రీడలోనే భవిష్యత్తు ఉంటుంది దాన్ని సరైన మార్గంలో ప్రయత్నిస్తే నువ్వు గొప్ప క్రీడాకారుడివి అవుతావు అని కోచ్ సలహా ఇచ్చాడు. ఆయన సలహా తూచా తప్పకుండా మరుసటి రోజునుండి ప్రయత్నించి ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొంటు ప్రపంచ విజేతగా నిలిచాడు. ఏ పనైనా కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే ప్రతి ఒక్కరు విజేతే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

24/10/2023
ఆశయాలకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన"హారిక"విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడ...
12/11/2022

ఆశయాలకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన"హారిక"

విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్నికూడా మించి పోయాడు.

అలాంటి అభినయ ఏకలవ్యుడిలాంటి స్ఫూర్తిదాయకమైన యధార్థ విజయ గాథ నిజామాబాద్, నాందేవ్ గూడకు చెందిన సతీష్ కుమార్, అనురాధ దంపతుల కుమార్తె హారికది.

హారిక తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి అనురాధ బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.చిన్నప్పటినుండి చదువులో అందరికంటే ముందుండే హారిక ఏడవతరగతిలో ఉన్నపుడే తనకు డాక్టర్ కావాలనే కోరిక కలిగిందని చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పట్టుదలతో చదివిన ఆమె పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది. తన చిన్ననాటి ఆశయ సాధన కోసం నీట్ పరీక్ష రాయాలనుకుంది. కానీ నీట్ కోచింగ్ కోసం ఆర్ధిక స్థోమత లేకపోయినప్పటికీ నిరుత్సాహం చెందక తల్లి ప్రోత్సహంతో ముందడుగు వేసింది. నిరుపేదరాలైనప్పటికీ, మనుసుంటే మార్గాలెన్నో అన్నట్లు హారిక పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ప్రతిరోజూ యూట్యూబ్ లో దీక్షగా వీడియో క్లాసులు చూస్తూ పరీక్షకు సిద్ధమైంది. కోచింగ్ కు డబ్బులు లేవని ఆగిపోకుండా తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకొని ఘోర తపస్సు చేసి నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. ఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. కోచింగ్ లేకుండా మంచి ర్యాంక్ సాధించినప్పటికీ కాలేజీలో సీట్ వచ్చిన తరువాత ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ కలిపి మొత్తం 2 లక్షలవరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలేనిరుపేదరాలైన హారిక డబ్బు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతూ తన చదువుకోసం ఆర్ధిక సహాయం అందించాలని దాతలను వేడుకోగా అందుకు ఎంతోమంది దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయం.

నేటి యువతకు ఇంటర్నెట్ (మొబైల్) నిత్యవసర వస్తువులా మారిపోయింది. కొంతమంది ఇంటర్నెట్ ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా వృధాచేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభం, నష్టం అనేది వినియోగదారుడిమీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ ని మంచికి వాడితే మాత్రం ఈ భూమిమీద తెలియని విషయాలెన్నోతెలుసుకోవచ్చు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలల్లో దొరకని సమాచారం కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్ లో క్లాసులు వింటూ నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్ సాధించిన హారిక విజయమేఇంటర్నెట్ ని మంచికి ఉపయోగిస్తే విద్యార్థులకు ఎంత ప్రయోజనకరమో తెలిపే ఒక చక్కటి ఉదాహరణ.

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్న హారిక ఎందరికో ఆదర్శం.

సాధించాలనే తపన ఉంటేఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

అసాధ్యమనే పదంలో"అ" అనే అక్షరాన్ని పక్కనే పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

ప్రతి విద్యార్థి అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.



మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

మా ఊరి జ్ఞాపకాలు

Address

Gummadavelly
Suryapet
508280

Telephone

+919391480475

Website

Alerts

Be the first to know and let us send you an email when Kota_Articles posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kota_Articles:

Share

Category


Other Newspapers in Suryapet

Show All