06/11/2024
సినిమాకి ఉండాల్సిన లక్షణాల్లేవు...
మనిషికి ఉండాల్సిన లక్షణాలు చెప్పింది
మంచి కధా లేదు మంచి కామెడీ లేదు మంచి ట్విస్టు లేదు మంచి పాటా లేదు...కానీ ఈ సినిమా "మంచిగుంది"కారణం ఈ సినిమా లో ఉన్నదంతా మంచి కాబట్టి... మంచి మాత్రమే కాబట్టి.
కొంత కాలం క్రితం ఇలాంటి సినిమా తెరకెక్కడం అటుంచి అసలు అలాంటి ఆలోచన ఎవరైనా చెప్పినా వాడో జోకర్ అయ్యేవాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇది తెరకెక్కింది? నాలాంటి చాలా మందికి ఎందుకు తలకెక్కింది?ఎందుకంటే కొంతకాలం క్రితం ఈ సినిమాలో లాంటి మంచోళ్ళు బయటా వుండేవారట కానీ ఇప్పుడు భూతద్దం పెట్టి వెదికినా.....కనపడడం కష్టమేనట..
సాధారణంగా బయట లేనివి, జరగనివి సినిమాలో చూపిస్తారు మన ఊహలకు కలలకు కలర్ ఫుల్ రూపం ఇస్తారు అందుకే అవి మనకి నచ్చుతాయి. ఒంటి చేత్తో వందమందిని కొట్టే హీరోయిజం కావచ్చు పొట్టి దుస్తులతో చిందులేసే హీరోయినిజం కావచ్చు.. నిజ జీవితంలో మనకి అపురూపమైనవే తెర జీవితాల్లో చూసి ఆనందపడతాం
స్వంత ఇంటితో ముడిపడిన సత్యం సెంటిమెంట్ దగ్గర నుంచీ ఏనాడో సత్యంకు సైకిల్ స్నేహం ద్వారా రుణపడిన సుందరం కమిట్ మెంట్ దాకా... ఇప్పుడున్న మనస్తత్వాల్లో చూడగలమా. అందుకే కేవలం ఇద్దరు స్నేహితుల చిన్ననాటి ముచ్చట గొప్ప విశేషంగా మారి మన కళ్ళప్పగించేలా చేసింది..
ఎదిగే తొందరలో అయిష్టంగానో అప్రయత్నంగానో మనం చేజార్చుకున్న ఎన్నో మంచి లక్షణాలను ఈ సినిమా గుర్తు చేస్తుంది.. ఎవరైనా చిన్న సాయం చేసినా గుర్తుపెట్టుకోవాలని.. ఎంత గాయం చేసినా క్షమించేయాలని.. ఇద్దరి మధ్య బ్రతకాల్సింది క్విడ్ ప్రోకో పంపకాలు కాదు నేమరేసుకోదగ్గ జ్ఞాపకాలని.. ఇలా ఎన్నో.
ఇంటికి వచ్చిన మనిషికి గ్లాసుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా బద్దకిస్తున్న రోజుల్లో చిన్ననాటి స్నేహాన్ని, చిన్నపాటి సాయాన్ని గుర్తుంచుకొని దోసిళ్ళ కొద్దీ ప్రేమ పూర్వక అతిధ్యాన్ని తిరిగివ్వడం అంటే ఈ రోజుల్లో అపురూపం కాకుండా ఎలా ఉంటుంది
అందరూ మంచోళ్లే ఉన్న ఈ సినిమాలో మహా మంచోడు సుందరం..తనని చూసి ఎప్పుడో మర్చిపోయిన మనలోని మహా మంచిని గుర్తు చేసుకుంటాం మనందరం...
ఇప్పుడే కాదు సమీప భవిష్యత్తులో కూడా చూడలేమేమో అనిపించే మంచి కోసం మాత్రమే..
సత్యం సుందరం చూడాలి...