16/02/2023
జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తులను వస్తు సేవల పన్ను (GST) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే, అందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా అంగీకరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రాలు అంగీకరించిన వెంటనే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి (petrol under gst) తీసుకొస్తామన్నారు. వార్షిక బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన అనంతరం బుధవారం పారిశ్రామిక సమాఖ్య PHDCCI సభ్యులతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక ఏకీకరణ చేసేందుకు అనుగుణంగా ఉందన్నారు.
పెట్రోల్, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి (petrol under gst India) తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని నాలుగు నెలల క్రితమే పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. అయితే, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలపాలని, లేకపోతే వీలు కాదన్నారు. రాష్ట్రాలు అందుకు అంగీకరిస్తాయని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రాలు, ప్రధానంగా లిక్కర్, పెట్రోలియంను ఆదాయ వనరులుగా చూస్తున్నాయని, అటువంటి వాటిని వదులుకునేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరిస్తే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తామని గతంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొనగా.. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం అదే ప్రకటన చేశారు.