28/05/2023
ఆడపిల్ల పుట్టిందన్న ఆనందం; ఏనుగుపై ఊరేగించిన తండ్రి!!
ఆడపిల్ల పుట్టిందంటే ఇప్పటికీ చాలా ప్రాంతాలలో వివక్ష కొనసాగుతుంది. కడుపులో ఉన్నది ఆడ బిడ్డ అని తెలియగానే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్న వారు కూడా లేకపోలేదు. ప్రభుత్వం ఆడపిల్లల్ని కాపాడుకోవాలని పెద్ద ఎత్తున బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రచారం చేస్తున్నా ఆడ పిల్లల గొప్పతనం తెలియనివారు ఇంకా ఉన్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అయితే ఆడపిల్ల పుట్టిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్న వారు కూడా లేకపోలేదు.ఆడపిల్ల పుట్టిందని, ఆడపిల్ల లక్ష్మీ సమానమని చెప్పే ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. తాజాగా అటువంటి ఘటనే మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్ గావ్ లో జరిగింది.
35 ఏళ్లుగా ఆడ సంతానమే లేని ఆ కుటుంబంలో ఆడపిల్లలు పుట్టడంతో వారి సంతోషం అంబరాన్ని తాకింది. పట్టరాని సంతోషంతో తండ్రి, తనకు ఆడపిల్ల పుట్టింది అన్న విషయాన్ని అందరికీ తెలియ చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా తన బిడ్డను ఇంటికి ఆహ్వానిస్తూ తండ్రి ఘన స్వాగతం పలికాడు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్ గావ్ లో నివసించే గిరీష్ పాటిల్ కు ఐదు నెలల క్రితం కూతురు పుట్టగా ఆయన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ముద్దుగా ఆమెకు ఐరా అని పేరు పెట్టుకున్నాడు. తొలిసారిగా నిన్న చిన్నారి ని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. దీంతో ఆమెకు ఘన స్వాగతం పలకడానికి హంగామా చేశాడు.
ఏనుగు పై ఉరేగిస్తూ, డప్పు వాయిద్యాల మధ్య, తన బిడ్డను అందరికీ చూపిస్తూ ఇంటికి ఘనంగా తీసుకు వెళ్ళాడు గిరీష్ పాటిల్. 35 ఏళ్ల తర్వాత తమ వంశంలో ఆడపిల్ల పుట్టిందని, ఎంతో కాలంగా ఆడపిల్ల కోసం తమ వంశం ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇంత కాలం తర్వాత తమకు ఆడపిల్ల పుట్టడంతో సంతోషంగా ఉన్నామని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.