07/10/2022
జస్ట్, ఓ ప్రాంతీయ పార్టీ పేరు మార్పిడి ప్రొసీజర్...
గాయిగత్తర..!
★ ఎవరి మాట వినడు కదా.!
★ ఇదేమైనా కొత్త విషయమా..?
★ పేరు మారితే 'జాతీయ' పార్టీ' కాదు
★ శివాలెత్తిన మీడియా..!
★ చేసినవన్నీ మర్చిపోవాలా?
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు,9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)
జస్ట్, పార్టీ పేరు మారింది… అంతే… ఎందుకు..? ఇప్పుడున్న పేరులో 'తెలంగాణ' అని ఉంది కాబట్టి, అదీ మరీ ప్రాంతీయతను సూచిస్తున్నది కాబట్టి, తనకు జాతీయ స్థాయి కావాలి కాబట్టి…! కొత్త పార్టీ పెట్టుకుంటే ఇప్పుడున్న ఎన్నికల గుర్తు పోతుంది… ఎన్నికల సంఘం దగ్గర ప్రొసీజర్ మళ్లీ 'జీరో' నుంచి మొదలుపెట్టాలి. పైగా రాష్ట్రానికి ఓ పార్టీ, దేశానికి ఓ పార్టీ బాగుండదు కాబట్టి…! ఇఃత 'గాయగత్తర అవసరమా' అనేది ప్రశ్న.
ఎవరి మాట వినడు కదా.!:
మరి ఈ కొత్త పేరునైనా జనంలోకి తీసుకుపోవడం కష్టం కాదా… 'కష్టమే… !'బీజేపీ, కాంగ్రెస్ సరిగ్గా వాడుకుంటే టీఆర్ఎస్‌కు 'నష్టమే…!' కానీ కేంద్రంలో చక్రాలు తిప్పాలంటే తప్పదు కదా…! మరి చంద్రబాబు 'తెలుగుదేశం' అనే పేరు కూడా ప్రాంతీయతను సూచించేదే ఐనా దాన్నే స్వయం ప్రకటిత జాతీయ పార్టీని చేశాడు కదా…! చేశాడు… నిజానికి 'టీఆర్ఎస్' అనే పేరున్నా పెద్ద 'ఫరక్' ఏమీ పడదు… కానీ కేసీయార్‌కు ఎవరు చెప్పగలరు..? అందుకని జరిగేది చూడటమే…!
ఇదేమైనా కొత్త విషయమా..?:
'జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తా, దేశమంతా అగ్గిపెడతా, గాయిగత్తర లేపుతా' అని గత లోకసభ ఎన్నికల ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడు. పోనీ, ఇదొక్కటే కొత్తగా జాతీయ పార్టీ అవుతోందా..? ఇదే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పాటు తెలుగుదేశం, మజ్లిస్ కూడా జాతీయ పార్టీలే… చివరకు ఒక్క సీటూ లేని (ఒక సీటు ఉండే.. ఆయన జంప్ జిలానీ) జనసేన కూడా రెండు రాష్ట్రాల పార్టీ… వీటిలో బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించిన జాతీయ పార్టీలు.
పేరు మారితే 'జాతీయ' పార్టీ' కాదు:
ఇప్పుడు 'భారత్ రాష్ట్ర సమితి' అని పేరు మార్చగానే టీఆర్ఎస్ కాస్తా జాతీయ పార్టీ అయిపోదు. దానికి కొన్ని లెక్కలుంటయ్.! ఈ పేరుమార్పిడి ముహూర్తానికి గాంధీ 'క్విట్ ఇండియా మూమెంట్'కు పిలుపునిచ్చినట్టు… 'కలరింగ్' ఇచ్చింది 'నమస్తే తెలంగాణ' పత్రిక. అప్పట్లో, యాభై ఏళ్ల కింద జయప్రకాశ్ నారాయణ 'ఇందిర ఎమర్జెన్సీ'కి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ''మహోజ్వల ఘట్టం'తో పోల్చింది… సరే, ఆయన సొంత పత్రిక ఇంకేం రాయగలదు..? ఆ డప్పు, ఆ హైప్ అవసరం.
శివాలెత్తిన మీడియా..!:
మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైనట్టు రాసేస్తున్నారు… నిజానికి ఒక పార్టీ పేరు మారితే అంత 'సీన్' ఉంటుందా అనడక్కండి… నిజంగా కేసీయార్ కావాలని అనుకుంటే ఏ పేరూ మార్చకుండానే జాతీయ రాజకీయాల్లో చురుకుగా కదలొచ్చు… ఎవరికీ అభ్యంతరాలుండవు… పేరు మారగానే హఠాత్తుగా వచ్చే రాజకీయ ప్రయోజనాలూ ఉండవు… ఇదొక చిన్న ప్రొసీజర్… కానీ చివరకు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి కూడా ఈ మాయలో పడి కొట్టుకుపోయాయి… ఏవో చిన్న పత్రికలు యాడ్స్ కోసం డప్పు కొట్టవచ్చుగాక… చివరకు ఈ మూడూ అంతేనా..? సరే, నమస్తే సాక్షిని కూడా వదిలేస్తే… రాబోయే రోజుల్లో తమ జన్యుబంధువు తెలుగుదేశాన్ని చికాకు పెట్టే బీఆర్ఎస్ గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎందుకంత ప్రేమ.
ఇదీ తీర్మానం…:
పార్టీలోని వివిధ స్థాయిల కమిటీలు సంతకాలు చేసి, ఎన్నికల సంఘానికి పేరు మార్పిడి తీర్మానాన్ని పంపించాయి. ఆ తర్వాత జరగాల్సింది కేవలం ఒక సాధారణ ప్రొసీజర్ మాత్రమే.!
కొసమెరుపు:
బుధవారం దసరా కావడంతో ఫ్రింట్ మీడియాకు సెలవు. గురువారం పత్రికలు రావు. జాతీయ పార్టీ పేరుతో చేసిన హంగామా, గాయగత్తర విషయాలన్నీ రాయలేకపోయాయి. సో.. శుక్రవారం నాటికి అది చద్ది వార్త. ఎంత బాగా వడ్డివారిం చారో చూడండి. హతోస్మి. ధన్యోస్మి.
బాక్స్:
అన్నీ మర్చిపోవాలా?:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు12వందల మంది, కోట్లాది మంది రోడ్లు ఎక్కితే ఏర్పడింది. ఆత్మహత్యల పునాదులపై ఏర్పడిన పరిస్థితులు వేరు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు సైతం లెక్ఋకు మిక్కిలి ఉన్నట్లు సోషల్ మీడియాలలో పుంఖాను పుంఖాలుగా కథనాలు. జర్నలిస్టుల అరెస్టులకు కొదవ లేదు. నోరెత్తితే నిర్భంధాలకు కొదవలేదు. ఇక్కడ అధికారంతోనే ఢిల్లీలో 'లిక్కర్ స్కాం' చేయగలిగారంటే..ఈ పార్టీ జాతీయ స్థాయిలో అధికారం చెపడితే పరిస్థితి మీం చెప్పం. ఇక నెక్స్ట్ ఏమిటి..? కేసీయార్, తన ముఖ్య కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో ఫ్లయిట్ ఎక్కడం, తన ఫ్లయిటే… కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనం బ్యాక్ యార్డులో దిగి, నేరుగా వెళ్లి కుర్చీలో కూర్చోవడం…! మోడీ దొడ్డిదారిలో హిమాలయాలకు వెళ్లిపోయి, ఏదో గుహలో తలదాచుకోవడం…! రాహుల్ భారత్ జోడోను వదిలేసి, మళ్లీ ఏదో మనకు తెలియని విదేశానికి చెక్కేయడం…! అబ్బే, వెటకారం కాదు, మన మీడియా ధోరణి ఆ కోణంలోనే సాగుతోంది మరి…!!